హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

PM Modi: ఆప్ఘన్‌‌లో నెలకొన్న పరిస్థితులపై భారత వైఖరిని తేల్చి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi: ఆప్ఘన్‌‌లో నెలకొన్న పరిస్థితులపై భారత వైఖరిని తేల్చి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

అజిత్‌ దోవల్‌తో పాటు ఇతర దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో ప్రధాని మోదీ

అజిత్‌ దోవల్‌తో పాటు ఇతర దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో ప్రధాని మోదీ

ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక అక్కడి తాజా పరిణామాలపై చర్చించేందుకు 8 ప్రాంతీయ దేశాలతో భారత్ ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఈ సమావేశంలో భాగమైన ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

ఇంకా చదవండి ...

న్యూఢిల్లీ: ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక అక్కడి తాజా పరిణామాలపై చర్చించేందుకు 8 ప్రాంతీయ దేశాలతో భారత్ ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఈ సమావేశంలో భాగమైన ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

ఆప్ఘన్‌లో తాలిబన్ల పాలన, ఉగ్రవాదం, ఉగ్ర కార్యకలాపాల వల్ల ఇతర దేశాలపై పడే ప్రభావం వంటి అంశాలపై భారత వైఖరిని ప్రధాని వారికి తెలియజేశారు. ఆఫ్ఘన్ సంక్షోభంపై భారత్ ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడాన్ని సమావేశంలో పాల్గొన్న జాతీయ భద్రతా సలహాదారులు ప్రశంసించారు. భారత్ పిలుపు మేరకు ఈ సమావేశంలో ఇరాన్, కజకిస్తాన్, కిర్జిజిస్తాన్, రష్యా, తజికిస్తాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్నారు.

ఆప్ఘన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై తమ దేశాల దృక్పథాన్ని, వైఖరిని వారు తెలియజేశారు. వీరిని కలిసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కరోనా ఉపద్రవం విసిరిన సవాళ్లను ఎదుర్కొని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆప్ఘన్‌ సంక్షోభ పరిస్థితి, తాలిబన్ల అస్తవ్యస్త పాలనపై ప్రధానంగా నాలుగు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని చెప్పారు. ఆప్ఘన్‌లో సామరస్యపూర్వక సంబంధాలతో కూడిన ప్రభుత్వం, ఆప్ఘన్ భూభాగాన్ని ఆక్రమించుకుని విర్రవీగుతున్న ఉగ్రవాద మూకల పట్ల కఠిన వైఖరి, ఆప్ఘన్ నుంచి డ్రగ్స్ మరియు ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వ్యూహం, రోజురోజుకూ ఆప్ఘనిస్తాన్‌లో పెరిగిపోతున్న సంక్షోభ పరిస్థితుల పరిష్కారానికి కృషి చేయడంపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Afghans Sell Children: ఆప్ఘనిస్తాన్‌లో దయనీయ పరిస్థితి.. కన్న కూతుర్లను అమ్ముకుంటున్న దుస్థితి..

మధ్య ఆసియా దేశాల ప్రగతిశీల సంస్కృతి, తీవ్రవాద ధోరణులను ధీటుగా ఎదుర్కొనేందుకు ఈ ప్రాంతీయ భద్రతా సదస్సు దోహదపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ.. ఈ సదస్సులో ఆప్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై ప్రధానంగా చర్చించామని చెప్పారు. ఆ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అక్కడి ప్రజలపై మాత్రమే కాకుండా సరిహద్దు దేశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని, అందువల్ల ఆప్ఘన్ విషయంలో అన్ని దేశాలు పరస్పరం చర్చించి సమన్వయంతో సహకరించుకుని ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. అందుకోసం భారత్ కృషి చేస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశానికి పాకిస్తాన్, చైనా దేశాలను కూడా ఆహ్వానించినప్పటికీ ఏవో సాకులు చెప్పి ఆ రెండు దేశాలు గైర్హాజరు కావడం గమనార్హం. ఆప్ఘన్‌లో తాలిబన్ల పాలనను పాకిస్తాన్ బహిరంగంగా స్వాగతించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక.. ఆప్ఘన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల విషయానికొస్తే.. ఇప్పటికీ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆఫ్ఘన్‌లో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికల కోసం తెరుచుకున్న పాఠశాలలు

తాలిబన్ల పాలనలో బతకలేమని భావిస్తున్న కొందరు ఆప్ఘన్ దేశస్తులు ఇప్పటికీ ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆప్ఘన్‌లో ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొందరు ఆప్ఘన్ దేశస్తులు అక్రమంగానైనా ఇతర దేశాల్లో తలదాచుకునేందుకు వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. ఆప్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల ప్రధాన సరిహద్దు ప్రాంతమైన జరాంజ్ నుంచి దేశం విడిచివెళ్లిపోతున్న వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. జరాంజ్‌లో తాలిబన్లు దేశం విడిచి వెళ్లిపోతున్న వారి ట్రక్కులను అనుమతించేందుకు ఒక్కో ట్రక్కుకు 10 నుంచి 11 డాలర్లు వసూలు చేస్తున్నారు. దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దేశం వదిలి వెళ్లిపోతున్న వారిని ఆపలేమని.. ఆప్ఘన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా ఉందని జరాంజ్‌లో ఓ తాలిబన్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ సమాజం తమ ప్రభుత్వాన్ని గుర్తించడం లేదని చెప్పాడు. తాలిబన్లు ఆప్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న సందర్భంలో కూడా ఆ దేశం నుంచి ఇతర దేశాలకు విమానాల్లో వేలాడుతూ మరీ ఆప్ఘన్ ప్రజలు ఎలా దేశాన్ని వదిలి వెళ్లారో అందరికీ తెలిసిందే.

First published:

Tags: Afghanistan, International news, National News, Pm modi, Taliban

ఉత్తమ కథలు