హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

US Elections 2020: జో బైడెన్, కమలా హారిస్‌లకు ప్రధాని మోదీ అభినందనలు..

US Elections 2020: జో బైడెన్, కమలా హారిస్‌లకు ప్రధాని మోదీ అభినందనలు..

మోదీ, బైడెన్‌(ఫైల్ ఫొటో)

మోదీ, బైడెన్‌(ఫైల్ ఫొటో)

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ కూడా బైడెన్, కమలా హారిస్‌కు అభినందనలు తెలిపారు. తొలుత బైడెన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మోదీ ఓ ట్వీట్ చేశారు. "అద్భుతమైన విజయం సాధించిన జో బైడెన్‌కు అభినందనలు. గతంలో మీరు ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా కీలకమైనది. మరోసారి మీతో కలసి పనిచేసేందుకు, భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాను"అని పేర్కొన్నారు.

  ఇక, మరో ట్వీట్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ఆసియన్-అమెరికన్ కమలా హారిస్‌కు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. "కమలా హారిస్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ విజయం మార్గదర్శకం. ఇది మీ కుటుంబానికే కాదు.. భారతీయ అమెరికన్ల అందరికీ ఎంతో గర్వకారణం. మీ సహకారం, నాయకత్వంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలంగా ఉంటాయని నమ్ముతున్నాను" అని మోదీ ట్వీట్ చేశారు.

  జో బైడెన్, కమలా హారిస్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. "యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. జో బైడెన్ పదవీకాలన్ని విజయవంతంగా పూర్తి చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని"అని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

  ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ ఎలక్ట్రోరల్ స్థానాలు సొంతం చేసుకున్న జో బైడెన్ అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా పీఠాన్ని అధిరోహించనున్నాడు. ఇక, భారత సంతతి కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Donald trump, Joe Biden, Kamala Harris, US Elections 2020

  ఉత్తమ కథలు