SECUNDERABAD VIOLENCE POLICE ARREST SAI DEFENCE ACADEMY DIRECTOR SUBBA RAO WHO IS MASTER MIND BEHIND YESTERDAY PROTESTS SK
Secunderabad: అంతా అతని పనే.. సికింద్రాబాద్ విధ్వంసంలో ప్రధాన సూత్రధారి అరెస్ట్
సికింద్రాబాద్‌లో విధ్వంసం
Secunderabad Violence: సికింద్రాబాద్ హింసాత్మక ఘటనల వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఈయన స్వస్థలం ఏపీలో నరసరావుపేట. ఖమ్మంలో అతడిని అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలించారు.
సికింద్రాబాద్ విధ్వంస (Secunderabad Railway station violence) ఘటనలో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హింసాత్మక ఘటనల వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఈయన స్వస్థలం ఏపీలో నరసరావుపేట. ఖమ్మంలో అతడిని అదుపులోకి తీసుకొని నరసరావుపేటకు తరలించారు. అగ్నిపథ్ పథకం (Agnipath Army Recruitment Scheme) వల్ల ఆర్మీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. దీనిని అంగీకరిస్తే మీ భవిష్యత్తు అంధకారం అవుతుందని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆవుల సుబ్బారావుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 డిఫెన్స్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అల్లర్లకు ఎలా పాల్పడాలన్న దానిపై యాక్షన్ ప్లాన్‌ను సుబ్బారావే అందించినట్లు పోలీసులకు సమాచారం అందించింది. హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో వాట్సప్ (Whatsapp) గ్రూప్‌ని క్రియేట్ చేశారని.. అందులో సికింద్రాబాద్‌లో(Seunderabad Trains) రైళ్లను ఎలా తగులబెట్టాలన్న దానిపై సభ్యులు చర్చించుకున్నారు. పెట్రోల్ బాటిళ్లు తీసుకొచ్చి.. రైళ్లను తగలబెడదామని కొందరు వ్యక్తులు మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు కూడా నిన్న సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సుబ్బారావు స్వయంగా ఆందోళనల్లో పాల్గొనేందుకు వస్తున్నారని.. అందరూ తరలిరావాలని వాట్సప్ గ్రూప్‌లో కొందరు పోస్ట్‌లు పెట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇతర ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు కూడా ఆందోళనకారులకు సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఆందోళన చేస్తున్న సమయంలో వారికి మంచి నీళ్లు, మజ్జిగ, బిస్కెట్లు, పులిహోర వంటి ఆహార పదార్థాలను డిఫెన్స్ అకాడమీలే సమకూర్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు స్టేషన్‌లోని స్టాల్స్, ఫర్నిచర్‌ను కర్రలు, ఐరన్ రాడ్లతో ధ్వంసం చేశారు. పట్టాలపై ఆగి ఉన్న రైళ్లకు నిప్పుపెట్టారు. మూడు రైళ్లలో పలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఆందోళనకారులు అంతటితో ఆగలేదు. సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులపై రాళ్లు రువ్వారు. డీజిల్ షెడ్‌ను కూడా తగులబెట్టేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ అనే యువకుడు మరణించాడు. రాకేశ్ మరణం తర్వాత ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దాాదాపు 9 గంటల హైడ్రామా తర్వాత.. శుక్రవారం రాత్రి పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరమ్మతుల అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పలు రైళ్లను అధికారులు పునరుద్ధరించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.