Viral News: తల్లి వదిలేసిపోతే.. రోడ్డున పడ్డ పిల్లి పిల్లలకు తండ్రిలా మారిన కుక్క.. ఈ బంధం ఏనాటిదో..

పిల్లి పిల్లలకు తండ్రిగా మారిన కుక్క

ఒక పిల్లి తన ఏడు పిల్లలను రోడ్డుమీద వదిలేస్తే.. ఒక మగ కుక్క వాటికి తండ్రిలా మారి సంరక్షిస్తోంది. వీటి మధ్య బంధాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

  • Share this:
పిల్లి, కుక్క బద్ద శత్రువులని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ రెండు పెంపుడు జంతువులు ఎదురుపడితే.. భీకరమైన యుద్ధం జరగడం అనివార్యం. కానీ కొన్ని కుక్కలు, పిల్లలు మాత్రం తమ శత్రుత్వాన్ని మరిచి మంచి మిత్రులు అవుతుంటాయి. ఈ రెండు జాతుల పెంపుడు జంతువులు కలిసి ఆడుకుంటుంటే ఇక కనులవిందే అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఒక కుక్క.. పిల్లులతో తమకున్న బంధాన్ని వేరే లెవెల్‌కి తీసుకెళ్ళింది. ఒక పిల్లి తన ఏడు పిల్లలను రోడ్డుమీద వదిలేస్తే.. ఒక మగ కుక్క వాటికి తండ్రిలా మారి సంరక్షిస్తోంది. వీటి మధ్య బంధాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

రాచెల్ అనే మహిళ నైరుతి లండన్‌లోని యానిమల్ రెస్క్యూ ఛారిటీ సంస్థ 'బాటర్సీయా' లో హెడ్ నర్సుగా పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితం ఆమె.. ఎవరో వదిలేసిన ఒక లాబ్రడార్ కుక్కను ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటున్నారు. ఆ కుక్క పిల్లకి బెర్టీ అని ముద్దు పేరు పెట్టి.. తన ఇంట్లోనే శాశ్వతంగా ఆశ్రయం కల్పించారు. అయితే కొద్ది వారాల క్రితం ఒక స్థానిక వ్యక్తి 7 పిల్లి పిల్లలను రోడ్డుపై చూశారు. వాటి తల్లి ఎక్కడా కనిపించలేదు. బహుశా ఈ పిల్లలను తల్లి వదిలిపెట్టి ఉండొచ్చని భావించారు. అనంతరం పిల్లి పిల్లలను వైద్య పరీక్ష నిమిత్తం రెస్క్యూ ఛారిటీ 'బాటర్సీయా' కి తరలించారు. దీంతో పశువైద్యుల బృందం పిల్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అన్ని పిల్లులు ఆరోగ్యంగానే ఉన్నాయి.. కానీ బాగా ఆకలితో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.

అయితే అదే యానిమల్ రెస్క్యూ సంస్థలో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న రాచెల్ వాటి పరిస్థితిని చూసి చలించిపోయారు. పిల్లి పిల్లలను తన ఇంటికి తీసుకెళ్ళి పెంచాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే తన ఇంట్లో బెర్టీ ఉండటంతో ఆమె కాస్త ఆందోళన పడ్డారు. ఆ కుక్క.. పిల్లి పిల్లలపై దాడి చేస్తుందేమో అనుకున్నారు. కానీ బెర్టీ పిల్లి పిల్లలను అక్కున చేర్చుకుని ఆశ్చర్యపరిచింది. తన సొంత పిల్లలను సంరక్షించినట్టు వాటిని దగ్గరకు తీసుకుంది.

ఈ ఘటనను చూసి రాచెల్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కుక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేసేలా ఆమె నెట్టింట ఒక ఫొటో షేర్ చేశారు. "కేవలం ఒక్క ఏడాది వయసున్న బెర్టీ ఎంతో సహనంతో అనాధ పిల్లి పిల్లలను దగ్గరకు తీసుకుంది. వాటిని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతోంది. పిల్లి పిల్లలకు కొన్ని వారాల వయస్సు మాత్రమే ఉంది. వాటిని పెంచి పెద్ద చేసిన తర్వాత దత్తతకు ఇస్తాను" అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే లాబ్రడార్ రిట్రీవర్ బెర్టీ గురించి తెలుసుకున్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: