Wildlife Poaching: ఉపాధి లేక వన్యప్రాణుల వేట.. పేదరికంతో అల్లాడుతున్నారు..

దక్షిణాఫ్రికాలో దాదాపు 30 శాతం కంటే ఎక్కువ నిరుద్యోగ స్థాయి ఉండటం కూడా అక్రమ వేట పెరగటానికి కారణమవుతోంది.

news18-telugu
Updated: September 25, 2020, 10:52 AM IST
Wildlife Poaching: ఉపాధి లేక వన్యప్రాణుల వేట.. పేదరికంతో అల్లాడుతున్నారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు, పేదరికం ఎంతోమందిని నేరాల వైపు నడిపిస్తోంది. పేద దేశాల్లో చాలామంది పొట్టకూటి కోసం పరితపిస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని చాలామంది తమ కుటుంబ పోషణ కోసం వణ్యప్రాణుల అక్రమ వేటను వృత్తిగా ఎంచుకోవాల్సి వస్తుంది. వన్యప్రాణుల వేట, అక్రమ రవాణాకు పాల్పడిన చాలా మంది ప్రజలు పేదరికం, నిరుద్యోగం కారణంగానే ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని అంతర్జాతీయ వన్యప్రాణుల సంరక్షణ బృందం చేసిన అధ్యయనం తెలిపింది.

* కుటుంబ పోషణకోసమే

వణ్యప్రాణుల వేటకు సంబంధించి TRAFFIC అనే ఎన్జీవో పరిశోధన చేసింది. దక్షిణాఫ్రికా జైళ్లలో అక్రమ వేట కారణంగా అరెస్టయ్యి జైల్లో శిక్ష అనుభవిస్తున్న 73 మంది నేరస్థులతో ఈ సంస్థ మాట్లాడింది. వారిని ఇంటర్వ్యూ చేసిన తరువాతే కుటుంబ పరిస్థితులు, నిరుద్యోగం వంటివి వారిని నేరాలు చేసే దిశగా ప్రోత్సహిస్తుందని గురువారం వెల్లడించిన నివేదికలో పొందుపరిచారు. వారిలో దాదాపు 70 శాతం మంది కేవలం జీవనోపాధి కోసం నేరాలకు పాల్పడ్డారని తేల్చారు. "వివిధ కారణాల వల్ల నేరస్థులు అక్రమ వన్యప్రాణుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. చట్టబద్ధమైన ఆర్థిక ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో కుటుంబ పోషణకు వారు ఇలాంటి మార్గాలను ఎంచుకోక తప్పట్లేదు" అని TRAFFIC నివేదికలో తెలిపింది.

* ఒక్కొక్కరిదీ ఒక్కో కారణం
TRAFFIC సంస్థ అధ్యయనంతో అక్కడి పేదల దీనగాధలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో కారణంతో అక్రమ వేటను ఎంచుకోవాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. నా పిల్లలకు నాకన్నా మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వృత్తిలోకి వచ్చానని ఒక వ్యక్తి చెప్పాడు. తన కొడుకును పాఠశాలను పంపించి, వారికి చదువు నేర్పించాలనుకున్నానని మరో వ్యక్తి చెప్పాడు. చిన్నతనంలో తాను కోల్పోయిన అవకాశాన్ని తన కొడుకు కోల్పోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని అతడు పేర్కొన్నాడు. మాకు చేతి నిండా పని ఉంటే అసలు ఇలాంటి నేరాలకు ఎందుకు పాల్పడుతామని మరో వ్యక్తి ప్రశ్నించాడు.

* ఒకరిని చూసి మరొకరు
స్నేహితుల ప్రభావంతో ఈ మార్గంలోకి వచ్చామని కొంతమంది పట్టుబడిన వ్యక్తులు చెబుతున్నారు. "నా స్నేహితులు ముందు నుంచి అక్రమ వేటతో డబ్బు సంపాదించారు. వారు మంచి కార్లు కూడా కొనుక్కున్నారు. నేను కూడా వారిలాగే ఉండాలని కోరుకున్నాను. అందుకే వారితో పాటు వేటకు వెళ్లాను. కానీ ఇది చట్టవిరుద్ధమైన పని అని గ్రహించలేకపోయాను. నేను మోసపోయాను. నేను చేసిన పనికి చింతిస్తున్నాను..." అని ఒక్య వ్యక్తి తన ఆవేదనను వెలిబుచ్చాడు. వన్యప్రాణులను వేటాడటం, రవాణా చేయడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, వాటిని అమ్మడం వంటివి వీరు చేసిన నేరాలు. ఇలా పట్టుబడిన వారిలో దాదాపు డెబ్బై నాలుగు శాతం మంది ఖడ్గమృగం(రైనో) వేట, సంబంధిత నేరాలకు శిక్షలు అనుభవిస్తున్నారు. మిగిలినవారిలో అబలోన్(ఒక రకం నత్త), సైకాడ్(విలువైన మొక్కలు) అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నారు.

* అడ్డుకోలేకపోతున్న ప్రభుత్వాలు
గత పదేళ్లలో దాదాపు 8,200 రైనోలను వేటగాళ్లు చంపారని ట్రాఫిక్ సంస్థ చెబుతోంది. వేటగాళ్లను పట్టుకునేందుకు, రైనోలు వేట బారిన పడకుండా కాపాడేందుకు దక్షిణాఫ్రికా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయినా నేరగాళ్ల ఆగడాలు మాత్రం తగ్గట్లేదు. ఆసియాలో ఖడ్గమృగాల కొమ్ములకు డిమాండ్ ఉండటంతో చాలామంది వాటిని వేటాడుతున్నారు. దక్షిణాఫ్రికాలో దాదాపు 30 శాతం కంటే ఎక్కువ నిరుద్యోగ స్థాయి ఉండటం కూడా అక్రమ వేట పెరగటానికి కారణమవుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 25, 2020, 10:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading