నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి తర్వాత జాతీయ అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానంలో ఓడిపోయి పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన చేశారు. తనను గద్దె దించడం వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని తొలి నుంచీ ఆరోపిస్తోన్న ఆయన ఇప్పుడు దేశంలో మరో స్వాతంత్ర్యపోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, ఇందులో ప్రజలంతా పాల్గొనాలలని పిలుపునిచ్చారు. ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత ఖాన్ తన తొలి ప్రకటనలోనే కొత్త సర్కారుకు చుక్కలు చూపించబోతున్నట్లు హెచ్చరికలు పంపారు..
పాకిస్తాన్ లో అధికార పీటీఐ పార్టీకి మిత్రులు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఇమ్రాన్ ఖాన్ సర్కారు మెజారిటీ కోల్పోవడం, అసెంబ్లీ-సుప్రీంకోర్టు మధ్య కొన్నాళ్ల దోబూచులాట తర్వాత, ఆదివారం అర్థరాత్రి తర్వాత ఖాన్ ప్రభుత్వం కుప్పకూలడం తెలిసిందే. పదవి కోల్పోయిన తర్వాత పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో మరో మారు స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. ఇవాళ్టి నుంచే ఉద్యమం మొదలైందని ప్రకటించిన ఆయన.. విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా మళ్లీ పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘1947 లోనే పాక్ స్వతంత్ర దేశమైంది. కానీ.. విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా.. మళ్లీ స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. పాకిస్తాన్ ప్రజలే తమ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటారు’అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. పీటీఐ సర్కారును కూలదోసిన తర్వాత విపక్షాలన్నీ కలిసి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N)పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ను దేశానికి కొత్త ప్రధానిగా ఎన్నుకున్నాయి.
కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే, పాత(ఇమ్రాన్) ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసిన పలువురిపై కేంద్ర సంస్థల దాడులు, సోదాలు మొదలయ్యాయి. దీంతో ఎదురుదాడి చేయకతప్పదని ఇమ్రాన్ డిసైడ్ అయ్యారు. ఆదివారం సాయంత్రమే పీటీఐ కోర్ కమిటీ సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్త ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని పీటీఐ ముఖ్యులు ప్రకటనలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఇవాళ రాత్రిలోగా ఉద్యమకార్యాచరణ ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.