• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • RAUL CASTRO TO STEP DOWN FROM TOP POSITION IN PARTY ENDING 60 YEARS OF FAMILY MONOPOLY IN CUBA POLITICS SK GH

Raul Castro: రౌల్ క్యాస్ట్రో సంచలన నిర్ణయం.. క్యూబాలో 60 ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు

Raul Castro: రౌల్ క్యాస్ట్రో సంచలన నిర్ణయం.. క్యూబాలో 60 ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు

రౌల్ క్యాస్ట్రో

ప్రస్తుతం క్యూబా దేశం ఎన్నో సమస్యల ఉచ్చులో చిక్కుకుంది. ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, ఆహార కొరత, ప్రాథమిక సౌకర్యాల లేమి, పరిమిత స్వేచ్ఛతో దేశ ప్రజలు నిరాశలో ఉన్నారు.

  • Share this:
క్యూబా.. ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న కమ్యూనిస్టు దేశం. ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్యూబా అత్యున్నత పదవి నుంచి రౌల్ కాస్ట్రో వైదొలిగారు. దీంతో క్యాస్ట్రోల 60 ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు పడింది. క్యూబా కమ్యూనిస్టు పార్టీలో ‘ఫస్ట్ సెక్రెటరీ’ స్థానంలో ఉన్న వ్యక్తికి దేశ పాలన, పార్టీపై సర్వ అధికారాలు ఉంటాయి. ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన స్థానం కావడం విశేషం. ప్రస్తుతం 89 ఏళ్ల రౌల్ క్యాస్ట్రో క్యూబా కమ్యూనిస్టు పార్టీకి ఫస్ట్ సెక్రటరీ పదవిలో కొనసాగాగుతున్నారు. శుక్రవారం ఆ పదవి నుంచి రౌల్ వైదొలగనున్నారు. ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు, 60 ఏళ్ల మిగ్యుయెల్ డియాజ్ కానెల్‌ పార్టీ తదుపరి ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

క్యూబా పాలన వ్యవహారాల్లో పార్టీ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి కంటే కమ్యూనిస్టు పార్టీలోని ఫస్ట్ సెక్రటరీకే ఎక్కువ విలువ ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న క్యూబా కమ్యూనిస్టు పార్టీకి రౌల్ క్యాస్ట్రో ఫస్ట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ప్రారంభమయ్యే నాలుగు రోజుల పార్టీ సమావేశాల్లో రౌల్ కాస్ట్రో ఈ పదవి నుంచి తప్పుకోనున్నారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర
క్యూబా దేశ రాజకీయాలు, పాలనపై ఫిడెల్ క్యాస్ట్రో, అతడి సోదరుడు రౌల్ క్యాస్ట్రో చెరిగిపోని ముద్ర వేశారు. వీరిద్దరూ దేశాన్ని సుమారు 50 ఏళ్ల పాటు పాలించారు. 1959 నుంచి 2006 వరకు దాదాపు ఐదు దశాబ్దాల పాటు పాలించిన కాస్ట్రో సోదరులు 60 ఏళ్ల వరకు పార్టీపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా ఉన్న డయాజ్ కానెల్.. క్యాస్ట్రో సోదరుల తరువాత శక్తివంతమైన క్యూబా కమ్యూనిస్టు పార్టీ (PCC)కి మూడవ ‘ఫస్ట్ సెక్రటరీ’ హోదాను పొందనున్నారు.

సోషలిజం తిరుగులేనిది
రౌల్ క్యాస్ట్రో క్యూబా రాజకీయ పోరాటంలో, సైద్ధాంతిక పోరాటంలో భాగంగా ఉన్నారు. అంతమాత్రాన ఆయన పార్టీ నాయకత్వం నుంచి వైదొలగడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ శైలిలో ఊహించని మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. క్యూబా మొదటి నుంచి సోషలిస్టు దేశంగా ఉంది. ఆ దేశంలో 2019లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇందులో సోషలిజం పట్ల క్యూబా నిబద్ధత తిరుగులేనిది అని పేర్కొన్నారు. అంటే దేశం ఎప్పటికీ సామ్యవాద సిద్దాంతాలను వదులుకోదని పాలకులు చేశారు. సాధారణంగా క్యూబా ప్రజలు దేశ రాజకీయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం దేశం ఎన్నో సమస్యల ఉచ్చులో చిక్కుకుంది. ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, ఆహార కొరత, ప్రాథమిక సౌకర్యాల లేమి, పరిమిత స్వేచ్ఛతో దేశ ప్రజలు నిరాశలో ఉన్నారు.

తీవ్రమైన ఆర్థిక సంక్షోభం
క్యూబాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. పాలనా పరమైన వైఫల్యాలు, ట్రంప్ హయాంలో క్యూబాపై పెరిగిన ఆంక్షలు, కరోనా వైరస్ వల్ల పర్యాటకం దెబ్బతినడంతో దేశ ఎకానమీ (ఆర్థిక వ్యవస్థ) 11 శాతం తగ్గింది. ఇది 1993 తరువాత అత్యంత ఘోరమైన క్షీణత కావడం విశేషం. గతంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల్లో అమెరికా డాలర్లకు మార్చుకోవడానికి వీలయ్యే కన్వర్టబుల్ పెసో(దేశ కరెన్సీ)ను తొలగించాలని నిర్ణయించారు. దీంతో తక్కువ విలువైన అధికారిక పెసో చలామణిలోకి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వం జీతాలు పెంచినా, ధరల ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాలేదు. ప్రస్తుత పార్టీ సమావేశాల్లో ఈ అంశాలను సమీక్షిస్తామని క్యూబా కమ్యూనిస్టు పార్టీ తెలిపింది.

మార్పులకు పెద్దపీట
క్యూబా నాయకత్వానికి యువతరం అవసరాలు, ప్రాధాన్యాలు ఆలస్యంగా అర్థమవుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హక్కులు, మెరుగైన జీవన ప్రమాణాలను అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్న నవ తరం ఆలోచనలకు పాలకులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఫిబ్రవరిలో ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉండే ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగ ఎంటర్‌ప్రెన్యూర్లకు అవకాశం కల్పించింది. క్రమంగా సంస్కరణల మార్గంలో దేశం పయనిస్తోంది.

మారుతున్న ప్రజల ఆలోచనలు
క్యూబాలో 2018లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం ప్రారంభమైంది. ఆ తరువాత తమ అభిప్రాయాలను ప్రజలు స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం దక్కింది. పరిమితమైన స్వేచ్ఛ కారణంగా నిరసనలు చేపట్టేందుకు అవకాశం లేని అదే ప్రాంతంలో ఇప్పుడు ఎన్నో రకాల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ రాజకీయ, సైద్ధాంతిక విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కాస్ట్రో అత్యున్నత పదవి నుంచి వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పదవీ విరమణ చేసిన తరువాత తన మనవళ్లు, మనవరాళ్లతో ఎక్కువ సమయం గడుపుతానని రౌల్ క్యాస్ట్రో చెప్పారు. కానీ ఆయన తెర వెనుక నుంచే పాలన వ్యవహారాలను పర్యవేక్షించే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు