గత నెలలో పాకిస్తాన్‌లోని లాహోర్‌లో బాంబు పేలుడ జరిగిన విషయం తెలిసిందే. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు సంభవించింది. ఐతే ఘటనపై తాజాగా పాకిస్తాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్‌పై దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది. లాహోర్ బాంబు పేలుడు వెనక భారత్ హస్తముందని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసుఫ్ ఆరోపించారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బాంబు దాడి ప్రధాన సూత్రధారి భారత్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. భారత ఇంటెలిజెన్స్ సంస్థ 'రా' కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని అన్నారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని.. వారి దగ్గరి నుంచి లభ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తే సంచలన విషయాలు తెలిశాయని మోయిద్ యూసుఫ్ అన్నారు. భారత్‌లో రా సంస్థ కోసం పనిచేస్తున్న ఓ వ్యక్తే దీని వెనక ఉన్నాడని ఆరోపించారు.
ఐతే అతడి పేరు, ఇతర వివరాలను మాత్రం చెప్పలేదు. భారత్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని.. త్వరలోనే పూర్తి వివరాలను బయటపెడతామని అన్నారు. కాగా, జూన్ 23న లాహోర్‌లోని లష్కరే తోయిబా సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. హఫీజ్ సయీద్ లక్ష్యంగా చేసుకునే బాంబు దాడి జరిగినట్లు పాకిస్తాన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది. హఫీజ్ ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ వాహనాన్ని నిలిపాడని, కొద్దిసేపటి తర్వాత అది పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు జరిపారు. ఐతే ఈ పేలుడు నుంచి హఫీజ్ తప్పించుకున్నాడు.
మరోవైపు లాహరో బాంబు దాడి కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసినట్లు పంజాబ్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ ఇనామ్ గని ఇప్పటికే తెలిపారు. అరెస్టైన వారిలో ఒక ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు కూడా ఉన్నట్లు వెల్లడించారు. బాంబులతో నింపిన కారును హఫీజ్ సయీూద్ ఇంటి సమీపంలో పార్క్ చేసి వెళ్లారని.. ఆ తర్వాత కాసేపటికే పేలుడు జరిగిందని చెప్పారు. కాగా, 2008 ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. ఇతర ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా అతడిని టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. హఫీజ్ సయీద్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. ఐనప్పటికీ అతడికి పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తూనే ఉంది. భారత్, అమెరికా నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా ఆశ్రయం కల్పిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, Pakistan