ఉక్రెయిన్ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడమే లక్ష్యంగా యుద్ధానికి దిగిన రష్యా ఒక్కోక్కటిగా నగరాలను చెరబడుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో నిలిచిన రష్యన్ సేనలు ఏ క్షణమైనా నగరాన్ని వశం చేసుకునే అవకాశాలున్నాయి. కాగా, ఉక్రెయిన్ సైన్యానికి తోడు అధ్యక్షుడి దగ్గర్నుంచి సామాన్య పౌరుల దాకా తుపాకులు చేతపట్టుకుని రష్యాను నిలువరిస్తామని చెబుతుండటంతో కీవ్ ఆక్రమణ వేళ నెత్తుటేరులు పారొచ్చనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మరోవైపు ఐక్యారాజ్యసమితిలో ఉక్రెయిన్ అంశంపై వరుసగా అత్యవసర సమావేశాలు జరుగుతున్నాయి. భద్రతా మండలిలో ఉక్రెయిన్ కు రాజకీయ మద్దతు ఇవ్వాలంటూ ఆ దేశ అధ్యక్షుడు మన భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ శనివారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. రష్యా బాంబుల మోత మోగిస్తూ.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో భారత్ సాయం కావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు మోదీని కోరారు. ప్రస్తుత పరిస్థితుల గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెలెన్స్కీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమకు రాజకీయంగా మద్దతు కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించారు. రష్యా దాడులు ఆపేలా తగిన చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు మోదీని కోరారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్దంలో భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తున్నప్పటికీ, కొద్ది గంటల కిందట జరిగిన ఓటింగ్ కు భారత్ గైర్హాజరైనప్పటికీ ఉక్రెయిన్ పట్టువిడవకుండా మద్దతు కోరుతుండటం గమనార్హం.
Spoke with ?? Prime Minister @narendramodi. Informed of the course of ?? repulsing ?? aggression. More than 100,000 invaders are on our land. They insidiously fire on residential buildings. Urged ?? to give us political support in?? Security Council. Stop the aggressor together!
— Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022
‘భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. రష్యా దురాక్రమణ, ఉక్రెయిన్ తిప్పికొడుతున్న విధానాన్ని ఆయనకు వివరించాను. సుమారు లక్ష మంది ఆక్రమణ దారులు ఉక్రెయిన్‌లోనే ఉన్నారు. నివాస భవనాలపై బాంబు దాడులు చేస్తున్నారు. భద్రతా మండలిలో రాజకీయ మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరాను’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Pm modi, Russia-Ukraine War, Ukraine, UNO