RESEARCHERS FOUND FOSSILS OF HUGE NINJATITAN DINOSAUR THAT LIVED 140 MILLION YEARS AGO IN ARGENTINA SRD GH
Dinosaur Fossils: అతి పురాతనమైన డైనోసర్ శిలాజాన్ని గుర్తించిన పరిశోధకులు..ఎక్కడంటే..
అతి పురాతనమైన డైనోసర్ శిలాజాన్ని గుర్తించిన పరిశోధకులు..ఎక్కడంటే..
Dinosaur Fossils: భూమిపైన నివసించిన పురాతన జీవజాతుల ఆనవాళ్లను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్న శాస్త్రవేత్తలు ఒక భారీ జంతువు శిలాజాలను గుర్తించారు. ఇది నింజటిటన్ జపటై జాతికి చెందిన డైనోసర్ శిలాజమని తెలిపారు.
భూమిపైన నివసించిన పురాతన జీవజాతుల ఆనవాళ్లను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్న శాస్త్రవేత్తలు ఒక భారీ జంతువు శిలాజాలను గుర్తించారు. ఇది నింజటిటన్ జపటై జాతికి చెందిన డైనోసర్ శిలాజమని తెలిపారు. భూమి మీద పుట్టిన అతిపెద్ద, పురాతన డైనోసర్లను టైటనోసార్స్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం బయటపడ్డ ఈజీవి శిలాజాలు టైటనోసార్స్ సమూహంలోని నింజటిటన్ డైనోసర్ది అని గుర్తించారు. వీటి మెడ చాలా పొడవుగా ఉంటుంది. కాళ్లు నాలుగు స్తంభాల మాదిరిగా ఉంటాయి. అయితే ఇవి మొక్కలను తిని జీవించే శాకాహార జీవులు.నింజటిటన్ డైనోసర్లు దాదాపు 14 కోట్ల సంవత్సరాల క్రితం, క్రెటేషియస్ పీరియడ్లో భూమి మీద నివసించేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భారీ జంతువు శిలాజాలను అర్జెంటీనాలో తాజాగా కనుగొన్నారు.అర్జెంటీనాలోని పటగోనియన్ అడవుల్లో డైనోసార్ అస్థిపంజరం, అసంపూర్తిగా ఉన్న అవశేషాలు బయటపడ్డాయి. టైటనోసార్ల ఆనవాళ్లు గతంలో చాలా ప్రాంతాల్లో కనిపించాయి. కానీ వీటిల్లో ప్రస్తుత నింజటిటన్ జాతి డైనోసార్లు అన్నింటికంటే పురాతనమైనవని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూసిన డైనోసర్ల ఆనవాళ్లలో నింజటిటాన్ డైనోసర్లు పురాతనమైనవిగా గుర్తించామని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఆఫ్ అర్జెంటీనా (CONICET) పరిశోధకుడు, అధ్యయన బృంద సభ్యుడు పాబ్లో గలీనా చెప్పారు.
* భారీ శరీరాకృతి ఉన్న జీవులు
ప్రస్తుతం కనుగొన్న నింజటిటన్ డైనోసర్ సుమారు 65 అడుగుల (20 మీటర్లు) పొడవు ఉంటుంది. కానీ టైటానోసార్లలో నింజటిటన్ జాతుల తరువాత పుట్టిన అర్జెంటినోసార్లు ఇంకా భారీ పరిమాణంలో ఉన్నాయి. ఇవి ఏకంగా 115 అడుగులు (35 మీటర్లు) వరకు పొడవు పెరిగాయని శాస్త్రవేత్తలు గతంలో గుర్తించారు. టైటానోసార్లు దక్షిణార్ధగోళంలోనే ఉద్భవించాయనే వాదనను ప్రస్తుతం బయట పడిన ఈ శిలాజం నిరూపిస్తోందని వారు తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను అమేఘినియా అనే సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించారు.
టిటానోసార్లు సౌరోపోడ్స్ అనే పెద్ద డైనోసార్ సమూహంలో భాగంగా ఉన్నాయి. ఇవి జురాసిక్ పీరియడ్లో, క్రెటేషియస్ కాలానికి ముందు ఉత్తర అమెరికాలో నివసించాయి. అప్పట్లో పటగోనియా ప్రాంతంలో నివసించిన అర్జెంటినోసార్స్, పటగొటిటనోసార్స్ జాతులు భారీ శరీరాకృతితో ఉండేవని పరిశోధకులు కనుగొన్నారు. తాజాగా బయటపడిన ఈ శిలాజం వీటికంటే పురాతనమైన డైనోసర్ జాతిదేనని వారు గుర్తించారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.