REAL ESTATE FIRMS ACCEPTING WATERMELONS WHEAT AS PAYMENT IN CHINA PEOPLE CAN BUY HOMES WITH AGRI PRODUCTS SK
Home Offers: డబ్బులు అవసరం లేదు.. పుచ్చకాయలు, గోధుమలు ఇస్తే చాలు.. కొత్త ఇల్లు మీ సొంతం
ప్రతీకాత్మక చిత్రం
China Home Offers: ఆర్థిక మాంద్యం వల్ల ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో బిల్డర్లు వినూత్న ఆఫర్లతో ముందుకొస్తున్నారు. ఇళ్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. పుచ్చకాయలు, గోధుమలు, అల్లం, వెల్లుల్లి వంటి పంట ఉత్పత్తులు ఉంటే ఇవ్వండని.. ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఎంత కష్టపడైనా సరే.. సొంత ఇంటిని కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. హైదరాబాద్ వంటి నగరాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండిపెండెంట్ ఇల్లు ధర రూ.50 లక్షల నుంచి కోటి వరకు పలుకుతోంది. ఐనప్పటికీ ఇళ్ల కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఐతే చైనా (China)లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇళ్ల కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. ఆర్థిక మాంద్యం వల్ల ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో బిల్డర్లు వినూత్న ఆఫర్లతో ముందుకొస్తున్నారు. ఇళ్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. పుచ్చకాయలు, గోధుమలు, అల్లం, వెల్లుల్లి వంటి పంట ఉత్పత్తులు ఉంటే ఇవ్వండని.. ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
గత జనవరి నుంచి జూన్ వరకు చైనాలో ఇళ్ల కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. ఇళ్లను కొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో.. బిల్డర్లు (Real Estate) కట్టిన ఇళ్లు.. నిరూపయోగంగా పడి ఉన్నాయి. రుణ సంస్థల నుంచి అప్పు తీసుకొని ఇళ్లు కట్టిన బిల్డర్లు.. ఇప్పుడు వాటిని కొనేగేందుకు ఎవరూ రాకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలు చైనీస్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే గ్రామీణ, చిన్న చిన్న పట్టణ ప్రాంతాలను ఆకర్షించేందుకు ఆఫర్లను తీసుకొస్తున్నాయి. డౌన్‌పేమెంట్ చెల్లింపుల కింద... పుచ్చకాయలు (Water melon), అల్లం (Ginger), వెల్లుల్లి (Garlic), గోధుమలు (Wheat) వంటి వ్యవసాయ ఉత్పత్తుల తీసుకుంటున్నారట.
ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో ఉన్నాయి. రుణ సంక్షోభం నేపథ్యంలో.. కొద్ది రోజుల క్రితం చైనా ప్రభుత్వం బిల్డర్లు వినియోగదారుల నుంచి టోకెన్ డబ్బు తీసుకోవడానికి నిరాకరించింది. ఈ క్రమంలోనే వ్యవసాయ ఉత్పత్తుల వైపు మొగ్గుచూపుతున్నారు.
నాంజింగ్ నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ గత నెల 28 నుంచి ఈ నెల 15 వరకు ఆఫర్లును అందిస్తోంది. ఆ ఆఫర్ కింద ఇళ్ల కొనుగోలుదారుల చెల్లింపులకు 20 యువాన్ల (రూ.236) కింద ఒక పుచ్చకాయ తీసుకుంటున్నారు. గరిష్ఠంగా లక్ష యువాన్లకు 5000 పుచ్చకాయలు తీసుకుంటున్నారు. ఇళ్ల ధర 6లక్షల యువాన్ల నుంచ 9 లక్షల యువాన్ల వరకు ఉంటున్నాయి. అంటే.. లక్ష యువాన్లను పుచ్చకాయల రూపంలో తీసుకొని.. మిగిలిన డబ్బును కరెన్సీ రూపంలో తీసుకుంటున్నారట. ఇలాగే పీచెస్, గోధుమలు, అల్లం, వెల్లుల్లికి కూడా ఆఫర్లను ఇస్తున్నారు.
2019 నుంచి వరుసగా కరోనా లాక్డౌన్స్ (Corona Lockdown), ఉక్రెయిన్-రష్యా యుద్దం (Ukraine-Russia War)తో నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు చైనాలో కూడా ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. నగదు కొరతతో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ముఖ్యంగా హెనాన్స్ ప్రావిన్స్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. బిల్డర్లు ఇప్పటికే నిర్మించిన.. 6 కోట్ల 50 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీగా బోసిపోయి ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు జనాలు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. అవి అలాగే ఉండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. బిల్డర్లు వ్యవసాయ ఉత్పతులను చెల్లింపులుగా అంగీరించడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి. అంతర్జాతీయంగా గోధులమకు డిమాండ్ పెరగడం, చైనాలో నగదు కొరత ఏర్పడడం, హెనాన్ ప్రావిన్స్‌లో రైతులు ఎక్కువగా ఉన్నందున వారిని ఆకట్టుకోవడం కోసం.. ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ ఆఫర్లు ప్రకటించిన తర్వాత..ఇళ్ల కొనుగోళ్లు ఊపందుకుంటాయని బిల్డర్లు భావించారు. కానీ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేవని వాపోతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.