మన ఆహారం తినేటప్పుడు ఈగ గానీ, దోమ గానీ పడితేనే తట్టుకోలేం. భోజనం చేయాలన్న మూడు ఉత్సాహం పాడవుతుంది. ప్లేట్ తీసి పక్కన పెట్టేస్తాం. ఎవరైనా శాఖాహారులు తమకు ఇష్టమైన ఆహారం తింటున్న సమయంలో.. అందులో మాంసం ముక్కలు కనిపిస్తే.. వారి పరిస్థితి ఎలా ఉంటుంది? బాబోయ్.. నాన్ వెజ్ అంటూ.. ఆ ప్లేట్‌ను విసిరేస్తారు. చేతులతో పాటు నోటిని కూడా శుభ్రంగా కడుక్కుంటారు. మాంసం ముక్కలు పడితే అలా అనిపిస్తే.. మరి చనిపోయిన పాము తల కనిపిస్తే.. ఎలా ఫీలవ్వాలి. సాధారణంగా పామును చూస్తేనే చాలా మందికి భయంతో పాటు అసహ్యం వేస్తుంది. కానీ ఓ వ్యక్తికి తాను తింటున్న శాఖాహార భోజనంలో ఏకంగా.. పాము తల వచ్చింది. టర్కీలో ఓ విమాన సిబ్బందికి ఈ చేదు అనుభవం ఎదురయింది.
టర్కీలోని అంకారా నుంచి జర్మనీలోని డసెల్‌డార్ఫ్‌కు టర్కిష్-జర్మన్ ఎయిర్‌లైన్ కంపెనీ 'సన్ ఎక్స్‌ప్రెస్'కి చెందిన ఓ విమానం బయలుదేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా భోజనం చేశారు. ఆ విమానంలో సిబ్బంది ఒకరు తనకు ఇష్టమైన బంగాళా దుంప, పాలక్ కర్రీలని తీసుకున్నాడు. వాస్తవానికి అతడు శాఖాహారుడు. మాంసం అస్సలు ముట్టుకోడు. అందుకే బంగాళాదుంప కర్రీని తీసుకున్నాడు. ఐతే తింటున్న సమయంలో అందులో ఒక ముక్క తేడాగా కనింపించింది. ఏంటా అని కాస్త దగ్గరగా చూస్తే.. పాముతల..! ఆలూ కర్రీలో పాము తలను చూసి.. అతడు షాక్ అయ్యాడు. వాంతులు వచ్చినంత పని అయింది. ఆయన స్వయంగా విమాన సిబ్బంది. కంచంలో పాము తలను చూసి.. ఖంగుతిన్నాడు. ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు. ఐతే వెంటనే పాము తలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ విమానానికి ఆహారం సరఫరా చేసే కంపెనీ 'Sankk Inflight'పై అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఆ తర్వాత దీనిపై రచ్చ రచ్చ జరిగింది. ఎయిర్ లైన్స్ కంపెనీ, ఫుడ్ వెండర్ కంపెనీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? భోజనంలో పాము తల రావడమేంటని గట్టిగానే నిలదీశారు. కానీ ఆ ఫుడ్‌ని సరఫరా చేసిన Sankk Inflight కంపెనీ మాత్రం.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ పాము తల ఎలా వచ్చిందో తమకు తెలియదని.. తాము పంపే ఆహార పదార్థాలు ఎంతో నాణ్యతో కూడినవి ఉంటాయని తెలిపింది. వారి సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎయిర్ లైన్స్... సదరు కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసింది. ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం ఇవ్వడం తమ బాధ్యతని..ఇలాంటి నిర్లక్ష్యాన్ని అస్సలు ఉపేక్షించేది లేదని తెగేసి చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, International news, Snake, Viral Video