Saudi Arabia: సౌదీ అరేబియా(Saudi arabia) శిక్షల విషయంలో చాలా కఠినంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అక్కడి చట్టాల్లో మరణ శిక్ష సాధారణ విషయంగా మారుతోంది. ఆ దేశం గత పది రోజుల్లోనే 12 మందికి మరణ శిక్షలు అమలు చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 132 మందికి మరణ శిక్షలు విధించారంటే, సౌదీలో మరణ శిక్షల వైఖరి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో చాలా వరకు కత్తితో తలలు నరికినవేనని నివేదికలు చెబుతున్నారు.
అక్కడి మానవ హక్కుల సంస్థ రిప్రైవ్ (Reprieve) లెక్కల ప్రకారం... సౌదీ అరేబియా రెండేళ్ల విరామం తర్వాత డ్రగ్స్ నేరాలకు సంబంధించి 10 రోజుల్లో 12 మందిని ఉరితీసింది. వాటిలో ఎక్కువ భాగం కత్తితో శిరచ్ఛేదం చేసినవే. ఈ 12 మంది ముద్దాయిలు డ్రగ్స్ కేసుల్లో జైలు పాలైనవారే కావడం గమనార్హం. జైలు శిక్ష పూర్తయిన తర్వాత వీరికి మరణ శిక్షలు విధించారు. వీరిలో నలుగురు సిరియన్లు, ముగ్గురు పాకిస్థానీయులు, ఇద్దరు జోర్డానియన్లు, ముగ్గురు సౌదీ వాసులు ఉన్నారని టెలిగ్రాఫ్ రిపోర్ట్ వెల్లడించింది.
ఈ ఏడాది ఎక్కువ
ఇలాంటి శిక్షలను తగ్గిస్తానని సౌదీ క్రౌన్ ప్రిన్స్(Crown prince), ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ గతంలో ప్రమాణం చేశారు. అయినా కూడా ఆ దేశంలో రికార్డు స్థాయిలో మరణ శిక్షలు అమలు అవుతున్నాయి. ఈ సంవత్సరం మరణ శిక్షలు(Execution) పడిన వారి సంఖ్య తక్కువలో తక్కువ 132గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సంఖ్య 2020, 2021 సంవత్సరాలలో మరణ శిక్షలు పడిన వారందరినీ కలిపి లెక్క గట్టినా ఎక్కువగానే ఉందని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
Inspiration : చిట్టి సరస్వతి.. 55 మంది పిల్లలకు చదువు చెబుతున్న 5వ తరగతి పాప
మాట మార్చిన రాజు
ఓసారి మహమ్మద్ బిన్ సల్మాన్ టైమ్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.... తనలోని కింగ్ వేటిపై సంతకం చేయాలని అనుకుంటే వాటిపైన సంతకాలు చేస్తాడని, తమ రాజ్యాంగంలోని చట్టాల ప్రకారం పని చేస్తాడని అన్నారు. 2018లో మహమ్మద్ బిన్ సల్మాన్ తన పరిపాలనలో మరణశిక్షలను తగ్గించడానికి ప్రయత్నిస్తామని మాట ఇచ్చారు. హత్య లేదా నరహత్యకు పాల్పడిన వారికి మాత్రమే మరణశిక్షలు విధిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సౌదీలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
2018 అక్టోబర్‌లో జమాల్ ఖషోగ్గి అనే జర్నలిస్టు హత్యకు గురయ్యారు. ఇస్తాంబుల్ కాన్సులేట్‌లో సౌదీ హిట్ స్క్వాడ్ ఖషోగ్గిని చంపి ముక్కలు చేసింది. యూఎస్ బేస్డ్ జర్నలిస్టు అయిన ఆయన మరణ శిక్షలపై సౌదీ చట్టాలను, రాజు చర్యలను ప్రశ్నించారు. దీంతో అప్పుడు ఆయన హత్యకు గురి కావడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత మరణశిక్షలను తగ్గించేందుకు చట్టాన్ని మార్చాలనే ప్రతిపాదనలను సౌదీ అరేబియా పరిశీలించింది. నాన్ వైలెంట్ కేసుల్లో మరణ శిక్షలు కాకుండా వేరే శిక్షలు విధించే ఆలోచనలు చేసింది.
‘మహమ్మద్ బిన్ సల్మాన్ తన విజన్ గురించి పదేపదే ప్రచారం చేసుకున్నారు. ఉరిశిక్షలను తగ్గించడానికి అవసరమైన ప్రయత్నాలు చేస్తానన్నారు. మాదకద్రవ్యాల నేరాల కేసుల్లో మరణశిక్షను అమలు చేయబోమని చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈ ఏడాది మరణశిక్షలు ఎక్కువ అయిపోయాయి. సౌదీ అధికారులు సీక్రెట్‌గా మాదకద్రవ్యాల నేరస్థులను మళ్లీ పెద్ద సంఖ్యలో ఉరితీయడం ప్రారంభించారు.’ అని రైట్స్ ఆర్గనైజేషన్ రిప్రైవ్ (Reprieve) డైరెక్టర్ మాయా ఫోవా ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Human Rights, Saudi Arabia