Russia Warship Shinks : ఈ ఏడాది పిబ్రవరి చివర్లో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా(Russia-Ukraine War)వాటిని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి నేటితో 45రోజులు అవుతోంది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్(Putin) మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే అటు ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా దాడులను ధీటుగా తిప్పికొడుతోంది. అయితే ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక(Russia Warship) "మాస్కోవా"ను మిసైళ్లతో పేల్చామని ఉక్రెయిన్ అధికారులు ఏప్రిల్ 14న ప్రకటించారు. నల్ల సముద్రంలో తమ క్షిపణుల ధాటికి నౌక మునిగిపోయిందని ఉక్రెయిన్ అధికారి ఒకరు చెప్పారు. అయితే తమ నౌకలో ఉన్న పేలుడు పదార్థాలు పొరపాటున పేలి భారీ నష్టం వాటిల్లిందని రష్యా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే నౌకలో సిబ్బందిని ఖాళీ చేయించామని తెలిపింది. మాస్క్వా నౌకలో పేలుడు జరిగిందని, ధ్వంసమైన ఆ నౌకను తీరానికి తరలిస్తున్న సమయంలో.. తుఫాన్ వాతావరణం కారణంగా మునిగిపోయినట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది.
మాస్క్వా నౌకలో ప్రమాదం జరిగిన సయమంలో అది ఒడిసా పట్టణానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉందని రష్యా మిలిటరీ చెప్పింది. అయితే అక్కడ ఉన్న ఇతర నౌకల్లో మాస్క్వా సిబ్బందిని తరలించినట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగినప్పుడు నౌకలో 500మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. మాస్కోవా నౌక ఒకేమారు 16 లాంగ్ రేంజ్ మిస్సైళ్లను మోసుకుపోతుంది. క్రిమియా ద్వీపకల్పం నుంచి ఆదివారం ఈ నౌక బయల్దేరినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. ఉక్రెయిన్(Ukraine)వర్గాలు ఈ నౌకపైకి రెండు 'నెప్ట్యూన్' క్షిపణులు ప్రయోగించి, పెను నష్టం కలిగించినట్లు ఒడెసా ప్రాంత గవర్నర్ మేక్సిమ్ మర్చెంకో చెప్పారు. ఈ నౌక మునిగిపోయిందని, ఇది ఎంతో ప్రాముఖ్యమైన అంశమని ఉక్రెయిన్ అధ్యక్షుని సలహాదారుడు ఒలెక్సీ అరెస్టోవిచ్ పేర్కొన్నారు. గత నెలలో అజోవ్ సముద్రంలో యుద్ధ ట్యాంకుల వాహక నౌక 'ఒర్స్స్'పై ఉక్రెయిన్ దాడి చేసినప్పుడు అది కాలిపోయింది. ఇప్పుడు మరో దెబ్బ అంతకంటే తీవ్రంగా తగిలింది. మాస్కోవా యుద్ధనౌక పేల్చివేత ఘటనను గుర్తు చేసుకుంటూ ఒక పోస్టల్ స్టాంపును ఉక్రెయిన్ విడుదల చేసింది.
ALSO READ Mount Everest : ఎవరెస్ట్ శిఖరంపై ప్రముఖ పర్వతాధిరోహకుడు మృతి..కూర్చున్న స్థితిలోనే
ఇక,ఉక్రెయిన్ లో ఐర్లాండ్ రక్షణ, విదేశాంగ మంత్రి సైమన్ తాజాగా పర్యటించారు. ఉక్రెయిన్ కు దాదాపు 5.8 కోట్ల డాలర్ల సాయం అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు,ఉక్రెయిన్ లోని 20 లక్షల మంది ప్రజలకు సాయం చేసేందుకు అతిపెద్ద క్యాష్ అసిస్టెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తామని రెడ్‌క్రాస్ తెలిపింది. రష్యా యుద్ధంతో ప్రభావితమైనవారికి దాదాపు 10.6 కోట్ల డాలర్లను పంచుతామని సంస్థ ప్రతినిధి నికోల్ చెప్పారు. ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్ధం అనేక వర్థమాన దేశాలకు దెబ్బ అని ఐరాస పేర్కొంది. ఇప్పటికే ఆ దేశాలు ఇంధన ధరలతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయని, ఆహారం పరంగానూ సమస్యలు ఎదురవుతున్నాయని సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ప్రస్తుతం 170 కోట్ల మంది ప్రజలు ఆహారం, ఇంధన ధరలు, ఆర్థిక అంశాలతో ఇబ్బందుల పాలయ్యారని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin