PM MODI JAPAN FOR QUAD SUMMIT UPDATES JAPANESE KIDS INTERACT PM MODI IN INDIAN LANGUAGES INCL TELUGU VIRAL VIDEO MKS
Viral Video: టోక్యోలో PM Modiకి బిగ్ సర్‌ప్రైజ్.. తెలుగు, హిందీలో జపనీస్ పిల్లల గోలగోల..
టోక్యోలో పిల్లలతో ప్రధాని మోదీ
క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం టోక్యోలో అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ఘన స్వాగతం లభించింది. జపనీస్ బాలలు, ప్రవాస భారతీయులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తెలుగు సహా వివిధ భాషల్లో వెల్కమ్ చెప్పారు. వివరాలివే..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ గడ్డపై అరుదైన ఘన స్వాగతం లభించింది. (PM Modi Japan Visit) నాలుగు దేశాల (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు సోమవారం టోక్యోలో అడుగుపెట్టిన ఆయనకు జపనీస్ బాలలు, ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. టోక్యో సిటీలో మోదీ బసచేసిన న్యూఒటానీ హోటల్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. జపనీస్ బాలలు, ప్రవాసుల పిల్లలు తెలుగు సహా భారతీయ భాషల్లో మోదీకి స్వాగతం పలికారు. కొందరు పిల్లలైతే ఏకంగా హిందీలోనే మోదీతో సంభాషించారు. ఈ దృశ్యాల తాలూకు వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ చైనాను నిలువరించడంతోపాటు రక్షణ, వ్యాపార, దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ‘క్వాడ్ కూటమి’గా ఏర్పడిన దరిమిలా కూటమి ఈ ఏడాది సదస్సు నిమిత్తం భారత ప్రధాని జపాన్ లో పర్యటిస్తున్నారు. టోక్యో ఎయిర్ పోర్టులో అధికారిక, సైనిక స్వాగతం తర్వాత మోదీ హోటల్ వద్దకు చేరగా, అక్కడ భారీ సంఖ్యలో గుమ్మికూడిన ప్రవాసభారతీయులు.. మోదీ.. మోదీ.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
హర్ హర్ మోదీ.. వందేమాతరం.. భారత్ మాతా కీ జై.. నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రధాని రాక సందర్భంగా చిన్నారులు సైతం చేతులు ఊపుతూ పాల్గొన్నారు. జపనీస్ పిల్లలు తెలుగు, హిందీ, ఇతర భారతీయ భాషలు, వివిధ భాషల్లో స్వాగతం అని రాసిన ప్లకార్డులను పట్టుకుని మోదీకి స్వాగతం పలికారు. హిందీలో మాట్లాడిన జపనీస్ పిల్లలతో సంభాషిస్తూ, వారికి ఆటోగ్రాఫులిస్తూ, తలపై చేయి ఉంచి ఆశీర్వదిస్తూ మోదీ సందడిగా గడిపారు. ‘వారేవా.. నువ్వు హిందీ ఎక్కడ నేర్చుకున్నావ్.. బాగా తెలుసా..’ అంటూ భారత సంతతి జపనీస్ పిల్లలతో మోదీ సంభాషించారు.
#WATCH | "Waah! Where did you learn Hindi from?... You know it pretty well?," PM Modi to Japanese kids who were awaiting his autograph with Indian kids on his arrival at a hotel in Tokyo, Japan pic.twitter.com/xbNRlSUjik
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు (మే 24న జరిగే) క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో చేరుకున్నారు. టోక్యోలో దిగిన తర్వాత ‘‘టోక్యోలో ల్యాండ్ అయ్యాను. ఈ పర్యటనలో క్వాడ్ సమ్మిట్, తోటి క్వాడ్ నేతలను కలవడం, జపాన్ వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సంభాషించడం వంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.
#WATCH | Amid chants, Prime Minister Narendra Modi receives a warm welcome from the Indian diaspora in Tokyo, Japan
He will be participating in Quad Leaders’ Summit as part of his 2-day tour starting today, May 23. pic.twitter.com/Owqx1GXksm
జపాన్ పత్రికల్లో సైతం మోదీ వ్యాసాలు రాశారు. భారత్, జపాన్ చారిత్రక బంధాన్ని గుర్తుచేస్తూ, రాబోయే రోజుల్లో మరింత దగ్గరవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సోమవారం నాడు ఎన్ఈసీ కార్పొరేషన్ చైర్మన్ నోబుహిరో ఎండో, సీఈవో తదాషి యానై, సుజుకి మోటార్ కార్పొరేషన్ సలహాదారు ఒసాము సుజుకీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్‌లో బోర్డు డైరెక్టర్ మసయోషి సన్‌లతో సమావేశం కానున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.