పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. హిందుస్థాన్ పేరును ప్రస్తావిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. భారత్‌లో తనకు ఎంతో గౌరవం వచ్చిందని అన్నారు. భారత్‌ను (India) నిస్వార్థ దేశంగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. ఇండియా స్వతంత్ర విదేశాంగ విధానం ఎంతో గొప్పదని.. భారత్‌పై కుట్ర చేయడానికి ఎవరూ సాహసించరని అన్నారు. ప్రపంచంలో భారతదేశానికి ఎంతో గౌరవం ఉందని కొనియాడారు. కానీ పాకిస్థాన్ (Pakistan) ఒక బానిస దేశమని కామెంట్ చేశారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి తాను ఇచ్చిన సలహా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్(Imran Khan) శుక్రవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కోర్టు నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో విదేశీ కుట్ర అంశాన్ని కోర్టు ఎందుకు చూడలేదో అని అన్నారు. కోర్టు సాక్ష్యాధారాలను చూసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
దేశంలో ఎంపీల గుర్రపు వ్యాపారం బహిరంగంగా జరుగుతోందని.. సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి ఉండాల్సిందని అన్నారు. విపక్షాల నేతలు అమ్ముడుపోయారని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఆరోపించారు. నాలుగు నెలల క్రితమే అమెరికా కుట్రలు ప్రారంభించిందని... అమెరికా పాకిస్థాన్ రాయబారిని బెదిరించిందని అన్నారు. తనను తొలగించాలని అమెరికా కోరిందని అన్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి మొత్తం ప్లాన్ జరిగిందని.. డబ్బుతో బయటి నుంచి నియంత్రించలేకపోవడం తన అప్పు అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
కానీ తాను ఎవరి కీలుబొమ్మను కాలేనని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తనకు విదేశీ బ్యాంకుల్లో దోచుకున్న డబ్బు లేదని అన్నారు. ప్రతిపక్షం డబ్బు కోసం దేశాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని విమర్శించారు. తాను ప్రజల్లోనే ఉన్నానని.. ఉంటానని.. కాబట్టి ఎన్నికలు నిర్వహించి నిర్ణయం తీసుకోండని విపక్షాలకు సవాల్ విసిరారు. వీధుల్లోకి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇమ్రాన్ ఖాన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. పాకిస్తాన్ ప్రజలు స్వేచ్ఛా దేశంగా నిలబడాలని... బానిసత్వాన్ని అంగీకరించవద్దని అన్నారు.
ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించేందుకు 342 మంది సభ్యుల సభలో 172 మంది సభ్యుల మద్దతు కావాలి. ఇప్పటికే అవసరమైన దానికంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతును చూపించారు. ప్రతి వేదిక వద్ద కొత్త ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని ఖాన్ పార్టీ నిర్ణయించిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారం నుంచి తొలగించబడిన తొలి ప్రధానిగా ఖాన్ ఇప్పుడు నిలిచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. రేపు ఉదయం 10 గంటలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ని కోర్టు ఆదేశించింది. అవిశ్వాస తీర్మానం పెడితే కొత్త ప్రధానిని ఎన్నుకోవాలని ఆదేశించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.