ఏదో పని మీద బయటికి వెళతాం.. సడెన్ గా బైక్ టైరు పంచరైతే ఏం చేస్తాం? దేవుడాంటూ మెకానిక్ దగ్గరికి బండిని తోసుకుంటూ వెళతాం లేదా పంచర్ సర్వీసుకు ఫోన్ చేస్తాం. అదే పబ్లిక్ ట్రాన్స్ పోర్టయిన బస్సులో ప్రయాణించేటప్పుడు జరిగితే? డ్రైవర్ గారి వినతి మేరకు బస్సును రోడ్డు మీద నుంచి కాస్త పక్కకు నెట్టడంలో సాయపడతాం. మరి ఇదే సీన్ లో విమానాన్ని ఊహించగలమా? విమానం టైరు పంచరై, రన్ వే మీద నిలిచిపోతే.. ప్రయాణికులంతా కలిసి దాన్ని పక్కకు నెట్టుకుంటూ వెళ్ళిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. భారత్ పొరుగు దేశం నేపాల్ లోనే జరిగిందీ ఘటన. స్థానిక మీడియా కథనం ప్రకారం..
నేపాల్ లోని కోల్టీ జిల్లాలోగల బజురా విమానాశ్రయంలో ఇలా తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బంది కలిసి తోసుకెళుతోన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. తారా ఎయిర్ లైన్స్ కు చెందిన చిన్న శ్రేణి విమానంలో మొత్తం 30దాకా ప్రయాణించే వీలుంది. బజురా విమానాశ్రయంలో అది ల్యాండ్ కావడానికి ముందు విమానం వెనుక టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఇది గుర్తించిన పైలట్.. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
పైలట్ ఎంతో చాకచక్యంగా పేలిన టైరుతోనే విమానాన్ని రన్ వేపైనే ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశాడు. అయితే, ఆ చిన్న విమానాశ్రయంలో ఉన్నది ఒకటే రన్ వే కావడంతో మిగతా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానం ఎమర్జెన్సీగా ల్యాండైన వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది అక్కడికి చేరుకుని.. ప్రయాణికులను కిందికి దించేశారు. ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే..
Fact:Nepal's Tara Airlines plane made safe landing at Bajura airport. As it was taxing from runway, suddenly there was a sound of tire burst and stopped. Another plane was waiting for landing, but couldn't as runway was blocked by this plane. Finally, people pushed it to taxiway. pic.twitter.com/Z3XUDzHoYb
— Salma Akthar (@SalmaAkthar5) December 3, 2021
విమానం రన్ వేకు అడ్డంగా నిలిచిపోయిన ఆ పరిస్థితిలో క్రేన్లు రావడానికి సమయం పట్టడంతో సిబ్బంది రిక్వెస్ట్ మేరకు విమానంలో ప్రయాణించిన వారే దాన్ని పక్కకు నెట్టడంలో సాయపడ్డారు. ప్రయాణికులు, విమానం, ఎయిర్ పోర్టు సిబ్బంది.. విమానాన్ని రన్ వే పైనుంచి పక్కకు నెట్టుకెళుతోన్న దశ్యాలను అక్కడున్న వారిలో కొందరు చిత్రీకరించారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో వైరలైంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు నేపాల్ విమానయాన శాఖ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, Nepal, Viral Video