news18-telugu
Updated: January 13, 2021, 3:58 PM IST
ఆందోళన చేస్తున్న రైతులు (Image: PTI)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఊపందుకుంటోంది. ఇందుకు ఇప్పటికే చాలా మంది మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ కు చెందిన సినీ, సంగీత ప్రముఖులు, బాలీవుడ్ స్టార్లు రైతుల ఆందోళనకు తమ మద్దతు ఇస్తున్నారు. ప్రియాంక చోప్రా జోనాస్ తో సహా ఎంతో మంది ప్రముుఖులు రైతుల నిరసనలు వినాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవలే స్వర భాస్కర కూడా ఈ ఆందోళనలో హాజరయ్యారు. తాజాగా పాకిస్థాన్ సంగీత కళాకారుడు జావాద్ అహ్మద్ ప్రపంచంలోని రైతుల కోసం ఓ పాటను రూపొందించారు. 2020 డిసెంబరులో విడుదలైన కిసానా అనే ఈ పాటును యూట్యూబ్ లో వేలసార్లు వీక్షణలు అందుకున్నాయి. పాటపై పలువురు రియాక్షన్ వీడియోలు కూడా విడుదలయ్యాయి.
ఈ పాటపై స్పందించిన జావాద్ ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉద్యమం ఎంతో అవసరమని ఆయన అన్నారు. పాకిస్థాన్ లో రైతుల పరిస్థితి కూడా దయనీయంగా కూడా ఉందని జావాద్ పంచుకున్నారు. భారత్ లో జరుగుతున్న రైతుల ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని, వారి ఆందోళన చూసిన తర్వాతే వీడియోను రూపొందించానని జావాద్ తెలిపారు. ఈ పాట సాహిత్యం పరిశీలిస్తే "ఉట్ ఉఠానా కిసానా హున్ తు జీనా ఆ పోలియా తు జాగ్ దా అన్నదాత తేరీ సోనీ తార్తీ మాతా తూ జగ్ దా తు జగ్ దా పలాన్ హున్ తు జీనా ఆయే" అంటూ సాగుతుంది. అంటే కర్షకులు వృద్ధిలోకి రావాలని వారు ప్రపంచానికి అన్నదాతలని అర్థం.
తన యూట్యూబ్ ఛానెల్లో వీడియోను షేర్ చేసిన జావాద్.. ఇది రైతుల కోసం విప్లవాత్మక పాట అని తద్వారా వారు తమ హక్కుల కోసం పోరాడటానికి ప్రేరేపించబడతారని తెలిపారు. అంతేకాకుండా ఈ పాటను ప్రపంచ రైతు ఉద్యమానికి అంకితం చేశారు.
సరిహద్దులతో సంబంధం లేకుండా ఎంతో భావోద్వేగంగా ఉన్న ఈ పాట ఎంతో నచ్చిందని, భారతదేశానికి చెందినవాడినైనా పాకిస్థాన్ ను ప్రేమిస్తున్నానని సందీప్ సింగ్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యకు మద్దతిస్తూ మరో పాకిస్థాన్ యూజర్ "ఓ సిక్కు సోదరుడు పాకిస్థాన్ కు జిందాబాద్ కొట్టారు" అని కామెంట్ చేశాడు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 13, 2021, 3:57 PM IST