Rahul Slogans In Pakistan Rally : రాజకీయ అస్ధిరతకు మారుపేరైన పాకిస్తాన్ లో గత నెల రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. శనివారం అనేక వాయిదాల మధ్య సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ.. అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ను సాగనంపింది. జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉండగా, మెజార్టీకి అవసరమైన బలం 172. అయితే ఇమ్రాన్ సర్కార్ కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఆయాజ్ సాదిఖ్ ప్రకటించారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ నిలిచారు. అయితే ప్రధానమంత్రి పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా పాకిస్థాన్లో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తోంది. ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్, క్వెట్టా, ఖైబర్ వంటి ప్రధాన నగరాల్లో ఆందోళనలు చేపడుతోంది. విపక్షాలకు,ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన షేక్ రషీద్ నిర్వహించిన బహిరంగ సభలో..కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదాలు' వినిపించాయి.
హోం శాఖ మాజీ మంత్రి అయిన షేక్ రషీద్.. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో భారీ నిరసన సభ నిర్వహించారు. దీనికి వేలాది మంది తరలి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆర్మీపై విమర్శలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించినందుకు.. సైన్యాన్ని "చౌకీదార్ చోర్ హై" అని మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. చౌకీదార్ చోర్ నినాదాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరచుగా ఉపయోగించేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించేందుకు ఈ నినాదాన్ని 2019 ఎన్నికల సందర్భంగా ప్రయోగించారు రాహుల్. అయితే షేక్ రషీద్.. నిరసనకారులను శాంతిపజేసేందుకు ప్రయత్నించారు. ఆర్మీపై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని వారించారు. శాంతియుతంగా పోరాడదాం అంటూ పిలుపునిచ్చారు.
ALSO READ Russia-Ukraine War : వ్యూహం మార్చిన పుతిన్..ఇక భారీ విధ్వంసమే!..మే-9 లాస్ట్ డేట్!
మరోవైపు, పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమే కానుంది. ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా షరీఫ్ ఆదివారం ఎన్నికయ్యారు. కొత్త ప్రధాని ఎంపికకు వీలుగా ఆ దేశ జాతీయ అసెంబ్లీ సోమవారం భేటీ కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కాగా,పాకిస్తాన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న షెహబాజ్ షరీఫ్...పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు స్వయానా తమ్ముడు. దూకుడుగా వ్యవహరించే ఇమ్రాన్ ఖాన్ కంటే.. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించే అనుభవజ్ఞుడైన షెహబాజ్ షరీఫ్ హయాంలో భారత్ - పాక్ సంబంధాలు ఎంతోకొంత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Pakistan, Pakistan army, Rahul Gandhi