Woman Kidnap: ఆ దేశ రాయబారి కుమార్తె కిడ్నాప్.. ఆమెపై దుండగులు ఎంత దారుణానికి పాల్పడ్డారంటే..

ప్రతీకాత్మక చిత్రం

Pakistan: పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌లోని ఆఫ్ఘనిస్తాన్‌ దేశ రాయబారి నజీబుల్లా అలీఖీల్ కుమార్తెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి.. దారుణంగా హింసించారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    పాకిస్థాన్ లో మరోసారి నేరస్తులు రెచ్చిపోయారు. పాకిస్తాన్‌లోని అఫ్గాన్‌ దౌత్యవేత్త నజిబుల్లా అలిఖిల్‌ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌ను కొద్ది రోజుల క్రితం ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్‌ చేశారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించగా.. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దౌత్యవేత్తలపై కూడా దారుణాలకు పాల్పడుతుండడంతో ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే కిడ్నాప్ కు గురైన సదరు మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అఫ్గనిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ లేఖ విడుదల చేసింది. అసలేం జరిగిందంటే.. ఆఫ్ఘనిస్తాన్‌ రాయబారి నజీబుల్లా అలీఖీల్‌ కుమార్తె సిల్‌సిలా అలీఖీల్‌ (26) జిన్నా సూపర్‌ మార్కెట్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు యువకులు అడ్డుకుని కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెను దారుణంగా హింసించినట్లు సమాచారం. అనంతరం ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రదేశంలో విడిచి పెట్టి దుండగులు వెళ్లిపోయారు. అలా దుండగుల బారి నుంచి బయటపడి ఇంటికి చేరుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

    ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యలను అఫ్గాన్‌ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం.. పాకిస్తాన్‌లో తమ రాయబార కార్యాలయం అధికారులకు, వారి కుటుంబాలకు రక్షణ కొరవడిందని విచారం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా, ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకు పూర్తి భద్రతను కల్పించేందుకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాక సిల్‌సిలాను కిడ్నాప్‌ చేసిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గత కొద్ది వారాలుగా అఫ్గాన్‌లోని పలు జిల్లాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడోంతుల దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు.


    ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌.. పాక్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆ దేశ మద్దతుతోనే తాలిబన్లు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. స్పిన్ బోల్డాక్ అనే ప్రాంతం నుంచి తాలిబాన్లను తొలగించే చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని పాక్‌ వాయుసేన తమ ఆర్మీని, ఎయిర్‌ ఫోర్స్‌ని హెచ్చరించినట్లు అఫ్గనిస్తాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా సాలెహ్‌ తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని అఫ్గాన్‌ దౌత్యవేత్తను కుమార్తె కిడ్నాప్‌కు గురి కావడం సంచలనంగా మారింది. ఈ అనైతిక సంఘటన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతను సృష్టించింది. ఈ ఘటనను పలువురు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: