అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఇంకొంత సమయమే మిగిలి ఉంది. కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా జో బైడెన్, కమాలా హారిస్ ఈరోజే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వీరిద్దరికీ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రతినిధుల సైకత శిల్పాలను రూపొందించి వారిని అభినందించారు. బైడెన్ అమెరికాకు 46వ ప్రెసిడెంట్‌గా, కమల 49వ వైస్ ప్రెసిడెంట్‌గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికా చరిత్రలో ఎక్కువ వయసు ఉన్న అధ్యక్షుడిగా (78 సంవత్సరాలు) బైడెన్ రికార్డు సాధించనున్నాడు. అగ్ర రాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతి మహిళగా కమలా హారిస్ గుర్తింపు సాధించారు.
కొన్ని నెలల క్రితమే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో బైడెన్, కమల విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ అధికార బాధ్యతలు మాత్రం ఈరోజే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల ప్రతినిధుల నుంచి వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో బైడెన్, కమల సైకత శిల్పాలను రూపొందించి, వారికి అభినందనలు తెలిపాడు. పద్మశ్రీ అవార్డు పొందిన సుదర్శన్, ఇంతకు ముందు కూడా ప్రముఖుల సైకత శిల్పాలను రూపొందించారు. తాజా కళాకృతిలో... ముందు భాగంలో క్యాపిటల్ బిల్డింగ్, బైడెన్, కమలతో పాటు అమెరికా జెండాను కూడా తీర్చిదిద్దాడు. దీనికి కింది భాగంలో ‘Congratulation’ అనే పదం కూడా రాశాడు.
వైరల్ అవుతున్న పోస్ట్
ఈ కొత్త శిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో ఇది కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. దీనికి వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఆయన పనితీరును అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఆర్ట్ చాలా బాగుందని కామెంట్లు పెడుతున్నారు. ఈ కళాఖండం ఎంతో సహజంగా ఉందని ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు. సందర్భానికి తగ్గట్లు సైకత శిల్పం రూపొందించారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది బైడెన్, హారిస్‌లకు అద్భుతమైన నివాళి అంటూ మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 20, 2021, 18:21 IST