Russia: భారత్ కు రష్యా మొండి చేయి.. ఆఫ్ఘనిస్తాన్ పై చర్చకు మూడు దేశాలకు రష్యా ఆహ్వానం

అఫ్గాన్‌ లో శాంతిస్థాపనకు రష్యా ప్రయత్నం

ఆప్ఘనిస్థాన్ లో శాంతిస్థాపనకు రష్యా ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నంలో.. భారత్ ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. భారత్ ను ఆహ్వానించకుండా.. పాకిస్థాన్ ను ఆహ్వానించడంపై పలు అనుమానాలు పెరుగుతున్నాయి.

  • Share this:
    ఆఫ్ఘనిస్థాన్ లో శాంతి నెలకొల్పడం అగ్ర రాజ్యాలు ఫోకస్ చేశాయి. ప్రస్తుతం తాలిబన్లు, ఆఫ్ఘన్ దళాల మధ్య పోరుతో రోజురోజుకూ ఉద్రిక్తమవుతోంది. ఆఫ్గనిస్తాన్ లో శాంతి నెలకొనేలా చూసేందుకు, ఉభయ పక్షాల మధ్య రాజీ కుదిరేలా చూడడానికి రష్యా చడీచప్పుడు లేకుండా రంగంలోకి దిగింది. యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది కూడా. ఇందులో భాగంగా ఇప్పటికే అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాలకు ఆహ్వానం పంపింది. కానీ ఇండియాకు మాత్రం ఈ ఆహ్వానం అందలేదు. కావాలనే రష్యా భారత్ ను పక్కన పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11 న ఖతార్ లో ఈ దేశాల మధ్య ఆఫ్ఘన్ పరిస్థితిపై చర్చలు జరగనున్నాయి. ఆ దేశంలో శాంతి పునరుద్ధరణకు ‘మాస్కో ఫార్మాట్’ తరహాలో చర్చలు జరపాలని కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ లో పరిస్థితి మెరుగుదలకు ఇండియాతో బాటు ఇతర దేశాలతోనూ సంప్రదింపులు కొనసాగిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ గత నెలలో తాష్కెంట్ లో తెలిపారు. దీంతో రానున్న సమావేశాల్లో ఇండియాను కూడా చేరుస్తారన్న ఊహాగానాలు తలెత్తాయి. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తే కీలకమైన ఈ అంశంపై పుతిన్..అమెరికా, చైనా. పాకిస్థాన్ దేశాలను మాత్రం ఆహ్వానించడం, ఇండియాను పక్కన బెట్టడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

    నిజానికి ఆఫ్గనిస్తాన్ దేశానికి ఇండియా ఎంతగానో సహకరిస్తోంది. ఈ దేశంలో వేలాది ఆఫ్ఘన్ విద్యార్థులు చదువుకుంటున్నారు.వారికి భారత ప్రభుత్వం స్కాలర్ షిప్ లను మంజూరు చేస్తోంది. అవసరమైతే తాలిబాన్లపై పోరులో ఆఫ్ఘన్ దళాలకు సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంది. అలాంటిది రష్యా మన దేశాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని, అయితే ఆ దేశం తన వైఖరి మార్చుకోగలదని ఆశిస్తున్నామని విశ్లేషకులు అంటున్నారు.

    భారత్ ను రష్యా ఎందుకు పక్కన పెట్టిందనేది ఇప్పుడు అసక్తికరంగా మారింది. రష్యానే కావాలని ఆహ్వానించలేదు.. మరో ఇతర దేశం ఒత్తిడి ఏదైనా పని చేసిందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా భారత్ ను ఆహ్వనించకపోవడం అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందికర పరిణామమే..
    Published by:Nagesh Paina
    First published: