Snake Venom: ప్రాణం తీసే పాము విషమే.. ప్రాణాలు కాపాడుతుంది.. ఎలాగో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

లాన్స్ హెడ్ స్నేక్ పాములు దక్షిణ అమెరికా ఉత్తర ప్రాంతంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పాములు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. పూర్తిగా పెరిగిన పాములు దాదాపు ముప్ఫై నుంచి యాభై అంగుళాల వరకు ఉంటాయి.

  • Share this:
సాధారణంగా పాము కాటు వేస్తే చాలా ప్రమాదం .  ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆ పాము విషం నుంచే ఎన్నో ప్రాణాలను కాపాడే మందులను తయారుచేస్తున్నారు నిపుణులు. పాము కాటు నుంచి రక్షించుకునేందుకు పాముల నుంచి తీసే ఈ విషం నుంచి మందులు తయారుచేస్తారు. అలాంటి పాము విషం నుంచి మరోసారి మరో ప్రాణాలను కాపాడే మందు తయారు కాబోతోంది. అదే సూపర్ గ్లూ.. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే.. ! ప్రపంచ వ్యాప్తంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి ప్రమాదంలో ఎంతో మంది రక్తాన్ని కోల్పోయి ప్రాణాలను వదిలేస్తూ ఉంటారు. ఇలా రక్తం పోయిన కాసేపట్లో వైద్య సహాయం అందకపోతే మరణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఇకపై ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకపోవచ్చు. వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ కెనడాకి చెందిన నిపుణులు పాము విషం నుంచి సూపర్ గ్లూని తయారుచేస్తున్నారు. ఈ గ్లూని అతికించడం వల్ల ఇది చాలా వేగంగా వ్యక్తుల చర్మ కణాలతో కలిసిపోయి రక్తం కారకుండా కాపాడి ప్రాణాలు పోకుండా కాపాడుతుంది.

లాన్స్ హెడ్ స్నేక్ అనే రకం పాముల విషం నుంచి మాత్రమే ఈ తరహా సూపర్ గ్లూని తయారుచేస్తున్నారు నిపుణులు. ఇందులోని రెప్టైలేజ్ లేదా బాట్రోక్సోబిన్ అనే బ్లడ్ క్లాటింగ్ ఎంజైమ్స్ మనుషుల ప్రాణాలను కాపాడనున్నాయి. ఇవి రక్తాన్ని గడ్డ కట్టేలా చేస్తాయి. ఈ ఎంజైమ్ ని జెలటిన్ లో కలిపి చిన్న చిన్న ట్యూబుల్లో భద్రపర్చే వీలుంటుంది. ఈ ట్యూబులను కాస్త గట్టిగా వత్తడం వల్ల ఇది చర్మానికి అతుక్కునేలా ఏర్పాటు చేశారు నిపుణులు. లేదా ఏదైనా లైట్ సాయంతో దాన్ని రుద్దడం వల్ల కూడా ఇది చర్మానికి అతుక్కుంటుంది. ఇందుకు కేవలం స్మార్ట్ ఫోన్ టార్చ్ లాంటి తక్కువ లైట్ కూడా సరిపోతుంది.

ఈ తరహా లాన్స్ హెడ్ స్నేక్ పాములు దక్షిణ అమెరికా ఉత్తర ప్రాంతంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పాములు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. పూర్తిగా పెరిగిన పాములు దాదాపు ముప్ఫై నుంచి యాభై అంగుళాల వరకు ఉంటాయి. ఎక్కువగా కాఫీ, అరటి తోటల్లో ఈ పాములు కనిపిస్తుంటాయి. అందుకే అక్కడి పనివాళ్లు ఎక్కువగా వీటి కాటుకు గురవుతాయి. ఒక్కసారి కాటు వేసినప్పుడు సుమారు 124 మిల్లీ గ్రాముల నుంచి 342 మిల్లీగ్రాముల వరకు ఇవి విషాన్ని వదులుతాయి. సాధారణంగా ఇప్పటివరకు ఉపయోగిస్తున్న ఫిబ్రిన్ గ్లూ వంటి వాటి కంటే ఈ విషం ద్వారా తయారుచేసిన గ్లూ చాలా తక్కువ సమయంలోనే రక్తం గడ్డకట్టేలా చేస్తోందని నిపుణులు గుర్తించారు. ఇది కేవలం 45 సెకన్లలోనే తన పనిని ప్రారంభిస్తుంది. సాధారణంగా ఎలాంటి అడ్డు లేకపోతే శరీరం నుంచి రక్తం బయటకు వస్తూనే ఉంటుంది. శరీరం నుంచి బయటకు వచ్చే రక్తం సహజంగా గడ్డకట్టడానికి కనీసం ఆరు నిమిషాల సమయం పడుతుంది. ఆలోపే చాలా రక్తం పోతుంది కాబట్టి ఇలా సూపర్ గ్లూని ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: