news18-telugu
Updated: November 25, 2020, 2:29 PM IST
ఫ్రతీకాత్మక చిత్రం
లైంగిక దాడికి పాల్పడిన వారికి కొన్ని దేశాల్లో కఠినమైన శిక్షలు విధిస్తారు. ఇస్లామిక్ దేశాల్లో రేపిస్టులను బహిరంగంగా చంపుతారు. ఇలాంటి చర్యల వల్ల తప్పు చేయాలనుకునేవారు భయపడతారని భావిస్తారు. తాజాగా రేపిస్టులకు కొత్త శిక్షను విధించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ (రసాయనాలతో నపుంసకుడిని చేయడం) శిక్ష విధించే చట్టానికి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయంగా అంగీకరించాడని వార్తలు వినిపిస్తున్నాయి.
లైంగిక వేధింపుల కేసులను వేగంగా పరిష్కరించడంపై ఇమ్రాన్ ఖాన్ దృష్టి పెట్టాడని, వీటికి సంబంధించిన చట్టాన్ని కూడా ఆమోదించారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఫెడరల్ క్యాబినెట్ మీటింగ్లో న్యాయ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను మంత్రిమండలి ఆమోదించినట్లు జియో టీవీ తెలిపింది. కానీ దీని గురించి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. పోలీసు విభాగంలో మహిళల నియామకాలను పెంచడం, రేప్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించడం, సాక్షుల రక్షణ వంటి అంశాలు న్యాయ శాఖ ప్రతిపాదించిన ముసాయిదాలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
పారదర్శకంగా అమలు
క్యాబినెట్ మీటింగ్లో కొత్త చట్టంపై చర్చలు జరిగాయి. రేప్ కేసుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. దేశ పౌరులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కొత్త చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని ఇమ్రాన్ తెలిపారు. అత్యాచారం నుంచి బయటపడిన వారు, బాధితులు భయం లేకుండా ఫిర్యాదులు చేయాలని ఆ దేశ ప్రజలను కోరాడు. ప్రభుత్వం వారి గోప్యతను కాపాడుతుందని చెప్పారు.
ఉరితీయాలంటున్న మంత్రులు
లైంగిక దాడికి పాల్పడిన వారిని బహిరంగంగా ఉరి తీయాలని కొంతమంది మంత్రివర్గ సభ్యులు సిఫారసు చేసినట్లు మీడియా సంస్థలు తెలిపాయి. కానీ కాస్ట్రేషన్ తో కఠినమైన శిక్షల అమలు ప్రారంభిద్దామని ఇమ్రాన్ చెప్పాడు. అత్యాచార దోషులకు కఠినమైన శిక్షలను విధించాలని ఫెడరల్ క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదించింది. ఈ చట్టాన్ని త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడతామని అధికార పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ సెనేటర్ ఫైసల్ జావేద్ ఖాన్ ట్విట్టర్లో తెలిపాడు. పాకిస్థాన్లో అత్యాచార నిరోధక చట్టాల గురించి గత కొన్ని సంవత్సరాల్లో చాలా చర్చలు జరిగాయి.
పెరుగుతున్న కేసులులాహోర్లో 2018 జనవరిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు, ఇటీవల లాహోర్లో నమోదైన గ్యాంగ్ రేప్ కేసులు ఆ దేశంలో చర్చనీయంగా మారాయి. లైంగిక వేధింపులను నివారించడానికి కఠిన శిక్షలు విధించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో... లైంగిక నేరస్థుల గుర్తింపు, కేసు నమోదు, అత్యాచార శిక్షలు, పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించి సమర్థవంతమైన పోలీసింగ్ విధానాన్ని రూపొందిస్తామని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా మూడంచెల చట్టాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతుందని చెప్పారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 25, 2020, 2:29 PM IST