Pak-Afghan: అక్కడ భారత్ నిర్మించిన కట్టడాలపై దాడులు చేయండి.. తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు..!

file Photo

Pakistan-Afghanistan: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో గ‌త 20 ఏళ్లుగా భార‌త్ నిర్మించిన భ‌వ‌నాలు, మౌలిక వ‌స‌తులే ల‌క్ష్యంగా దాడి చేయండంటూ అక్క‌డి తాలిబ‌న్లు, పాకిస్థాన్ ఫైట‌ర్ల‌కు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సూచించింది. పూర్తి వివరాలు ఇలా..

 • Share this:
  ఆఫ్ఘ‌నిస్థాన్‌లో భరతదేశం నిర్మించిన కట్టడాలను, భవనాలను టార్గెట్ చేయాలని ఇదే మీ లక్ష్యం కావాలని పాకిస్తాన్ ఐఎస్ఐ తాలిబన్లకు సూచిస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘ‌నిస్థాన్‌లో పలు ప్రాంతాలను తాలిబన్సు ఆక్రమించారు. గ‌త 20 ఏళ్లుగా భార‌త్ నిర్మించిన భ‌వ‌నాలు, మౌలిక వ‌స‌తులే ల‌క్ష్యంగా దాడి చేయండంటూ పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ తాలిబన్లకు సూచించింది. ఆప్ఘ‌నిస్థాన్‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న తాలిబ‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇప్ప‌టికే చాలా మంది పాకిస్థాన్ ఫైట‌ర్లు వాళ్ల‌తో చేతులు క‌లిపారు. వాళ్లంద‌రికీ ఇప్పుడు భార‌త ఆస్తులే ల‌క్ష్యంగా దాడులు చేయాల‌న్న ఆదేశాలు అందాయి అని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. తాలిబ‌న్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని భార‌త ఆస్తులే ల‌క్ష్యంగా దాడులు జ‌ర‌గ‌బోతున్న‌ట్లు ఆ వ‌ర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘ‌నిస్థాన్‌లోకి సుమారు 10 వేల మంది ఫైట‌ర్లు చొర‌బ‌డిన‌ట్లు స‌మాచారం. వీళ్ల‌లో కొంతమంది ఎప్ప‌టి నుంచో ఆఫ్ఘ‌నిస్థాన్‌లోనే ఉంటూ.. అమెరికా ద‌ళాల‌కు వ్య‌తిరేకంగా పోరాడారు. గత రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘన్ అభివృద్ధికి భారత ప్రభుత్వంచాలా సాయపడింది.

  సుమారు 3 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. ఆ దేశంలోని డెలారమ్-జరాంజ్ సల్మా డ్యాం మధ్య 218 కి.మీ. పొడవునా రోడ్డు నిర్మాణానికి సహాయపడింది. అంతే కాకుండా ఇండియాఆఫ్ఘ‌నిస్థాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ (సల్మా డ్యామ్‌) ను నిర్మించింది. 2001లో ఆఫ్ఘ‌నిస్థాన్‌పై తాలిబ‌న్లు ప‌ట్టు కోల్పోయిన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ ఆ దేశంలో 300 కోట్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసింది. ఆఫ్ఘన్ పార్లమెంటు భవన నిర్మాణానికి చేయూతనిచ్చింది. 2015 లో ఈ భవనాన్ని ప్రారంభించారు. ఇక ఆఫ్ఘన్ లో విద్యా రంగానికి సైతం నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఇండియాలో ఆఫ్ఘన్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు లభిస్తున్నాయి. ఇదంతా చూసి పాకిస్థాన్ లోలోన మండిపడుతోంది. సమయం కోసం వేచి చూస్తూ..ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు సపోర్ట్ ప్రకటించడం ద్వారా ఇండియాపై తమ కసి తీర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే 10 వేలమందికిపైగా పాకిస్థాన్ సైనికులు ఆఫ్ఘన్ లోని వార్ జోన్ లోకి ప్రవేశించారట.

  ఆఫ్ఘన్ లో భారతీయ చిహ్నాలు ఏవి ఉన్నా వాటిని నిర్మూలించాలని తాలిబన్లకు పాక్ ఐఎస్ఐ సూచించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాబూల్ లోని భారతీయ వర్కర్ల ను ఖాళీ చేయించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇప్పటికే కాబూల్ లోని భారత ఎంబసీలో పని చేస్తున్న అధికారులను కూడా అక్కడి నుంచి వెనక్కి రప్పించాలా అని యోచిస్తున్నట్టు సమాచారం. తాలిబ‌న్లు తిరిగి రావ‌డంతో ఆ దేశంలో ఇండియా ఉనికి కొన‌సాగుతుందా లేదా అన్న‌ది ప్ర‌శ్నార్థకంగా మారింది. దీనిపై తాలిబ‌న్ల నుంచి ఎలాంటి హామీ ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త ప్ర‌భుత్వానికి రాలేదు. ఇప్ప‌టికే అక్క‌డ ప‌ని చేస్తున్న భార‌త వ‌ర్క‌ర్ల‌ను దేశం వ‌దిలి వచ్చేయాల్సిందిగా భార‌త ప్ర‌భుత్వం సూచించింది. కాబూల్ నగరానికి మంచినీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన షాటూట్ డ్యాం నిర్మాణంలో పని చేస్తున్న వందలాది భారతీయ కార్మికులను వెనక్కి రప్పించే ప్రయత్నం భారత్ చేస్తోంది.
  Published by:Veera Babu
  First published: