సోమాలియా రాజధాని మొగదిషులో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవించింది. నగరానికి చెందిన ఓ చెక్ పాయింట్ వద్ద ఉన్న కలెన్షన్ సెంటర్ సమీపంలో ఈ శక్తివంతమైన పేలుడు జరిగింది. ఈ ఘటనలో కనీసం 76మంది మరణించారు. మరో 70 మంది దాకా గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అంటున్నారు. ఇప్పటివరకు 73 మృతదేహాలను గుర్తించినట్లు మేయర్ ఒమర్ మహమూద్ మొహమ్మద్ చెప్పారు. మృతుల్లో చాలా మంది యూనివర్శిటీ విద్యార్థులని, పేలుడు ధాటికి వారు ప్రయాణిస్తున్న బస్సు కూడా ధ్వంసమైనట్లు ఆయన చెప్పారు. పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఉదయం వేళ ఇక్కడ విపరీతమైన రద్దీ ఉండడం వల్లనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.
అయితే అల్ ఖైదాకు అనుబంధంగా ఉండే అల్షబాబ్ ఇస్లామిక్ మిలిటెంట్సంస్థ గతంలో కూడా మొగదిషులో పలు కారు బాంబు దాడులకు పాల్పడింది. 2017లో జరిగిన ట్రక్కు బాంబు పేలుడులో 300 మందికి పైగా చనిపోయారు. ఈ పేలుడుకు అల్ షబాబే కారణమని అప్పట్లో ప్రభుత్వం ఆరోపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, International