హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan Supreme Court: పెషావర్ ఆర్మీ స్కూల్ నరమేధంపై పాక్ ప్రధానిని కడిగిపారేసిన న్యాయస్థానం..

Pakistan Supreme Court: పెషావర్ ఆర్మీ స్కూల్ నరమేధంపై పాక్ ప్రధానిని కడిగిపారేసిన న్యాయస్థానం..

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫొటో)

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫొటో)

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 2014లో ఆర్మీ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 150 మంది చిన్నారులను బలి తీసుకున్న ఘటనకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా పాక్ ప్రధానికి అక్కడి సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది.

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 2014లో ఆర్మీ సైనిక పాఠశాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 150 మంది చిన్నారులను బలి తీసుకున్న ఘటనకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా పాక్ ప్రధానికి అక్కడి సుప్రీం కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు అందుకున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ బుధవారం నాడు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. పాక్ సుప్రీం కోర్టు ప్రధాని ఇమ్రాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.

ఈ మారణహోమానికి పాల్పడినట్లు భావిస్తున్న పాక్ తాలిబన్ సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్(TTP)తో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఆప్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల సాయంతో టీటీపీ తాలిబన్ సంస్థతో సంప్రదింపులు జరపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ చర్చలపై సుప్రీం కోర్టు ఇమ్రాన్‌ను నిలదీసింది. 150 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాద సంస్థతో సంప్రదింపులు ఎందుకు జరిపారని పాక్ ప్రధానిని సుప్రీం కోర్టు సూటిగా ప్రశ్నించింది. పాక్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆర్మీ స్కూల్ విద్యార్థులపై నర మేధం కేసులో ప్రధాని ఇమ్రాన్‌కు బుధవారం ఉదయం 10 గంటలకు సమన్లు జారీ చేసింది. తనకు సమన్లు జారీ చేసిన విషయం తెలుసుకున్న ఇమ్రాన్ ఈ విషయం తెలిసిన రెండు గంటలకే 12 గంటల సమయంలో సుప్రీం కోర్టులో హాజరయ్యారు.

ఈ సందర్భంగా.. ఆ ఘటనలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇందుకు ప్రధాని ఇమ్రాన్ స్పందిస్తూ.. ఆర్మీ స్కూల్ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారుల బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ఇప్పటికే అందించామని.. ఆ ఘటన తర్వాత నేషనల్ యాక్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చామని సుప్రీంకు బదులిచ్చారు. అయితే.. కోర్టు ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ నర మేధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి పరిహారం కోరుకోవడం లేదని, ఆ ఘటన జరిగిన రోజు జాతీయ భద్రత వ్యవస్థ ఎక్కడుందని తల్లిదండ్రులు నిలదీస్తున్నారని సుప్రీం చెప్పింది. ఆ తల్లిదండ్రుల వాదనను ప్రభుత్వం వినాలని, ఆ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీం ప్రధాని ఇమ్రాన్‌ను ఆదేశించింది. అక్టోబర్ 20న అపెక్స్ కోర్టు ఇచ్చిన తీర్పును అమలయ్యేలా ప్రధాని చొరవ తీసుకోవాలని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Afghans Sell Children: ఆప్ఘనిస్తాన్‌లో దయనీయ పరిస్థితి.. కన్న కూతుర్లను అమ్ముకుంటున్న దుస్థితి..

ఆర్మీ స్కూల్ ఘటనలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులను తాను ఇప్పటికే కలిశానని, మరోసారి కలుస్తానని ప్రధాని చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ అత్యున్నత న్యాయస్థానానికే కొన్ని సూచనలు చేసేందుకు సాహసించడం గమనార్హం. పాకిస్థాన్‌లో 80 వేల మంది ఎందుకు మరణించారో ధర్మాసనం తెలుసుకోవాలని, పాక్‌లో జరిగిన 480 డ్రోన్ అటాక్స్‌కు కారణం ఎవరో కూడా తెలుసుకోవాలని కోర్టుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. అయితే.. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. ఈ విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మీదని, మీరు దేశానికి ప్రధాని మంత్రి అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్నలకు ఒక ప్రధానిగా సమాధానాలు మీరు చెప్పాలని సుప్రీం వ్యాఖ్యానించింది. ఇదిలా ఉండగా.. పెషావర్ ఆర్మీ స్కూల్ ఘటనపై హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకు తెలిపారు. ఇందుకు చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. ఈ ఘటన జరిగి ఏడేళ్లు గడిచిపోయిందని ప్రధానికి గుర్తుచేశారు. ‘మిస్టర్ ప్రైం మినిస్టర్.. మనది చిన్న దేశం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశాల్లో ఆరో స్థానంలో ఉన్నాం’ అని త్రిసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అమిన్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఆప్ఘన్‌‌లో నెలకొన్న పరిస్థితులపై భారత వైఖరిని తేల్చి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ

ఇదిలా ఉండగా.. ఆర్మీ స్కూల్‌లో ఇంతటి ఘోరం జరగడానికి భద్రతా లోపమే కారణమని, అందుకు బాధ్యులను చేస్తూ మిలటరీ అధికారులపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై కోర్టు ప్రశ్నించగా.. మిలటరీ ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేమని అటార్నీ జనరల్ బదులిచ్చారు. అయితే.. దేశ భద్రతను కాపాడేందుకు ఏర్పాటు చేసుకున్న నిఘా సంస్థల పనితీరుపై సుప్రీం చీఫ్ జస్టిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత జరిగితే దేశ పౌరులను కాపాడుకోవాల్సిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎక్కడకు పోయాయని కోర్టు ప్రశ్నించింది. మాజీ ఆర్మీ చీఫ్, ఇతరులపై కేసు నమోదు చేశారా అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ఇందుకు అటార్నీ జనరల్ బదులిస్తూ.. మాజీ ఆర్మీ చీఫ్, మాజీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌ తప్పున్నట్లు ఎంక్వైరీ రిపోర్ట్‌లో ఏం లేదని చెప్పారు. చీఫ్ జస్టిస్ ఈ వివరణపై స్పందిస్తూ.. ‘దేశంలో ఎంతో పెద్ద ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంది. కొన్ని బిలియన్ల రూపాయలు దానిపై ఖర్చు చేస్తున్నాం. అంతేకాకుండా.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా మనం చెప్పుకుంటాం. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం ఎంతో ఖర్చు చేసినా ఫలితం మాత్రం శూన్యం’ అని పాక్ సుప్రీం చీఫ్ జస్టిస్ అక్కడి ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

First published:

Tags: Imran khan, International news, Pakistan, Supreme Court

ఉత్తమ కథలు