Sri Lanka Crisis : కేవలం 2.2 కోట్ల జనాభా ఉండే శ్రీలంక.. కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని నెలలుగా అక్కడ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో ఆహారం, గ్యాస్, పెట్రోలియం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తోడు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కారణంగా లంక పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. విద్యుత్ కోతలు, ఖాళీ ఏటీఎంలు, పెట్రోల్ బంకుల ముందు భారీ క్యూలు సర్వసాధారణం అయ్యాయి. శ్రీలంక దాదాపు ప్రతీది దిగుమతి చేసుకుంటుంది. పెట్రోలియం నుంచి ముడి చక్కెర వరకు అన్నీ దిగుమతులే. ఇప్పుడు దిగుమతులకు అంతరాయం కలగడంతో భారీ ద్రవ్యోల్బణం, అత్యవసర వస్తువులకు సుదీర్ఘ క్యూలు ఏర్పడుతున్నాయి. అయితే ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక మంగళవారం సంచలన ప్రకటన చేసింది. దేశ ఖజానా దివాలా తీసిందని..కాబట్టి విదేశీ రుణాలు చెల్లించలేమని చేతులెత్తేసింది.
51 బిలియన్ డాలర్ల అప్పును తీర్చలేమని లంక ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసరంగా అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారకద్రవ్యం అయిపోయిన నేపథ్యంలో.. ఈ చర్యను "చివరి ప్రయత్నం"గా పేర్కొంది. శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో... విదేశీ ప్రభుత్వాలతో సహా రుణదాతలు మంగళవారం నుండి వడ్డీ బాకీలను అసలు రుణంలో కలుపుకోవాలని తెలిపింది. లేదంటే శ్రీలంక కరెన్సీలో తిరిగి పొందవచ్చునని పేర్కొంది. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఈ అత్యవసర చర్యను చివరి ప్రయత్నంగా మాత్రమే తీసుకుంటోంది అని ఆ ప్రకటనలో పేర్కొంది. 2022 ఏప్రిల్ 12నాటికి బాకీ ఉన్న ప్రభావిత రుణాలకు ప్రభుత్వ విధానం వర్తిస్తుందని తెలిపింది. ఈ తేదీ తర్వాత నూతన రుణ సదుపాయాలు, అదేవిధంగా ప్రస్తుత రుణ సదుపాయాల ప్రకారం విడుదలైన మొత్తాలకు ఈ విధానం వర్తించదని, వీటికి మామూలుగానే సేవలందిస్తామని వివరించింది. రుణదాతల పరిశీలన కోసం ఓ రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్‌ను సమర్పించే వరకు అన్ని ప్రభావిత రుణాల దాతలు ఈ మధ్యంతర కాలంలో తమకు రావలసిన అసలు, వడ్డీ సొమ్మును అసలులో కలుపుకోవాలని తెలిపింది. సంబంధిత రుణానికి వర్తించే సాధారణ కాంట్రాక్చువల్ రేటుకు మించని వడ్డీ రేటును వర్తింపజేసుకోవాలని పేర్కొంది.
ఇక,దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే అన్నారు. ఆర్ధిక సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని విపక్ష నేత సాజిత్ ప్రేమదాస ఆరోపణలను రాజపక్సే తోసిపుచ్చారు.
ALSO READ Intresting : మాట రాని మౌనమిది..చదివాకా చప్పట్లు కొట్టించే కథ ఈమెది
మరోవైపు శ్రీలంకలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. గత కొద్దిరోజులుగా సాగుతున్న నిరసనలు ఉధృతమయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలమంది లంకేయులు రోడ్డెక్కారు. లంకేయుల ఆందోళనకు బౌద్ధగురువులు మద్దతు తెలిపారు. ప్రజలు నిరసనలు విరమించి రోడ్లపై నుంచి వెనక్కి మరలాలని శ్రీలంక ప్రధాని కోరారు. వీధుల్లో నిరసనలతో నగద కొరతను ఎదుర్కొంటున్న దేశానికి ఆర్ధిక సాయం అందడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ALSO READ Shocking : కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం..మధ్యలో ఆపేద్దామంది..కత్తితో దారుణంగా 16 పోట్లు
మరోవైపు, ఈ తీవ్ర సంక్షోభం నుంచి లంక బయటపడాలంటే..ఇంధనం మరియు మందులతో సహా అవసరమైన వస్తువుల సరఫరాలను పునరుద్ధరించడంలో సహాయపడటానికి..వచ్చే ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని శ్రీలంక ఆర్థిక మంత్రి అలీ సర్బీ రెండు రోజుల క్రితం తెలిపారు. అప్పుడే ప్రజలకు అన్ని రకాల వస్తువులను సరఫరా చేయగలమన్నారు. ఈ విషయమై అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం అని సర్బీ తెలిపారు. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ లతో పాటు చైనా, అమెరికా, బ్రిటన్, మధ్య ప్రాశ్చ్య దేశాల నుంచి ఆర్థిక సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Sri Lanka