Pulwama Attack: పుల్వామా మా ఘనతే, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన పాక్ మంత్రి

‘పుల్వామాలో విజయం మనందరిది. మీది. మాది. మన అందరిదీ. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానిది. మీరు, మేము కూడా ఆ విజయంలో భాగస్తులమే.’ అని ఫవాద్ చౌదరి అన్నారు.

news18-telugu
Updated: October 29, 2020, 10:30 PM IST
Pulwama Attack: పుల్వామా మా ఘనతే, పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన పాక్ మంత్రి
ఫవాద్ చౌదురి, పాకిస్తాన్ మంత్రి
  • Share this:
2019 ఫిబ్రవరిలో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన ఉగ్రవాద దాడి తమ విజయంగా ప్రకటించారు పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి. సాక్షాత్తూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందనే బహిరంగ సత్యాన్ని ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించింది పాకిస్తాన్. పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ఫవాద్ చౌదరి మాట్లాడుతూ ‘హమ్ నే హిందుస్తాన్‌కో గుస్ కే మారా. ( మనం భారత్‌లోకి చొరబడి దాడి చేశాం.) పుల్వామాలో విజయం మనందరిది. మీది. మాది. మన అందరిదీ. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానిది. మీరు, మేము కూడా ఆ విజయంలో భాగస్తులమే.’ అని ఫవాద్ చౌదరి అన్నారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారానికి తెరలేపాయి. పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మాట మార్చారు. ‘పుల్వామా ఘటన తర్వాత మనం భారత్ భూభాగంలోకి చొరబడి దాడి చేశాం.’ అని చెప్పడం తన ఉద్దేశమని తెలిపారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోదని, అమాయకులను చంపబోదని చెప్పారు.

ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలైన బాలాకోట్ సహా మరికొన్ని చోట్ల ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జెట్లు భారత భూభాగంలోకి చొరబడడానికి ప్రయత్నించగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థంగా తిప్పికొట్టి, పాక్ జెట్‌ను కూల్చేసింది. ఆ సమయంలో భారత ఎయిర్ ఫోర్స్‌కు చెందిన పైలెట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ జెట్ పాక్ ఆక్రమిత ప్రాంతంలో కుప్పకూలింది. అభినందన్ వర్థమాన్‌ను వదిలిపెట్టకపోతే భారత్ తమ మీద దాడి చేస్తుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించిన సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ కాళ్లు వణికిపోయాయంటూ ప్రతిపక్ష ఎంపీ అయాజ్ సాదిక్ వ్యాఖ్యానించారు.

‘నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు షా మొహమ్మద్ ఖురేషీ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమావేశానికి రావడానికి ఇష్టపడలేదు. ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా సమావేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన కాళ్లు వణుకుతున్నాయి. దేవుడి మీద భారం వేసి అభినందన్ వర్థమాన్‌ని వదిలిపెట్టండి. లేకపోతే రాత్రి 9 గంటలకు పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తుంది.’ అని ఖురేషీ చెప్పినట్టు సాదిక్ తెలిపారు. అభినందన్ వర్థమాన్ విషయంతో పాటు మిగిలిన చాలా విషయాల్లో ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయని, అయితే, అంతకు మించి మాత్రం తాము ఏమీ చేయలేదని సాదిక్ చెప్పినట్టు దునియా న్యూస్ వెబ్ సైట్ పేర్కొంది.

అయాజ్ సాదిక్ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో పెద్ద దుమారం రేపాయి. ఈ క్రమంలో పాక్ మంత్రి దానిపై వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చే సమయంలోనే పుల్వామా ఉగ్రదాడి తమ విజయంగా పేర్కొన్నారు. ఆ తర్వాత తన ఉద్దేశం అది కాదని చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 29, 2020, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading