అమెరికా భద్రతా దళాలు అఫ్గానిస్థాన్ (Afghanistan)ను వీడిన తరువాత, ఆ దేశాన్ని ఉగ్ర సంస్థలకు స్థావరంగా మార్చబోమని తాలిబన్లు హామీ ఇచ్చారు. అమెరికాతో చర్చల్లో ఈ అంశమే ప్రధాన ఎజెండాగా ఉంది. ఈ హామీ లభించిన తరువాతే, అఫ్గాన్‌లో తమ లక్ష్యాలు నెరవేరాయని అమెరికా ప్రపంచానికి తెలిపింది. అయితే తాలిబన్లకు ముందు నుంచి అండగా ఉంటోన్న పాకిస్థాన్ మాత్రం భారత్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందుకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ప్రత్యేకంగా హిజ్బ్-ఇ-విలాయత్ (Hizb-e-Wilayat) పేరుతో అఫ్గాన్‌లో ఒక ఉగ్ర సంస్థను స్థాపించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అఫ్గాన్‌లో మూడు బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలనే లక్ష్యంతో తాలిబన్‌లకు సహాయం చేయడానికి ఈ బృందాన్ని దాయాది దేశం ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాలిబన్ల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో భారతీయ ఆస్తులే మొదటి లక్ష్యంగా ఉండాలని ఈ సంస్థకు ఐఎస్‌ఐ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అఫ్గాన్ పరిణామాలతో దేశంలో హింసకు బాటలు పడే అవకాశం ఉందని భారత్ భావిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన హిజ్-ఇ-విలాయత్ ఉగ్రవాద సంస్థ భారత్‌కు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రసంస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
* హిజ్బ్-ఇ-విలాయత్ సభ్యులు ఎవరు?
ఈ కొత్త టెర్రర్ గ్రూప్‌కు డాక్టర్ అన్వర్ ఫిర్దౌసీ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ బృందంలో 10,000 మందికి పైగా పాకిస్థాన్ ఫైటర్స్ ఉన్నారని, ఇప్పటికే వారు సరిహద్దుల ద్వారా అఫ్గాన్‌లోకి ప్రవేశించారని నిఘా వర్గాలు తెలిపాయి. వీరితో పాటు అఫ్గాన్‌లో భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం కోసం లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన ఫైటర్లను కూడా ఐఎస్‌ఐ అఫ్గాన్‌కు పంపిందట.
Afghanistan: తాలిబన్లకు షాక్.. పంజ్‌షిర్ లోయలో భారీ ఉద్యమం
* తాలిబన్లు, ISI మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి?
తాలిబన్లకు ఐఎస్ఐ సహాయం చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పాక్ సహాయం లేకుండా తాలిబన్లు విజయం సాధించలేదని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి పాకిస్థాన్ ముందు నుంచి తాలిబన్లతో సంబంధాలను కొనసాగిస్తోంది. 1994లో ఈ సంస్థ ఆవిర్భావం నుంచి, 1996లో అఫ్గాన్‌ను మొదటిసారి స్వాధీనం చేసుకోవడం, 9/11 దాడుల తర్వాత నాయకులకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం.. వంటి ప్రతి అంశంలోనూ పాక్ ప్రమేయం ఉంది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. తాలిబన్ల ఉద్యమాన్ని ISI నిలబెట్టింది. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్ సంస్థలకు ఐఎస్‌ఐ అన్ని రకాలుగా సాయం చేసింది, చేస్తోంది. శిక్షణ, నిధులు, మందుగుండు సామగ్రి.. వంటివన్నీ ఆ సంస్థ నుంచే అందుతున్నాయి. తాలిబన్ల వ్యూహాత్మక నిర్ణయాలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ISI ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గణనీయమైన ప్రభావం చూపుతుంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం, సెంట్రల్ ఆసియాలో ప్రభావం చూపడమే లక్ష్యంగా ఐఎస్‌పై గత మూడు దశాబ్దాలుగా తాలిబన్లను పెంచి పోషిస్తోంది.
Afghanistan: అమెరికాకు తాలిబన్ల వార్నింగ్.. వెంటనే వారి తరలింపు ఆపాలని హెచ్చరిక
* అఫ్గానిస్థాన్‌లో భారత పెట్టుబడులు ఎందుకు ప్రమాదంలో ఉన్నాయి?
2001లో అమెరికా నేతృత్వంలోని దళాలు తాలిబన్లను తరిమికొట్టిన తరువాత, అఫ్గాన్ అభివృద్ధిలో భారత్ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. గత రెండు దశాబ్దాలలో అఫ్గానిస్థాన్ పునర్నిర్మాణం కోసం 3 బిలియన్ డాలర్లను కేటాయించింది. 90 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఆ దేశానికి పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ఇచ్చింది.
హెరాత్ చేష్టే షరీఫ్ జిల్లాలో సల్మా డ్యామ్‌ను కూడా భారతదేశం నిర్మించింది. కాబూల్‌లోని అఫ్గాన్ విదేశాంగ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వందేళ్ల నాటి స్టోర్ ప్యాలెస్ పునరుద్ధరణకు సాయం చేసింది. రూ.600 కోట్లతో జరంజ్-దేలారం హైవేని నిర్మించింది. భారతదేశం చేపట్టిన ఈ అభివృద్ధి కార్యకలాపాలు పాక్ ఐఎస్‌ఐకి పక్కలో బల్లెంలా మారాయి. భారత్ అఫ్గాన్‌లో ఎంత ప్రభావవంతంగా వ్యవహరిస్తే, తమకు అంత నష్టమని ఆ సంస్థ భావిస్తోంది. అఫ్గాన్‌ను మన దేశం నిర్మాణాత్మకంగా ఆక్రమించుకుంటోందని పాక్ గతంలో ఆరోపించింది. ఈ క్రమంలో కొత్త ఉగ్రసంస్థ సాయంతో అఫ్గాన్‌లో భారత ఆస్తులను నాశనం చేసేందుకు ఐఎస్‌ఐ కుట్రపన్నింది.
Afghanistan: కాబూల్‌లో విమానం హైజాక్... ఏం జరిగిందంటే...
* భారత్‌పై తాలిబన్ల దృక్పథం ఎలా ఉంది?
తాలిబన్లు భారతదేశాన్ని అమెరికాకు మిత్రదేశంగా, తమకు ప్రత్యర్థిగా భావిస్తారు. భారత్, తాలిబన్లకు పరస్పర అపనమ్మకం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి ఐఎస్ఐ పదేపదే సాయం అందిస్తోంది. ఉదాహరణకు, కందహార్‌లో ఇటీవల భారతదేశం తాలిబన్లపై బాంబు దాడి చేసినట్లు ఐఎస్ఐ తాలిబన్లను నమ్మించినట్లు సమాచారం. అఫ్గాన్ రక్షణ విభాగానికి భారతదేశం హెలికాప్టర్లు, సైనిక విమానాలను అందజేసిందని ఐఎస్‌ఐ తాలిబన్లను ఎగదోస్తోంది.
కాబూల్ విమానాశ్రయంలో భారత్ యుద్ధ విమానాలు ఏర్పాటు చేసిందని, భారత పైలెట్లే వాటిని నడిపిస్తున్నారని ఐఎస్‌పై తాలిబన్లను నమ్మిస్తోంది. ఐఎస్ఐ చర్యలు తాలిబన్లతో తన పరపతిని సుస్థిరం చేసుకునేలా ఉన్నాయని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్గాన్‌లో భారతదేశం పాత్రను తగ్గించడానికి ఐఎస్‌పై పావులు కదుపుతోందని విశ్లేషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Pakistan, Taliban, Terrorism