Viral News: 11 రోజులు ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

రాండీ గార్డ్‌నర్ (Image:Youtube)

ర్యాండీ 264. 4 గంటల పాటు మెలకువగా ఉన్నాడు. ఈ ప్రయోగం ముగిసిన తర్వాత పద్నాలుగు గంటల 40 నిమిషాల పాటు నిద్రపోయి రాత్రి 8.40 గంటలకు నిద్ర లేచాడు.

  • Share this:
ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలైనా నిద్రపోవాలని నిపుణులు చెబుతుంటారు. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్ వల్ల చాలామంది సరిగ్గా నిద్రపోవట్లేదు. ఇది చాలా ప్రమాదకరం అని నిపుణులు వెల్లడిస్తున్నారు. మంచి ఆరోగ్యం కోసం మంచి నిద్ర ఎంతో అవసరం. అయితే మనం నిద్రపోకుండా ఉండగలిగే అత్యధిక సమయం ఎంత అన్న ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? అలాంటి ఆలోచనే ర్యాండీ గార్డనర్ అనే టీనేజర్‌కి వచ్చింది. అంతే తన స్నేహితుడితో కలిసి ఓ ప్రయోగం చేశాడు. పదకొండు రోజుల పాటు నిద్ర లేకుండా గడిపాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఆ ప్రయోగం గురించి తెలుసుకోవాలి.

అమెరికాకు చెందిన ర్యాండీ గార్డనర్ అనే వ్యక్తి 11 రోజుల 25 నిమిషాల పాటు నిద్రపోకుండా రికార్డు క్రియేట్ చేశాడు. ఇది అతడు తన హై స్కూల్ ప్రాజెక్ట్ కోసం చేయడం మరో పెద్ద విశేషం. 1963 డిసెంబర్ లో ర్యాండీ అతడి స్నేహితుడు బ్రూస్ మెక్ అలిస్టర్ ఓ సైన్స్ ఫెయిర్ ప్రాజెక్ట్ కోసం నిద్ర పోకుండా వీలైనన్ని రోజులు ఉండి.. ఆ తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి రాసే ప్రయోగం చేయాలని భావించారు. అప్పటికి వీరిద్దరి వయసు కేవలం 17 సంవత్సరాలు. ఇద్దరిలో ఎవరు నిద్ర లేకుండా ఉండాలన్న విషయంపై టాస్ వేసుకున్నారు. ఇందులో ర్యాండీ ఓడిపోవడంతో ర్యాండీ నిద్ర లేకుండా ఉండాల్సి వచ్చింది.

దీని గురించి మెక్ అలిస్టర్ మాట్లాడుతూ.. ‘అప్పటికి మా వయసు కేవలం 17 సంవత్సరాలు. మేం చాలా ఫూలిష్ గా వ్యవహరించేవాళ్లం. టాస్ ఓడిపోయింది ర్యాండీయే కానీ నేను కూడా మూడు రోజుల పాటు అతడిని మానిటర్ చేయడానికి తనతో పాటు మెలకువగా ఉన్నాను. మూడు రోజుల పాటు అలా నిద్ర లేకుండా ఉన్న తర్వాత నాకు తెలియకుండానే గోడకు ఆనుకొని నిద్రపోయి లేచాను. గోడపైనే నోట్స్ రాస్తూ ఉండిపోయాను. అందుకే మూడో రోజు తర్వాత మరో వ్యక్తిని చేర్చుకున్నాం. నేను పడుకున్నప్పుడు జో మార్సియానో అనే వ్యక్తి చెక్ చేస్తూ ఉండేవాడు. మాతో పాటు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ స్లీప్ రీసర్చర్ డాక్టర్ విలియమ్ డిమెంట్, అమెరికా నేవీ మెడికల్ లెఫ్టినెంట్ కమాండర్ జాన్ రాస్ కూడా ఈ రీసెర్చ్‌ని పరిశీలించారు’ అని వెల్లడించాడు.

మూడో రోజుకల్లా ర్యాండీ చాలా ఎమోషనల్‌గా మారిపోయాడు, నాలుగో రోజుకి హ్యాలుసినేషన్స్ ఎదురవుతున్నాయని వెల్లడించాడు. ఈ పదకొండు రోజుల పాటు మెలకువగా ఉండేందుకు బాస్కెట్ బాల్, పిన్ బాల్ ఆడుతూ గడిపేవాడు. అయితే నిద్ర లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఉన్నా బాస్కెట్ బాల్ ఆటలో ర్యాండీ రోజురోజుకీ మెరుగుపడుతూ పోయాడు. రోజులో మెలకువగా ఉండడం సులువుగానే ఉన్నా.. రాత్రుళ్లు ఇబ్బందిగా మారేదని వెల్లడించాడు.

ఈ ప్రయోగం జనవరి 8, 1964 న ముగిసింది. ఈ లోపల ర్యాండీ 264. 4 గంటల పాటు మెలకువగా ఉన్నాడు. ఈ ప్రయోగం ముగిసిన తర్వాత పద్నాలుగు గంటల 40 నిమిషాల పాటు నిద్రపోయి రాత్రి 8.40 గంటలకు నిద్ర లేచాడు. ఆ తర్వాత మరో 7.30 గంటలు మెలకువగా ఉండి మరో పదిన్నర గంటల పాటు నిద్ర పోయాడు. ఆ తర్వాత అతడు పదకొండు రోజుల నిద్ర లేమి నుంచి పూర్తిగా ఉపశమనం పొందాడు. అయినా ఆ తర్వాత కొన్నేళ్ల పాటు నిద్రలేమితో బాధపడ్డాడు గార్డనర్. ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దీన్ని కేటగిరిలోకి తీసుకోవడం మానేసింది. ఇది ప్రాణాలకు హాని కలిగిస్తుంది కాబట్టి రికార్డు అందించట్లేదు.
Published by:Shiva Kumar Addula
First published: