Russia tests hypersonic missile Zircon : ఉక్రెయిన్(Ukraine)ఆక్రమణను మరింత వేగవంతం చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్న వేళ.. ప్రపంచంలోనే అత్యాధునిక, గరిష్ఠ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాహుబలి క్షిపణి జిర్కాన్ను రష్యా(Russia)విజయవంతంగా ప్రయోగించి ప్రపంచాన్ని నివ్వెరపరచింది. వెయ్యి కి.మి. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సత్తాగల ఈ హైపర్సోనిక్ క్షిపణిని శనివారం రష్యా ప్రయోగాత్మకంగా పరీక్షించింది. బారెంట్స్ సముద్రంలో మోహరించిన యుద్ధనౌక అడ్మిరల్ గోర్షోవ్ ఫ్రిగేట్ యుద్ధ నౌక నుంచి నుంచి దీనిని ప్రయోగించారు. గంటకు 6670 కి.మి.వేగంతో దూసుకువెళ్లిన జిర్కాన్ శ్వేతసముద్రంలో 625 కి.మి. దూరాన ఉన్న లక్ష్యాన్ని ఛేదించింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఇది దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదు. ధ్వని కంటే 5-10 రెట్ల అధిక వేగంతో ప్రయాణించగలదు. అమెరికాలోని అనేక నగరాలు సహా పశ్చిమ దేశాల్లోని లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో వీటిని రూపొందించారు. ఉక్రెయిన్పై ఓ పక్క యుద్దం జరుగుతున్నప్పటికీ ఈ జిర్కాన్ క్షిపణుల తయారీకి అత్యంత ప్రాధాన్యమిచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ కోట్లాది రూబుల్స్ కేటాయించారు.
గత డిసెంబర్లో తొలిసారిగా జిర్కాన్ను పరీక్షించింది రష్యా. ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ శాస్త్రవేత్తలను, రక్షణ బలగాలను ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి సాటిరాగల క్షిపణులు ప్రపంచంలో మరెక్కడా లేవని ఆయన పేర్కొన్నారు. సముద్ర జలాల్లోంచి సముద్రాల్లోని లక్ష్యాలను, భూమిపై లక్ష్యాలను ఛేదించే సత్తా తమ జిర్కాన్ క్షిపణులకు ఉందని అప్పట్లో పుతిన్ ప్రపంచానికి వెల్లడించారు. తాజా పరీక్షల అనంతరం ఈ ఏడాది చివరికల్లా రక్షణ దళాలకు విడతవారీగా జిర్కాన్ క్షిపణులను సరఫరా చేస్తామని, మొదట యుద్ధనౌకలకు, ఆ తరువాత జలాంతర్గాముల్లోను వీటిని మోహరిస్తామని రష్యా తెలిపింది.
తాజా క్షిపణి ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను, ఫోటోలను రష్యా రక్షణశాఖకు చెందిన అధికార టీవీ చానల్ జ్వెజ్డా ప్రసారం చేసింది. శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలు పసిగట్టలేనంత వేగంగా ఈ అత్యంత వేగంతో దూసుకెళ్తాయని రక్షణశాఖ ప్రకటించింది. తమ జోలికొచ్చే ముందు ప్రపంచ దేశాలు జిర్కాన్ను తలచుకోవాలని గతంలోనే రష్యా ప్రకటించింది. ఒకవేళ మూడో ప్రపంచయుద్ధ పరిస్థితులు ఏర్పడితే అమెరికాలోని నగరాలను ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఈ హైపర్సోనిక్ క్షిపణికి ఉందని రష్యా గతంలోనే వెల్లడించింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.