రష్యాలో తీవ్ర దుమారం.. పుతిన్ ప్రత్యర్థిపై విష ప్రయోగం.. విమానంలో కుప్పకూలిన అలెక్సీ

రష్యాలో తీవ్ర దుమారం.. పుతిన్ ప్రత్యర్థిపై విష ప్రయోగం.. విమానంలో కుప్పకూలిన అలెక్సీ

వ్లాదిమిర్ పుతిన్, అలెక్సీ నవల్నీ

ఆయన శరీరంలో విషం అవశేషాలు ఉన్నాయి.. వేడి వేడి ద్రావణం ద్వారా విషం లోపలికి వెళ్లిందని డాక్టర్లు తెలిపారు. ఐతే ఉదయాన్నే అలెక్సీ టీ తాగారని ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు.

  • Share this:
    రష్యాలో తీవ్ర కలకలం రేగింది. ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)పై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. సైబీరియాలోని ఓ ఆస్పత్రిలో అలెక్సీ నవాల్నీకి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోమాలో ఉన్నారని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు అలెక్సీ నవాల్నీ అధికార ప్రతినిధి కిరా యార్మిష్ ట్విటర్ ద్వారా ప్రకటన చేశారు. ఆయన చావు బతుకుల మధ్య ఉన్నారని ఆమె తెలిపారు. కిరా యార్మిష్ తెలిపిన వివరాల ప్రకారం.. సైబీరియాలో టోమస్క్ సిటీ నుంచి మాస్కోకు విమానంలో వెళ్తుండగా అలెక్సీ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితుల్లో.. తనతో మాట్లాడాల్సిందిగా కిరాను కోరారు అలెక్సీ. ఆమె మాట్లాడుతున్న మాటలు వినబడుతున్నాయో లేదో నిర్ధారించుకునేందుకు.. అలానే మాట్లాడుతూ ఉండాలని చెప్పారు. ఆ తర్వాత బాత్రూమ్‌లోకి వెళ్లి కిందపడిపోయి అపస్మార స్థితిలోకి వెళ్లిపోయారు అలెక్సీ. బాత్రూమ్ నుంచి ఎంతకూ రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా.. ఆయన కిందపడి పోయి ఉన్నారు.

    వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ఓమస్క్ సిటీలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అక్కడి నుంచి నేరుగా సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు. ఆయన శరీరంలో విషం అవశేషాలు ఉన్నాయి.. వేడి వేడి ద్రావణం ద్వారా విషం లోపలికి వెళ్లిందని డాక్టర్లు తెలిపారు. ఐతే ఉదయాన్నే అలెక్సీ టీ తాగారని ఆయన అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. ఈ నేపథ్యంలో క్యాంటిన్‌లోనే టీలో ఎవరో విషం కలిపారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేఫ్‌ను మూసివేసి.. ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

    కాగా, అలెక్సీ నవాల్నీ 'రష్యా ఆఫ్ ది ఫ్యూచర్' పార్టీకి చెందిన నాయకుడు. వృత్తిరిత్యా న్యాయవాదైన ఆయన.. దేశంలో అవినీతి వ్యతిరేక పోరాటాలు చేశారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌పై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో ఉండేవారు. పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొని అనేక సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గతంలో జైలులో ఉన్న సమయంలోనూ ఓసారి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అలెక్సీ. ఎవరో విషం ప్రయోగం చేశారని అప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఫుడ్ అలర్జీ వల్లే ఆయన అనారోగ్యానికి గురయ్యారని డాక్టర్లు స్పష్టం చేశారు. ఐతే ఈసారి ఖచ్చితంగా విష ప్రయోగమే జరిగిందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రష్యాలో ప్రకంపనలు రేపుతోంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు