The Quad: అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ సభ్య దేశాలుగా శుక్రవారం క్వాడ్ (QUAD) కూటమి సమావేశం జరిగింది. తొలి సమావేశంతోనే సభ్య దేశాలు చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపినట్లైంది. క్వాడ్‌లోని సభ్య దేశాలన్నీ ప్రస్తుతం చైనాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి నాలుగూ ప్రజాస్వామ్య దేశాలే కావడంతో... ఈ గ్రూప్‌కి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పైగా... భారత్ తప్ప మిగతా 3 దేశాలూ అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు. అలాంటి దేశాలు భారత్‌ను సభ్య దేశంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం... ఇండియా సాధిస్తున్న అభివృద్ధే. పైగా... ఆసియాలో చైనా దూకుడుకు చెక్ పెట్టాలంటే... భారతే సరైన దేశమని ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ గ్రూప్ ద్వారా ఈ నాలుగు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, రక్షణ, అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకోనున్నాయి.
ప్రధానంగా ఈ గ్రూప్ ఏర్పడటానికి కారణం... ప్రకృతి విపత్తులు. భూకంపం, సునామీ వంటి ప్రళయాలు వచ్చినప్పుడు... ఈ నాలుగు దేశాలూ బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తాయి. తగిన సహకారం పాటిస్తూ... బాధితులకు అండగా నిలుస్తాయి. 2004లో వచ్చిన భారీ భూకంపం, సునామీతో... ఇండొనేసియా భూ పలకాలు... 2 మీటర్లు పక్కకు జరిగాయి. అప్పటి ప్రళయంలో భారత్ సహ చలా తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ క్రమంలో ఇలాంటి గ్రూప్ ఒకటి ఉండాలనే ఆలోచన వచ్చింది. 2007లో అది ఏర్పాటైంది. కౌంటర్ టెర్రరిజం నియంత్రణ, మెరీటైమ్ సెక్యూరిటీ, ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ, సరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం తదితర అంశాలు ప్రాతిపదికగా నాలుగు దేశాలూ కలిసి క్వాడ్‌గా ఏర్పడ్డాయి.
This morning, I met virtually with the Quad in the first multilateral summit I’ve hosted as president. The United States, Japan, India, and Australia are committed to working together to tackle the shared challenges we face and to secure a free and open Indo-Pacific region. pic.twitter.com/m0AYfsEx6z
— President Biden (@POTUS) March 12, 2021
పైకి ఇది పర్యావరణ, విపత్తుల కోసం ఏర్పడిన గ్రూపులా ఉన్నా... తెరవెనక వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయి. ప్రధానంగా చైనా... తన చుట్టూ ఉన్న దేశాల భూభాగాలను ఆక్రమించుకుంటూ... దక్షిణ చైనా సముద్రంలో కూడా తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ... భయాందోళనలు కలిగిస్తోంది. చాలా దేశాలపై పెత్తనం చేస్తోంది. హాంకాంగ్, తైవాన్, టిబెట్ లాంటి దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంటూ... నియంతృత్వ ధోరణి అవలంబిస్తోంది. డ్రాగన్ కంట్రీని ఇలాగే వదిలేస్తే... అది మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అగ్రదేశాలు... దానికి చెక్ పెట్టేందుకే ఈ గ్రూప్‌ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక జో బిడెన్ పాల్గొన్న తొలి దేశాల స్థాయి సమావేశం ఇదే.
ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లపై క్వాడ్ తొలి సమావేశంలో చర్చించారు. కరోనాను ఎలా తరిమేయాలి, ప్రపంచ దేశాలకు ఎలాంటి సాయం అందించాలి... అనే అంశాలపై సభ్య దేశాలు చర్చించాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరాపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. పర్యావరణ మార్పులు, ఆరోగ్యం, టెక్నాలజీతో వస్తున్న మార్పులపై గ్రూప్ సభ్యులు చర్చించారు. ఇదే సమయంలో... ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ప్రపంచ దేశాలన్నీ గౌరవించాలని కోరారు. ఈ రెండు అంశాలనూ చైనా కాలరాస్తోంది. ఈ సదస్సు ద్వారా పరోక్షంగా చైనాకు హెచ్చరికలు పంపినట్లైంది. ముఖ్యంగా అధ్యక్షుడు జో బైడెన్ చైనా ఇన్‌డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు. విస్తరణ కాంక్ష మంచిది కాదన్నారు.
ఇది కూడా చదవండి: Weekly Horoscope: వారఫలాలు... మార్చి 14 నుంచి మార్చి 20 వరకు రాశిఫలాలు
క్వాడ్ కూటమి యాక్టివ్‌గా మారడం వెనక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి ఉంది. కొన్నాళ్లుగా చైనా ఎక్స్‌స్ట్రాలు చేస్తున్న విషయాన్ని గమనిస్తున్న ఆయన... డ్రాగన్ తోక కత్తిరించేందుకు క్వాడ్ కూటమి సభ్య దేశాలతో విడివిడిగా మాట్లాడారు. సమావేశం ఏర్పాటయ్యేలా పావులు కదిపారు. ఒకప్పుడు చైనాకి అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా సైతం... ఇప్పుడు చైనాకి చెక్ పెట్టే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా క్వాడ్ సదస్సుకు మద్దతు పెరిగింది. అందుకే ఇప్పుడు బీజింగ్ కుళ్లుకుంటోంది. నాలుగు వైపుల నుంచి నాలుగు దేశాలు తనను టార్గెట్ చెయ్యడంతో... డ్రాగన్ ఉచ్చులో చిక్కినట్లు విలవిలలాడుతోంది. అసలే తమ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంటే... ఇండియాతో పోరులో బలహీనపడుతూ... చైనా అన్ని విధాలుగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News