హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

సీఐఏ రిపోర్ట్ : సౌదీ రాజే, జమాల్ ఖషోగ్గీని చంపించారా?

సీఐఏ రిపోర్ట్ : సౌదీ రాజే, జమాల్ ఖషోగ్గీని చంపించారా?

సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ(File)

సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ(File)

హత్య చేసిన వాళ్ల కంటే, చేయించిన వాళ్లు ఇంకా ఎక్కువ ప్రమాదకరమని చట్టం చెబుతోంది. ఇదే ఫార్ములాను జమాల్ ఖషోగ్గీ హత్య కేసుకు వర్తింపజేస్తే, సీఐఏ రిపోర్టు ప్రకారం సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ తీవ్ర నేరం చేసినట్లే. మరి ఆయన్ని అమెరికా శిక్షిస్తుందా? ఖషోగ్గీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఇంకా చదవండి ...

  ఈమధ్యకాలంలో అమెరికా, సౌదీ అరేబియా మధ్య భగ్గుమంటున్న వ్యవహారం ప్రముఖ అమెరికా జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యోదంతం. ఈ హత్యకు అసలు కారణం ఎవరా అని దర్యాప్తు చేసిన సీఐఏ, చివరకు సూత్రధారి సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అని తేల్చినట్లుగా అమెరికా మీడియా చెబుతోంది. సల్మానే, ఖషోగ్గీని హత్య చేయించినట్లుగా సీఐఏ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నట్లు సమాచారం. ఇలాంటి మర్డర్ చెయ్యాలంటే, కచ్చితంగా రాజు అనుమతి తప్పనిసరి అని అమెరికా అధికారులు నమ్ముతున్నారు.

  సౌదీ అరేబియా ప్రభుత్వం మాత్రం తాజా ఆరోపణలను ఖండించింది. ఈ హత్యకూ, రాజుకూ ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. అనుకోకుండా జరిగిన ఆపరేషన్‌లో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చింది. ఖషోగ్గీ హంతకులు ఎంతటివాళ్లైనా, శిక్షించి తీరతామని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మరోసారి ప్రకటించారు. పాపువా న్యూ గినియాలోని ఓ సదస్సుకు హాజరైన ఆయన, హత్యకు కారణమైన అందర్నీ శిక్షించే విషయంలో అత్యంత నిబద్ధతతో ఉన్నామని తెలిపారు.

  అక్టోబర్ రెండున టర్కీ, ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయానికి వెళ్లిన ఖషోగ్గీ తిరిగి రాలేదు. ఆయన డెడ్‌బాడీ కూడా కనిపించలేదు. ఖషోగ్గీ, అమెరికాలోని వాషింగ్టన్ పోస్టులో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన తరచుగా సౌదీ అరేబియా పాలకులకు వ్యతిరేకంగా వివాదాస్పద పోస్టులు రాసేవారు. ఆయనపై పగబట్టిన సౌదీ ప్రభుత్వం, సరైన టైమ్ చూసి, ప్రాణాలు తీసిందనే ప్రచారం జరుగుతోంది. హత్యకు సంబంధించి, రాజు సల్మాన్ సోదరుడు ప్రిన్స్ ఖలేద్ బిన్ సల్మాన్, అమెరికాలోని సౌదీ రాయబారితో ఓ ఫోన్ కాల్‌లో మాట్లాడిన సంభాషణలు సీఐఏ దగ్గర ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ చెబుతోంది. సల్మాన్‌కి అంతా తెలుసనే విషయంపై వైట్‌హౌస్ నుంచి గానీ, అమెరికా విదేశాంగ శాఖ నుంచీ అధికారిక ప్రకటనేదీ రాలేదు. కానీ, సీఐఏ రిపోర్టు అమెరికా ప్రభుత్వానికి చేరినట్లు తెలుస్తోంది. హత్య తర్వాత హంతకులు, సౌదీ రాజు సల్మాన్‌కి కాల్ చేసి, ఆ విషయం చెప్పినట్లు సీబీఐ రిపోర్టులో ఉందని తెలిసింది.

  ఖషోగ్గీ మద్దతుదారుల నిరసన (ఫైల్ ఫొటో)

  ఇప్పటివరకూ ఈ హత్యతో 11 మందికి సంబంధం ఉందని దర్యాప్తు నివేదికలు చెబుతున్నాయి. నిందితుల్లో ఐదుగురికి మరణశిక్ష విధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఖషోగ్గీ హత్యను అమెరికా సీరియస్‌గా తీసుకుంటే, అందులో సల్మాన్‌ పాత్ర ఉందని అమెరికా నమ్మితే, అది అంతర్జాతీయంగా పెను ప్రమాదమే. ఇప్పటికే చమురు ఉత్పత్తి, ధరల విషయంలో అమెరికా, సౌదీ అరేబియా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఖషోగ్గీ వ్యవహారం మరింత చిచ్చు రాజేసే అవకాశాలున్నాయి.

  Published by:Praveen Kumar Vadla
  First published:

  Tags: Saudi Arabia, USA

  ఉత్తమ కథలు