OVER 700 KILLED IN AFRICA CYCLONE UN SAYS MORE FLOODS LIKELY MS
ప్రకృతి విలయానికి ఆఫ్రికా విలవిల.. 700 మంది మృతి..
వరదల ధాటికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలిస్తున్న జింబాంబ్వేలోని చిమనిమని వాసులు(REUTERS/Philimon Bulawayo)
Africa Cyclone : ప్రస్తుతం 1500 మంది వరదల్లో అత్యవసర సహాయం కోసం ఎదురుచూస్తున్నారని మొజాంబిక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్లు, పడవల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పాయి.
తుఫాన్, వరదల ధాటికి ఆఫ్రికా అతలాకుతలం అవుతోంది. ప్రకృతి బీభత్సానికి ఆఫ్రికాలోని దక్షిణాది ప్రాంతంలో ఇప్పటికే 700 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఒక్క మొజాంబిక్ లోనే 417 మంది చనిపోగా.. జింబాబ్వేలో 259 మంది, మాలావిలో 56మంది చనిపోయినట్టు సమాచారం.అలాగే వేలాదిమంది ప్రజలు చెట్ల పైనా.. ఇంటి పైకప్పుల పైనా కూర్చొని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మొజాంబిక్, జింబాబ్వే, మాలవిలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి కూడా కాస్త మెరుగ్గానే ఉందని మొజాంబిక్ వాతావరణశాఖ మంత్రి సెల్సో కొరెయా తెలిపారు.
మేము నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలన్ని వరదలకు తడిచిపోయాయి. పిల్లలను పట్టుకుని ఇప్పుడెక్కడికని వెళ్లాలో తెలియడం లేదు. నిరాశ్రయులుగా మిగిలిపోయాం.
— మిమి మాన్యుయెల్, వరద బాధితురాలు
మూడు దేశాల్లో మొత్తం 20 లక్షల పైచిలుకు ప్రజలు వరదల బారిన పడినట్టు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 1500 మంది వరదల్లో అత్యవసర సహాయం కోసం ఎదురుచూస్తున్నారని మొజాంబిక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హెలికాప్టర్లు, పడవల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పాయి. రానున్న రోజుల్లో తుఫాన్ మరింత తీవ్రమై వరదల ఉధృతి పెరగవచ్చునని ఐరాస ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మున్ముందు పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.