SEVERAL PILGRIMS KILLED AFTER BUS OVERTURNS IN PAKISTAN NEAR THE TOWN OF KHUZDAR SU
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి 18 మంది యాత్రికులు మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
ప్రతీకాత్మక చిత్రం
ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరై.. తిరుగు ప్రయాణమైన యాత్రికులను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వెంటాడింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడి 18 మంది మృతిచెందారు.
పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది యాత్రికులు మృతిచెందారు. మరో 42 మంది గాయపడ్డారు. అతి వేగం వల్ల బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నైరుతి పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాలు.. బస్సులోని యాత్రికులు బలూచిస్తాన్‌లోని వాద్ ప్రాంతంలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారు సింధు ప్రావిన్స్‌లోని వారి స్వస్థలానికి తిరుగు పయనమయ్యారు. అయితే క్వెట్టాకు దక్షిణాన 260 కిలోమీటర్ల దూరంలో ఖుజ్జార్ పట్టణానికి సమీపంలో శుక్రవారం ఉదయం యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
అతివేగం కారణంగా బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రహదానికి దూరంగా ఉన్న ఓ గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదం ఇప్పటివరకు 18 మంది మృతిచెందినట్టుగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కరాచీ నగరానికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇక, బస్సు డ్రైవర్‌కు కూడా ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయినట్టు స్థానికి భద్రతా అధికారి బిలాల్ అహ్మద్( Bilal Ahmed) తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్టు చెప్పారు. ఇక, పాకిస్తాన్లో రోడ్డు ప్రమాదాలు సాధారణంగా మారాయి. ఇందుకు సరైన రహదారి మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, అక్కడి జనాలు ట్రాఫిక్ చట్టాలను పట్టించుకోకపోవడం ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.