Howdy Modi : హౌడీ మోదీ సభలో జాతీయ గీతం ఆలపించేది ఎవరో తెలుసా?

Howdy Modi : దివ్యాంగుడైన స్పర్ష్ షా... జాతీయ గీతం ఆలపించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. నేటి రాత్రి జరిగే హౌడీ మోదీ సభలో అతని పాట అందరి హృదయాల్నీ కదిలించనుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 11:19 AM IST
Howdy Modi : హౌడీ మోదీ సభలో జాతీయ గీతం ఆలపించేది ఎవరో తెలుసా?
Howdy Modi : హౌడీ మోదీ సభలో జాతీయ గీతం ఆలపించేది ఎవరో తెలుసా? (Credit - Twitter - Vikas Khanna)
  • Share this:
Howdy Modi : జాతీయ గీతం జనగణమన పాడటం మనందరికీ ఎంతో ఇష్టమైన అంశం. అమెరికాలో పాడితే... అదో ప్రత్యేకం. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, 50 వేల మంది ఎన్నారైల ముందు అమెరికాలో జాతీయ గీతం ఆలపిస్తే... అదో చరిత్రే. అలాంటి అరుదైన అవకాశం... సింగింగ్ సెన్సేషన్ స్పర్ష్ షాను వరించింది. ఈ ఎన్నారై టీనేజర్... నేటి రాత్రి 9.15కి జరిగే... హౌడీ మోదీ కార్యక్రమంలో జనగణమన పాడేందుకు సూపర్ సూపర్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నట్లు తెలిపాడు. హోస్టన్‌లోని NRG స్టేడియంలో ఈ చరిత్రాత్మక కార్యక్రమం జరగబోతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రోగ్రాం గురించి ఆసక్తిగా చూస్తున్నాయి. ముఖ్యంగా మోదీ, ట్రంప్ ఏం చెబుతారా అని ఎదురుచూస్తున్నాయి.


16 ఏళ్ల స్పర్ష్ షా... అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఒస్టియోజెనెసిస్ ఇంపెర్ఫెక్టా లేదా బ్రిట్టిల్ బోన్ వ్యాధి (Brittle Bone Disease) అది. దీని గురించి నాలుగు ముక్కల్లో చెబుతాను. ఇది అరుదైన వ్యాధి. ఇది సోకినవారికి ఎముకలు పెళుసుగా మారిపోతాయి. ఈజీగా ముక్కలైపోతాయి. ఎక్కువ మందికి పుట్టినప్పటి నుంచే ఈ వ్యాధి మొదలవుతుంది. ఐతే... ఫ్యామిలీలో ఇదివరకు ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే... వారి వారసులకు ఇది సోకే ప్రమాదం ఉంటుంది. ఇందులో కూడా ప్రధానంగా రెండు రకాలుంటాయి. తక్కువ స్థాయి వ్యాధి. ఎక్కువ స్థాయి వ్యాధి. స్పర్ష్ షాకి తక్కువ స్థాయిలో ఉన్నట్లు లెక్క. ఎక్కువ స్థాయిలో వ్యాధి ఉంటే... చెముడు వస్తుంది, గుండె జబ్బులు వస్తాయి, వెన్నెముక దెబ్బతింటుంది, ఎన్నో శరీర భాగాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. ప్రతీ 20 వేల మంది చిన్నారుల్లో ఒకరికి ఈ వ్యాధి సోకుతుంది.


దురదృష్టమేంటంటే... ఈ వ్యాధికి మందు లేదు. కాకపోతే... అది ముదరకుండా చేసేందుకు రకరకాల థెరపీలు ఉన్నాయి. ఏది ఏమైనా... ఇలాంటి వ్యాధులు సోకితే జీవితం నరకమే. ప్రతి రోజూ, ప్రతీ క్షణం పోరాటమే. అలాంటి బాధాకరమైన వ్యాధితో పోరాడుతూ కూడా స్పర్ష్ షా... ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. భవిష్యత్తును పాజిటివ్‌గా చూస్తున్నాడు. అందుకే ఈ టీనేజర్‌కి జనగణమన పాడే అవకాశం కల్పించారు.


హౌడీ మోదీ సభ వివరాలు :  ఎలా ఉన్నారు అనే పలకరింపే... హౌడుయుడు... దీన్నే సింపుల్‌గా హౌడీ అంటుంటారు అమెరికన్లు. ప్రధాని మోదీని కూడా సాదరంగా స్వాగతిస్తూ... హౌడీ మోదీ అని పలకరిస్తూ... జరగబోతున్న అతి పెద్ద కార్యక్రమమే హౌడీ మోదీ సదస్సు. మూడ్రోజుల కిందట భారీ వర్షాలు కురిసినా... ప్రస్తుతం NRG స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇందుకోసం 1500 మంది వాలంటీర్లు వారం నుంచీ శ్రమించారు. మోదీకి ఘన స్వాగతం పలుకుతూ 200 కార్లతో ర్యాలీ జరిగింది. ఈ సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెబుతారా అని ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. రెండు మధ్య సత్సంబంధాల్ని మరింత పెంచేలా ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని తెలిసింది.

నేడు ప్రధాని మోదీ... ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోదీ పాల్గొని, ప్రసంగిస్తారు. ఆరోగ్యం, టెర్రరిజంపైనా తన అభిప్రాయం వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. ఈ సదస్సు తర్వాత మోదీ హోస్టన్‌లోని NRG స్టేడియంలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన "హౌడీ మోదీ" చరిత్రాత్మక సదస్సులో పాల్గొంటారు. అమెరికా టైమ్ ప్రకారం 22న ఉదయం 10.45 గంటలకు ఇది జరగనుంది. భారత కాలమానం ప్రకారం... నేటి రాత్రి 9.15 గంటల తర్వాత మొదలయ్యే సభ... మూడు గంటలపాటూ సాగుతుంది. ఐతే... ఆ సదస్సుకు ప్రధాన అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొనే సభకు అమెరికా అధ్యక్షుడు రాబోతుండటం ఇదే తొలిసారి. అమెరికా చరిత్రలో పోప్‌ మినహా ఓ విదేశీ నేత పాల్గొనే సభకు ఈ స్థాయి ప్రజలు హాజరుకాబోతుండటం ఇదే మొదటిసారి. అనేక మంది కాంగ్రెస్‌ సభ్యులు, మేయర్లు, అమెరికన్‌ ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా 90 నిమిషాలపాటూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి. వీటిలో 400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తారు.

ఎన్నారైల సదస్సు తర్వాత 24న ఐరాస సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు మోదీ వెళ్తారు. అలాగే... అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా... ఐరాసలో 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. అదే సందర్భంలో పారిశ్రామిక వేత్తలు, భారత ప్రతినిధి బృందంతో మోదీ మాట్లాడతారు. ఆ తర్వాత 27న తిరిగి భారత్ వస్తారు.

మోదీ అమెరికా టూర్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రధానంగా ట్రంప్‌తో మోదీ ఈ ఏడాది మూడోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకుముందు జపాన్‌లో జరిగిన జీ20 సదస్సులో, ఆ తర్వాత ఆగస్ట్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో వాళ్లిద్దరూ కలిశారు. నేడు జరిగే హౌడీ-మోడీ ఎన్నారైల సదస్సులో ట్రంప్... ప్రవాస భారతీయులను ఉద్దేశించి... కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని తెలిసింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్న ట్రంప్... ఎన్నారై సదస్సును అందుకు వేదికగా చేసుకోబుతున్నారని తెలిసింది.

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల కారణంగా భారత్‌, పాకిస్థాన్‌ ప్రధానమంత్రులతో ట్రంప్‌ వేర్వేరుగా భేటీ కానున్నారు. నేటి హౌడీ మోదీ సభ తర్వాత మంగళవారం ట్రంప్‌-మోదీ భేటీ ఉంటుంది. అంతకంటే ముందుగా సోమవారం ఇమ్రాన్‌ ఖాన్‌తో ట్రంప్‌ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా... జమ్మూకాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు ట్రంప్ మరోసారి ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే... భారత్ ఈ విషయంలో ట్రంప్ అభిప్రాయాన్ని ఖండించే అవకాశాలే ఎక్కువ.
Published by: Krishna Kumar N
First published: September 22, 2019, 11:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading