news18-telugu
Updated: November 17, 2020, 3:12 PM IST
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(ఫైల్ ఫోటో)
భారత పురాణేతిహాసాలయిన రామాయణం, మహాభారతం గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒబామా 2008 నుంచి 2012 మధ్య అమెరికా అధ్యక్షుడిగా గడిపిన కాలానికి సంబంధించిన అనుభవాలు, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఓ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకానికి ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్.’ అని పేరు పెట్టారు. ఆ పుస్తకం ఈ రోజు (నవంబర్ 17)న రిలీజ్ అయింది. దీనిపై ఇప్పటికే న్యూయార్క్ టైమ్స్ పత్రిక సమీక్షించించింది. ఆ పుస్తకంలో ఓ చోట ఒబామా రామాయణం, మహాభారతం గురించి చెప్పారు. ‘భారత్ అంటే నా ఊహల్లో ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. బహుశా నా చిన్నతనంలో ఇండొనేసియాలో ఉన్నప్పుడు రామాయణం, మహాభారత గాథలను వింటూ పెరిగా. అలాగే, ‘తూర్పు మతాల’మీద నా ప్రత్యేక అభిరుచి వల్ల కూడా కావొచ్చు. అలాగే, భారత్, పాకిస్తానీ కాలేజ్ ఫ్రెండ్స్ నాకు దాల్ (పప్పు), కీమా వండడం కూడా నేర్పారు. బాలీవుడ్ సినిమాలను పరిచయం చేశారు.’ అని ఒబామా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. అలాగే, భారత్ గురించి ప్రస్తావిస్తూ 2010లో అమెరికా అధ్యక్షుడి హోదాలో మొదటిసారి ఇండియాలో అడుగు పెట్టానని చెప్పారు. అయినా, తన ఊహల్లో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ‘భారీ దేశం. ప్రపంచ జనాభాలో ఆరింట ఒక వంతు జనాభా ఉంది. సురు 2000 తెగలు (జాతులు) ఉటాయి. 700కు పైగా భాషలు మాట్లాడతారు. బహుశా అందుకే భారత్ అంటే ప్రత్యేక స్థానం ఉంది.’ అని ఒబామా పుస్తకంలో పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై విమర్శలు, మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు'కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలో ఎక్కడో తెలియని భయం ఉంది. తరగతి గదిలో టీచర్‌ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించే విద్యార్థిలా రాహుల్ చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే ఏదైనా ఓ విషయం గురించి లోతుగా నేర్చుకోవాలనే అభిరుచి, లక్షణం, పట్టుదల లేదు’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, దీనిపై విమర్శలు, ప్రతివిమర్శలు వినిపిస్తున్నాయి. ఓ భారతీయ నేతకు విదేశీయుడి సర్టిఫికెట్ అవసరం లేదంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసాధారణ విజ్ఞానం కలిగిన నిరాడంబరమైన వ్యక్తి అని ఒబామా కొనియాడారు. ‘భారత ఆర్థిక పరివర్తన ముఖ్య వాస్తుశిల్పిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ పురోగతికి తగిన చిహ్నంగా కనిపించారు.. ఓ చిన్న మతానికి చెందిన సిక్కు మైనారిటీ నేత భారత్‌లోని అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు.. స్వయం ప్రతిపత్తిగల ఈ నేత ఉన్నత జీవన ప్రమాణాలను తీసుకురావడం ద్వారా, అవినీతికి తావులేకుండా విశ్వాసాన్ని చూరగొన్నారు’ అని పేర్కొన్నారు. ‘1990లలో భారత్‌కు ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన వ్యక్తిని తనకు ఏడుపదుల వయస్సులో ఉన్నప్పుడు కలిశాను. ఆయన సున్నితంగా మాట్లాడే ఆర్థికవేత్త.. తెల్లటి గడ్డం, తలపాగాతో కనిపించారు. అతను ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ఆ దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడటానికి కృషి చేశారు.. మన్మోహన్ తెలివైనవారు.. నిజాయతీపరుడు’ అని ఒబామా పుస్తకంలో ప్రశంసించారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 17, 2020, 3:12 PM IST