కరోనా పుణ్యమాని దాదాపు అన్ని సేవలు ఆన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చాయిగానీ, మీకు గుర్తుండే ఉంటుంది.. మూడు నాలుగేళ్ల కిందటి వరకు కూడా పండుగలకు పబ్బాలకు ఊళ్లకు వెళ్లాలనుకునేవారు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద గంటలకొద్దీ పడిగాపులు కాసిన సందర్భాలు. కరోనా వల్ల ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్(ఐపీఎల్) ఇక్కడ జరగట్లేదుగానీ, ఆయా స్టేడియాలు, టికెట్ కౌంటర్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు చూసున్నాం. అంతెందుకు, ఆథ్యాత్మిక చింతన పెరుగుతోన్న ప్రస్తుత కాలంలో ఏ పండుగకైనా ఆలయాల వద్ద భారీ క్యూలైన్లు దర్శనమిస్తుండటం తెలిసిందే. కాస్త కాళ్లు నొప్పిపుట్టి లైన్లో నుంచి పక్కాకు జరిగామంటే ఇక గొడవలే. ఆలయాల దగ్గర కాదుగానీ, రైల్వే రిజర్వేషన్, ఐపీఎల్ టికెట్ బుకింగ్ కేంద్రాల వద్ద మన బదులు వేరేవాళ్లను ఏ వందకో, యాభైకో లైన్లో నిలబెట్టిన వ్యవహారాలు కొందరికి తెలుసు. అలా డబ్బులు తీసుకొని వేరేవాళ్ల కోసం క్యూలైన్లలో నిలబడటానికి మన దేశంలో విలువ తక్కువే కావొచ్చుగానీ, బ్రిటన్ లో మాత్రం దాన్నొక ప్రొఫెషన్ లా చూస్తారు. అవును, లండన్ కు చెందిన ఓ ప్రొఫెషనల్ క్యూయర్ గురించే ఈ కథనం..
ఆ వ్యక్తి మరింకే పని చేయడు. కేవలం క్యూలైన్లో నిలబడి రోజూ డబ్బులు సంపాదిస్తున్నారు. అతడి పేరు ఫ్రెడ్డీ బెకిట్. లండన్‌కు చెందిన బెకిట్ను అందరూ ప్రొఫెషనల్ క్యూయర్ అంటారు. ఎందుకంటే.. అతడు చేసే పనే అది. ధనవంతుల కోసం అతడు లైన్లో నిలుచుంటాడన్నమాట. క్యూ అంటే ఉదాహరణకు సినిమా హాల్ ముందు క్యూ కావచ్చు.. మాల్స్ ముందు కావచ్చు. వైన్ షాపుల ముందు, మ్యూజియం, సూపర్ మార్కెట్స్, స్టోర్స్ ముందు క్యూ కావచ్చు.. ఎక్కడ క్యూ ఉన్నా.. అక్కడ బెకిట్ ప్రత్యక్షం అవుతాడు. లైన్లో నిలబడలేని వాళ్ల కోసం లైన్లో నిలబడి డబ్బు సంపాదిస్తాడు.
గడ్డ కట్టే చలిలో, ఎండలో నిలబడలేని వాళ్ల కోసం బెకిట్ ఈ పని చేస్తాడు. అలా వాళ్ల కోసం లైన్లో నిలబడినందుకు గంటకు రూ.2000 ఇస్తారట. రోజుకు కనీసం 8 గంటలు పనిచేసినా తనకు రూ.16000 వరకు వస్తాయట. ఎక్కువగా ఏవైనా ఈవెంట్స్ కోసం టికెట్లు తీసుకోవడానికి వచ్చేవాళ్లు తనకు ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి క్యూలో నిలుచోబెడతారట.
బ్రిటన్ రాజధాని లండన్ సిటీలో బెకిట్ లాంటి ప్రొఫెషనర్ క్యూయర్స్ చాలామందే ఉన్నారు. ఎక్కువ లైన్ ఉన్నప్పుడు అంత పెద్ద లైన్లో నిలబడలేక చాలామంది ఇలాంటి ప్రొఫెషనర్ క్యూయర్స్ను ఉపయోగించుకుంటారు. తద్వారా వీళ్లకు కూడా పనికి పని.. ఆదాయానికి ఆదాయం. మన దేశంలో కూడా కరోనాకు ముందు అన్ ప్రొఫెసనల్ క్యూయర్ల హవా బాగానే సాగేది. మరి వైరస్ పూర్తిగా కనుమరుగై మళ్లీ దేశీ క్యూయర్లకు పని దొరుకుతుందా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: London, VIRAL NEWS