Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఆఫ్ఘన్‌లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికల కోసం తెరుచుకున్న పాఠశాలలు

ఆఫ్ఘన్‌లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికల కోసం తెరుచుకున్న పాఠశాలలు

హేరాత్‌లో విద్యార్థినులు

హేరాత్‌లో విద్యార్థినులు

ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయిన ఇన్నాళ్లకు బాలికల కోసం పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. అంటే దాదాపు మూడు నెలల నుంచి బాలికలకు విద్య దూరమైన పరిస్థితులు ఆప్ఘన్‌లో నెలకొన్నాయి.

ఇంకా చదవండి ...

కాబూల్: ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయిన ఇన్నాళ్లకు బాలికల కోసం పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత.. అంటే దాదాపు మూడు నెలల నుంచి బాలికలకు విద్య దూరమైన పరిస్థితులు ఆప్ఘన్‌లో నెలకొన్నాయి. తాజాగా.. ఆప్ఘనిస్తాన్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటైన హేరాత్‌లో బాలికల పాఠశాలలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. అయితే.. 7 నుంచి 12వ తరగతి చదువుకునే విద్యార్థినులను మాత్రమే ప్రస్తుతానికి అనుమతిస్తున్నట్లు తెలిసింది. 1996 నుంచి 2001 మధ్య తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను పాలించిన సమయంలో బాలికలు చదువుకోవడాన్ని, మహిళలు ఉద్యోగం చేయడాన్ని నిషేధించారు. తాలిబన్ల పాలన ముగిశాక ప్రాథమిక విద్యను అభ్యసించే బాలికల సంఖ్య ఆప్ఘన్‌లో గణనీయంగా పెరిగింది. అయితే.. ఆ మార్పు కేవలం ప్రాథమిక విద్య వరకు మాత్రమే పరిమితమైంది.

ప్రాథమిక విద్యలో బాలికల సంఖ్య 50 శాతానికి పెరిగితే, మాధ్యమిక విద్యలో మాత్రం విద్యార్థినుల సంఖ్య 20 శాతం మాత్రమే ఉండేది. ఆప్ఘనిస్తాన్‌లో తమ పాలనను గుర్తించాలని తాలిబన్లు ఇప్పటికే అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత మహిళల హక్కులు, భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. గతంలో తాలిబన్ల పాలనలో చవిచూసిన చీకటి రోజులు మళ్లీ వస్తాయేమోనని భయంతో అక్కడి మహిళలు వణికిపోయారు. అవకాశం ఉన్న వాళ్లు దేశం వదిలి వెళ్లిపోయారు. కొందరు మహిళలు, యువతులు మాత్రం తమకు చదువుకునే హక్కు ఉందని రోడ్ల మీదకు వచ్చి నినదించారు.

ఇది కూడా చదవండి: US: 20 నెలల తర్వాత సరిహద్దులు తెరిచిన అమెరికా -విదేశీ ప్రయాణాలకు అనుమతి -భారతీయులకు ఊరట

అంతర్జాతీయ సమాజం కూడా బాలికల విద్యపై తాలిబన్లను ఒకింత గట్టిగానే ప్రశ్నించింది. దీంతో.. తాలిబన్లు గతంలో మాదిరిగా బాలికల విద్య విషయంలో కఠిన వైఖరిని అవలంబించకుండా కొంతమేర బాలికలు చదువుకునేందుకు వెసులుబాటు కల్పించే దిశగా అడుగులేస్తున్నారు. నవంబర్ 8 నుంచి హేరాత్ నగరంలో బాలికల విద్య కోసం 26 పాఠశాలలు తెరుచుకోవడమే ఇందుకు నిదర్శనం. హేరాత్ నగరంలో బాలికల పాఠశాలలు తెరుచుకోవడంపై బాలికలను పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తన ఇద్దరు కుమార్తెలను పాఠశాలకు పంపిస్తున్న మహ్మద్ రఫీక్ అనే హేరాత్ నివాసి మాట్లాడుతూ.. కొన్ని వారాలుగా తాను మదనపడుతున్నానని, తన కూతుర్లు చదువుకోలేరేమోనని ఆందోళన చెందానని చెప్పారు. తన కూతుర్లు పాఠశాలకు వెళ్లే అవకాశం ఎక్కడ ఉండదోనని వారి కంటే తాను పది రెట్లు ఎక్కువ చింతించానని, ప్రస్తుతం సంతోషంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Pakistan: మీడియాపై పాక్​ ప్రభుత్వం ఆంక్షలు.. ఇకపై వార్తలు ప్రసారం చేసే ముందు ఆ పని చేయాలంటూ..

అయితే.. ఇదిలా ఉంటే అమ్మాయిల విద్య విషయంలో తాలిబన్లు ఇప్పటికీ కొంత వివక్ష చూపుతున్నారు. అన్ని తరగతులు చదివే అబ్బాయిలకు విద్యను అభ్యసించేందుకు అవకాశమిచ్చిన తాలిబన్లు అమ్మాయిల విషయంలో మాత్రం కేవలం 7 నుంచి 12వ తరగతి చదివేందుకు మాత్రమే అనుమతినివ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా.. నిన్నమొన్నటి వరకూ కేవలం 1 నుంచి 6 తరగతులు చదివే బాలికలు మాత్రమే విద్యను అభ్యసించేందుకు అనుమతించిన తాలిబన్లు తాజాగా 7 నుంచి 12వ తరగతి వరకూ బాలికలు చదువుకునేందుకు అవకాశమివ్వడం అక్కడి బాలికలకు కాస్త ఊరట కలిగించే విషయమేనని చెప్పాలి. తాలిబన్లు బాలికల విద్య విషయంలో తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 3 లక్షల మందికి పైగా బాలికలు తమ చదువును కొనసాగించేందుకు అవకాశం లభించింది.

First published:

Tags: Afghanistan, International news, Schools reopening, Taliban

ఉత్తమ కథలు