ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పెనుముప్పు సంభవించకుండా రష్యాను నిలువరించాలని ఆయా వర్గాల నుంచి విజ్ఞప్తులు వినిపించాయి. తాజాగా ఉక్రెయిన్‌పై నిషేధిత ఆయుధాలను రష్యా ప్రయోగిస్తోందనే వాదన బయటకు వచ్చింది. అత్యంత ప్రమాదకరమైన, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయే అవకాశమున్న కొన్ని ఆయుధాలను జెనీవా సదస్సులో నిషేధించారు. రష్యా, అమెరికా, ఇండియా, చైనా వంటి కొన్ని దేశాలు మినహా అన్ని దేశాలు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి. జెనీవా నిషేధించిన జాబితాలో క్లస్టర్ బాంబులు(Cluster Bombs), వ్యాక్యూమ్ బాంబులు(Vacuum Bombs) ఉన్నాయి. ఆ ఆయుధాలను తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, నిల్వ చేయడం, తరలించడం కుదరదని ఆ ఒప్పందంలో స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు.. అణు విద్యుత్తు కేంద్రాల భద్రతపై ఆందోళన..!
అయితే ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్‌పై క్లస్టర్ బాంబులతో రష్యా దాడులకు తెగబడుతోందని ఉక్రెయిన్ ప్రభుత్వం, యూఎస్ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి ఆరోపిస్తున్నారు. యూఎన్ అమెరికా రాయబారి లిండా థామస్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించిన అనంతరం ఇదే అంశంపై అగ్రరాజ్యం అధికారిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
జెనీవా సదస్సులో (Geneva Convention) నిషేధించిన ఆయుధాలను ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగిస్తోందని లిండా థామస్ ఆరోపించారు. క్లస్టర్ బాంబులు, ఇతర నిషేధిత ఆయుధాలను రష్యా తరలిస్తోందని, దానికి సంబంధించిన వీడియోలను చూశామని చెప్పారు. మార్చి 2న అనేక ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమయ్యాయని, కీవ్ సమీపంలోనే రష్యన్ బలగాలు మోహరించి ఉన్నాయని పేర్కొన్నారు. జెనీవా సదస్సులో నిషేధించిన ఆయుధాలను ఉక్రెయిన్‌కు రష్యా పెద్ద సంఖ్యలో తరలిస్తోందని తెలిపారు. రష్యా క్లస్టర్ బాంబుల వినియోగంపై లిండా థామస్ ఆరోపణలు చేసిన అనంతరం యూఎస్ ప్రభుత్వం కూడా ఓ అధికారిక ప్రకటనలో రష్యా చర్యలను ఖండించింది.
2008వ సంవత్సరంలో జెనీవా సదస్సులో క్లస్టర్ బాంబుల తయారీ, వినియోగం, నిల్వ, తరలింపులను నిషేధించించారు. అయితే జెనీవా ఒప్పందంపై యూఎస్, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇండియా, పాకిస్థాన్, బ్రెజిల్, లిబియా దేశాలు సంతకాలు చేయలేదు. ప్రపంచంలో ఎక్కువగా క్లస్టర్ బాంబులు తయారు చేస్తున్న దేశాల్లో యూఎస్ ఉంది. ఇతర దేశాలకు విక్రయించే లక్ష్యంతో క్లస్టర్ బాంబులు తయారు చేస్తోంది, ఇప్పటికే యూఎస్ వద్ద 1 బిలియన్ క్లస్టర్ ఆయుధాలు ఉన్నట్లు సమాచారం.
క్లస్టర్ బాంబుల దాడులతో రష్యాపై విమర్శలు
రష్యా క్లస్టర్, వ్యాక్యూమ్ బాంబులతో దాడి చేసిందని ఉక్రెయిన్ ప్రభుత్వం, మానవహక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి క్లస్టర్ బాంబుల దాడిలో చాలా మంది ఉక్రెయిన్ ప్రజలు మరణించినట్లు మానవహక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. క్లస్టర్ బాంబులతో రష్యా సైనికులు దాడి చేయడం యుద్ధ నేరమేనని మండిపడుతున్నాయి. థర్మోబారిక్ వెపన్స్, వ్యాక్యూమ్ బాంబులతో రష్యా తమ ప్రజలపై దాడి చేసిందని ఉక్రెయిన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కొన్ని రోజుల్లోనే రష్యాకు చెందిన చాలా థర్మోబారిక్ వెపన్స్, ట్యాంకులను స్వాధీనం చేసుకొన్నట్లు వివరించింది.
క్లస్టర్ బాంబులు అంటే ఏంటి?
క్లస్టర్ బాంబులను ఆకాశం నుంచి విడుదల చేస్తారు. అవి బాంబ్లెట్స్గా విడిపోయి ఎక్కువ స్థలంపై ప్రభావం చూపుతాయి. ఒకేసారి ఎక్కువ లక్ష్యాలను నాశనం చేయగల శక్తి క్లస్టర్ బాంబులకు ఉంది. విమానాలు, ఆర్టిలరీ, మిస్సైల్ ద్వారా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తారు. ఒక క్లస్టర్ బాంబు వేస్తే చాలా ఫుట్‌బాల్ మైదానాలు కలిపినంత స్థలంపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తీవ్రంగా నాశనం చేయాలి, వీలైనంత వరకు నష్టం చచేకూరాలని భావించే దేశాలు క్లస్టర్ బాంబుల దాడులను ఎంచుకొనే అవకాశం ఉంది. చంపడానికి, వాహనాలను ధ్వంసం చేసేలా చాలా క్లస్టర్ బాంబుల డిజైన్ ఉంటుంది. విద్యుత్తు ససరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపడం, ల్యాండ్ మైన్స్ తొలగించగలిగేలా కూడా కొన్ని క్లస్టర్ బాంబులను తయారు చేస్తారు.
Russia Vs Ukraine: ఫలిస్తున్న ఉక్రెయిన్ వ్యూహాలు.. బెడిసికొడుతున్న రష్యా సైనిక చర్యలు..
క్లస్టర్ బాంబులపై నిషేధం ఎందుకు?
క్లస్టర్ బాంబులు చాలా పెద్ద ప్రాంతాలపై ప్రభావం చూపుతాయి, నిర్ధిష్ఠ లక్ష్యం ఉండకపోవడంతో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. క్లస్టర్ బాంబు వేసిన వెంటనే అందులోని బాంబ్లెట్ల్ విడిపోతాయి. ఎక్కువ మొత్తంలో పేలుడు సంభవిస్తుంది. అదే విధంగా ప్రయోగించిన వెంటనే క్లస్టర్ బాంబులోని బాంబ్లెట్స్ అన్నీ పేలకపోవచ్చు. కొన్ని దీర్ఘకాలంలో వివిధ రకాల ప్రమాదాలకు కారణమవుతాయి.
క్లస్టర్ బాంబులోని బాంబ్లెట్స్ పేలేది 40 శాతమేనని ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ సంస్థ చెబుతోంది. మొదటిసారిగా రెండో ప్రపంచ యుద్ధంలో క్లస్టర్ బాంబులను వాడారు. 1960, 1970వ సంవత్సరాలలో వాటిపై ఆసక్తి పెరిగి పలు దేశాలు తయారు చేయడం ప్రారంభించాయి. ఈ కాలంలోనే కెమికల్ వెపన్ టియర్ గ్యాస్‌ను మోసుకెళ్లేలా క్లస్టర్ బాంబులను వాషింగ్టన్, మాస్కో అభివృద్ధి చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb, Cluster, International news, Russia, Russia-Ukraine War, Ukraine