భారత్‌కు పొరుగునే ఉన్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఆహార సంక్షోభంతో జనం విలవిల్లాడిపోతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఐదు నుంచి పది రెట్లు పెరిగాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ నిల్వలు దాదాపు నిండుకుపోయాయి. ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పెట్రోలు కోసం వేర్వేరు క్యూలలో నిల్చున్న ఇద్దరు వ్యక్తులు కుప్పకూలి మరణించారు. దేశంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్టు పోలీసులు తెలిపారు.
పెట్రోలు, కిరోసిన్ కోసం క్యూలలో ఎదురుచూస్తూ ఇద్దరు వృద్ధులు మరణించారని, వీరిలో ఒకరి వయసు 70 కాగా, రెండో వ్యక్తి వయసు 72 ఏళ్లని కొలంబో పోలీసు ప్రతినిధి నళిన్ తల్దువా తెలిపారు. నాలుగు గంటలుగా వారు క్యూలో నిల్చోవడంతో స్పృహతప్పి పడిపోయి చనిపోయారని పేర్కొన్నారు.
శ్రీలంక గత కొన్ని రోజులుగా తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు రూ.35 పలుకుతుండగా, కిలో చికెన్ రూ. 1000 పైమాటే. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలైతే అందకుండా పోయాయి.
లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ. 283గా ఉండగా, డిజిల్ రూ. 220గా ఉంది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ రూ. 270కు పడిపోయింది. ఇక, కరెంటు ఊసే లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. దేశంలో ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
విపరీతమైన కరెంటు కోతలతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా ఉంది. దేశంలో చమురు నిల్వలు తగ్గిపోవడంతో దేశంలోని ఏకైక ఇంధన రిఫైనరీలో కూడా పని ఆపేశారు. ఈ విషయాన్ని ఆదివారం నాడు శ్రీలంక పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనిస్ అధ్యక్షుడు అశోక రణవాల వెల్లడించారు. ఇక్కడ గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు కిరోసిన్ వాడకం మొదలుపెట్టాయి. ఇక్కడ ద్రవ్యోల్బణం ఆసియాలో ఏకంగా 15.1 శాతానికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fuel prices, International news, Sri Lanka