SAUDI ARABIA RELEASED WOMENS RIGHTS ACTIVIST LOUJAIN AL HATHLOUL FROM PRISON AFTER 3 YEARS MS GH
Loujain Al-Hathloul: మహిళా హక్కుల కార్యకర్తను విడుదల చేసిన సౌదీ ప్రభుత్వం.. జో బైడెన్ విజ్ఞప్తి మేరకేనా..?
లూజైన్ అల్ హత్లౌల్ (image : Twitter)
సౌదీ మహిళలు డ్రైవింగ్ చేయడంపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ గళమెత్తిన ఆమెపై విదేశీ అజెండాను అనుసరించడం, ఇంటర్నెట్ ద్వారా అలజడి సృష్టించడం వంటి ఆరోపణ కింద 2018 మే 31న లూజైన్ అల్ -హాత్లౌల్ అరెస్ట్ చేశారు.
సౌదీ అరేబియాలోని ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త లూజైన్ అల్ -హాత్లౌల్ (Loujain Al-Hathloul) (31)ను ఎట్టకేలకు జైలు నుంచి విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ అయిన ఆమె దాదాపు 1,000 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించారు. సౌదీ మహిళలు డ్రైవింగ్ చేయడంపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ గళమెత్తిన ఆమెపై విదేశీ అజెండాను అనుసరించడం, ఇంటర్నెట్ ద్వారా అలజడి సృష్టించడం వంటి ఆరోపణ కింద 2018 మే 31న అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆమెకు దాదాపు ఆరేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అయితే, జైలులో తాను చిత్ర హింస, లైంగిక వేధింపులకు గురవుతున్నానని- పదేపదే ఆమె ఆరోపణలు చేసింది. దీంతో, ఆమె నిర్బంధాన్ని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. ఆమెను వెంటనే విడుదల చేయాల్సిందిగా సౌదీ ప్రభుత్వాన్ని కోరాయి.
దీంతో ఎట్టకేలకు ఆమెకు రెండు సంవత్సరాల పది నెలల శిక్షాకాలన్ని తగ్గిస్తున్నట్లు 2020 మార్చిలో కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆమె ఏదో ఒక రోజు విడుదల కావొచ్చంటూ చర్చ నడుస్తూ వచ్చింది. ఎట్టకేలకు 1,000 రోజుల నిర్భంధం తర్వాత ఆమె విడుదలైంది. అయితే, ప్రజాస్వామ్య సూత్రాల కోసం నిలబడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ప్రతిజ్ఞ చేస్తూ.. మహిళా హక్కుల కార్యకర్తలతో సహా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సౌదీ రాజ్యానికి పిలుపునిచ్చిన వారం రోజుల్లోనే లూజైన్ అల్ హాత్లౌల్ విడుదల అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన విజ్ఞప్తి మేరకే లూజైన్ను సౌదీ ప్రభుత్వ విడుదల చేసినట్లు తెలుస్తోంది. లూజైన్ విడుదలపై జో బైడెన్ తన పెంటాగాన్ ప్రసంగంలో మాట్లాడుతూ " లూజైన్ ఒక శక్తివంతమైన మహిళా హక్కుల కార్యకర్త. సౌదీ ప్రభుత్వం ఆమెను విడుదల చేయడం సంతోషకరం.”అని అన్నారు.
కాగా, లూజైన్ సోదరుడు వాలిద్ అల్-హాత్లౌల్ మాట్లాడుతూ “జైలు నుంచి లూజైన్ను విడుదల చేయడం పట్ల సంతోషిస్తున్నాము. అయితే, న్యాయం కోసం లూజైన్ పోరాటం ఆగదు." అని తెలిపాడు. నిర్బంధంలో ఉన్నప్పుడు లైజైన్ లైంగిక వేధింపులకు, హింసకు గురైనట్లు, ఆమెపై వాటర్బోర్డింగ్, కొరడా దెబ్బలు, విద్యుదాఘాతం వంటి వాటిని ప్రయోగించారని ఆమె కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వచ్చారు. అయితే, ఈ ఆరోపణలను సౌదీ అధికారులు పదేపదే ఖండించారు. అయినప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగానే లూజైన్ను సౌదీ ప్రభుత్వం వేధిస్తుందని వారు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, లైజైన్ విడుదలపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తాజాగా ట్వీట్ చేశారు."సౌదీ మహిళా హక్కుల కార్యకర్త లూజైన్ అల్-హాత్లౌల్ విడుదలను నేను స్వాగతిస్తున్నాను. ఎట్టకేలకు ఆమె కుటుంబానికి ఉపశమనం కలిగినందుకు సంతోషంగా ఉంది." అని అన్నారు. లూజైన్ నిర్బంధంలో ఉన్న సమయంలో అనగా 2019లోనే ఆమెను పెన్ అమెరికాతో అనేక అవార్డులు వరించాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, హత్లౌల్తో పాటు అరెస్టయిన నాసిమా అల్-సదా, మాయ అల్-జహ్రానీ అనే మరో ఇద్దరు మహిళా హక్కుల కార్యకర్త-లకు కూడా పెన్ అమెరికా అవార్డు దక్కింది.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.