Social Media Ban In Sri Lanka : శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేనే కారణమంటూ ప్రభుత్వం పైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సాధారణ ప్రజలు సైతం వీధుల్లోకి వస్తున్నారు.రోజురోజుకు ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అధ్యక్షుడు రాజపక్సకు వ్యతిరేకంగా జరగుతున్న నిరసన కార్యక్రమాలను నిలువరించడానికి శ్రీలంక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించిన రాజపక్సే ప్రభుత్వం..తాజాగా సోషల్ మీడియాపై నిషేధం విధించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో లంకలో ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి.
దేశంలోని పరిస్థితులపై తప్పుడు ప్రచారం బయటకు వెళ్లకుండా ఉండేదుకే ఇలా చేసినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే సోషల్ మీడియా నిషేధం నిర్ణయంపై స్వపక్షంలోనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాను నిషేధించడాన్ని తాను ఎప్పటికీ సమర్ధించనని ఆ దేశ యువజన, క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స అన్నారు. ఇలాంటి ఆంక్షలు అస్సలు పనిచేయవని చెప్పారు. అధికారులు మరింత ప్రగతిశీలంగా ఆలోచించాలని, నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. మరోవైపు, ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్ అందించిన నాలుగో డీజిల్ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది.
ALSO READ Chinese Rocket : భారత గగనతలంలో పేలిన చైనా రాకెట్
కరోనా దెబ్బకు శ్రీలంక ఆర్దిక వ్యవస్థ దారుణగా దెబ్బ తింది. శ్రీలంక గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఆహారం కొరత,చమురు, నిరంతర విద్యుత్ కొతలు,పెరుగుతున్న ధరలతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు. వేలాది మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వలసబాటపడుతున్నారు. అయితే గొటబయ రాజపక్సే నేతృత్వంలోని ప్రభుత్వం శ్రీలంకలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేశాయి. దేశ పాలనలో స్థిరత్వం తెస్తానంటూ వాగ్దానాలు చేసిన రాజపక్స 2019లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అధికార పీఠం ఎక్కిన తర్వాత.. తక్కువ పన్ను రేట్ల వంటి అమలుకు సాధ్యం కాని అనేక హామీలను సర్కార్ అమలు చేసింది. వ్యాట్‌ను 15శాతం నుంచి 8 శాతానికి కుదించింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. నిధుల సమీకరణకు కీలకంగా ఉన్న నేషన్ బిల్డింగ్ ట్యాక్స్, పేయీ ట్యాక్స్, ఆర్థిక సేవల పన్నును పూర్తిగా రద్దు చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 33.5 శాతం మేర పడిపోయింది. చైనాకు మహీంద్ర మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఒకరకంగా ఆ దేశాన్ని కొంపముంచింది.
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు కొద్ది రోజుల క్రితం శ్రీలంక కు భారత్ చేయూతనిచ్చింది. జనవరిలో ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)... శ్రీలంకకు 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ వెసులు బాటును కల్పించింది. భారత్ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్‌ను ప్రకటించింది. మార్చి రెండోవారం నుంచి ఆ దేశానికి మన ఐఓసీ చమురును సరఫరా చేస్తోంది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి సైతం భారత్ మరో 1 బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Social Media, Sri Lanka