పాకిస్థాన్ రాజకీయాలను సెక్స్ కుంభకోణం కుదిపేస్తోంది. అమెరికా బ్లాగర్ సింథియా డి రిచీ పేరు చెబితేనే ఆ దేశంలోని అగ్ర రాజకీయ నేతలు గజగజ వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలో ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ దేశ మాజీ అంతర్గత శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ 2011లో ఆయన కార్యాలయంలో మత్తుమందు కలిపిన పానీయాన్ని తనకు ఇచ్చి రేప్ చేసినట్లు ఆమె సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, నాటి ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్దుం షాబుద్దీన్లు కూడా అధ్యక్ష భవనంలో తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని వెల్లడించింది. బిలావల్ భుట్టో వ్యక్తిగత జీవిత రహస్యాలను కూడా ఆమె బయటపెట్టింది.
ఇదిలా ఉండగా ధివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోపై కూడా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెనజీర్ భుట్టో తన భర్త ఆసీఫ్ జర్దారీతో సంబంధాలు పెట్టుకున్న మహిళలపై సెక్యూరిటీ గార్డులతో అత్యాచారాలు చేయించేదంటూ ఆమె చేసిన ఓ ట్వీట్...కలకలం రేపింది. అలా అత్యాచార సంస్కృతికి బెనజీర్ భుట్టో ఆజ్యం పోసారంటూ ఆమె ఆరోపించారు.

సింథియా డి రిచీ, అమెరికా బ్లాగర్
సోషల్ మీడియా ద్వారా బెనజీర్ భుట్టో ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన సింథియా డి రిచీపై కేసు నమోదుచేయాలంటూ ఓ వ్యక్తి ఇస్లామాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే దీనికి సంబంధించి ఆమెపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. ఇది సైబర్ క్రైమ్ పరిధిలోకి వస్తుందని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) మాత్రమే దీనిపై చర్యలు తీసుకోగలదని పేర్కొంది. బెనజీర్ భుట్టో ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన సింథియాపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఇస్లామాబాద్ అధ్యక్షుడు షకీల్ అబ్బాసి ఇప్పటికే ఎఫ్ఐఏను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.
తమ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసినందుకు మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, మాజీ మంత్రి రెహమాన్ మాలిక్ ఇప్పటికే ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీకి మేలు చేసేలా తమ పార్టీ అగ్రనేతలపై సింథియా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆమెపై విరుచుకపడుతున్నారు.