హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Russia-Ukraine War : తగ్గేదే లే అంటున్న ఉక్రెయిన్..16400మంది రష్యా సైనికులు మృతి!

Russia-Ukraine War : తగ్గేదే లే అంటున్న ఉక్రెయిన్..16400మంది రష్యా సైనికులు మృతి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Russian Soldiers Killed : యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పుతిన్‌ తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఉక్రెయిన్‌ పై రష్యా విధ్వంసం కొసాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులు మొదలుపెట్టి నెల రోజులు దాటింది. ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా.. పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్‌ అస్తవ్యస్తమైంది. పలు నగరాలు ధ్వంసమయ్యాయి. భారీ ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఉక్రెయిన్ పై మిలటరీ యాక్షన్ ను ఫిబ్రవరి 24న రష్యా మొదలుపెట్టింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తున్నప్పటికీ.. ఇంకా ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేదు. ఉక్రెయిన్​ పై అత్యాధునిక క్షిపణులు, బాంబులతో రష్యన్​ సేనలు విరుచుకుపడుతున్నాయి. గత నెల రోజుల పాటు క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా సేనల్ని ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌ పౌరులతో పాటు సైనికులు రష్యాను ప్రతిఘటించి శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నాయి. ఇప్పటివరకు 16,400 మందికిపైగా రష్యా సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. అలాగే, 117 విమానాలు, 127 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది. ఖేర్సన్‌ నగరంలో జరిగిన దాడుల్లో రష్యాన్‌ లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజంట్‌సెవ్‌ చనిపోయినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన ఏడుగురు సైనిక జనరళ్లు మృతి చెందినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లో మొదట స్వాధీనం చేసుకున్న ఖేర్సన్‌ నగరంపై పుతిన్‌ సేనలు పట్టు కోల్పోతున్నట్లు అమెరికా తెలిపింది.

ఇక,యుద్ధం ప్రారంభించి నెలరోజులైనా ఉక్రెయిన్‌ దారికి రాకపోవడం వల్ల రష్యా దాడులు మరింత పెరిగాయి. కీవ్, మరియుపోల్, ఖార్కివ్‌, చెర్నిహివ్‌ నగరాల్లో బాంబులు, క్షిపణులతో రష్యా బలగాలు తాజాగా దాడులు చేశాయి. బాంబు దాడులతో డెస్నా నదిపై ప్రధాన వంతెన కూలటంతో చెర్నిహివ్‌ నగరానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు గవర్నర్ తెలిపారు. ఆహార నిల్వల ప్రదేశాలే లక్ష్యంగా మాస్కో ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోందని ఆరోపించారు. యుద్ధానికి ముందు చెర్నిహివ్‌ లో 2.85 లక్షల మంది జనాభా ఉండగా ప్రస్తుతం లక్షా 30 వేల మంది కంటే తక్కువ ఉన్నట్లు తెలిపారు.

ALSO READ Imran Khan Resign: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా! -ఇస్లామాబాద్ ర్యాలీలో ప్రకటన!!

మరోవైపు, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ప్రకటించిన కర్ఫ్యూను రద్దు చేస్తున్నట్లు మేయర్ విటాలీ క్లిట్‌ ష్కో తాజాగా ప్రకటన చేశారు. ఈ మేరకు మిలిటరీ కమాండ్ నుంచి కొత్తగా ఆదేశాలు అందాయని చెప్పారు. అయితే, ఎప్పటిలాగే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, ఆదివారం పగటిపూట మాత్రం పౌరులు బయటకు రావొచ్చని తెలిపారు. యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పుతిన్‌ తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

అయితే ఉక్రెయిన్‌లో చేపట్టిన సైనిక చర్య మొదటి దశ దాదాపు పూర్తికావచ్చిందని రష్యా శుక్రవారంప్రకటించింది. ఇక తమ తదుపరి లక్ష్యం డాన్‌బాస్‌ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడమేనని స్పష్టం చేసింది. తమ దేశ సంస్కృతిపై పశ్చిమ దేశాలు వివక్ష చూపుతున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఆరోపించారు. రష్యన్‌ సంగీతం, సాహిత్యంపై ఆంక్షల పరిణామాలను 1930ల్లో నాజీ మద్దతుదారులు పుస్తకాలను తగులబెట్టిన ఘటనతో పోల్చారు. "ఈ రోజు పశ్చిమ దేశాలు వెయ్యేళ్ల పురాతన రష్యా సంస్కృతిని తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రష్యాకు సంబంధించిన విషయాలపై వివక్ష గురించి నేను మాట్లాడుతున్నా"అని పుతిన్ కళాకారులతో నిర్వహించిన ఓ టెలివిజన్ సమావేశంలో అన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Russia, Russia-Ukraine War, Vladimir Putin, Zelensky

ఉత్తమ కథలు