మూడు రోజుల్లో ముగుస్తుందన్నారు.. 365రోజులు గడిచినా ఎండకార్డ్ పడలేదు.. రష్యా(Russia) గెలుపు నల్లేరు మీద నడకే అన్నారంతా.. యుద్ధం క్షేత్రంలో మాత్రం సీన్ పూర్తిగా భిన్నం.. రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలై ఇవాళ్టికి సరిగ్గా ఏడాది..! తమ వాళ్ల ఊపిరింతా బూడిదైపోయిన ఆ క్షణాలు ఇప్పటికీ యుక్రెయిన్(Ukraine) ప్రజలు కళ్ల ముందు కదలాడుతునే ఉంది. తెల్లవారకముందే..ఎరుపు రంగుతో, బాంబుల శబ్దంతో నిద్రలేచిన యుక్రెయిన్ ప్రజల దుస్థితి ఇప్పటికీ అలానే ఉంది. ఎప్పుడు ఎవరూ వచ్చి మీద పడతారో తెలియదు.. ఎటు నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియదు.. గ్యారంటీ మాటేమోగాని వారంటీలేని జీవితాలు అక్కడ ప్రజలివి. యుక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న నిర్విరామ భీకర దాడుల్లో వేలాది మంది మరణిస్తున్నారు. భీకర బాంబుల వర్షంలో యుక్రెయిన్ నగరాలు తడిసి ముద్దవుతున్న సమయంలో ఇప్పుడిప్పుడే ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు.
లక్షల్లో మరణాలు.. కోట్లలో నష్టాలు
యుద్ధమంటే విధ్వంసమే, విషాదమే. అసంఖ్యాక ప్రజానీకానికి తీరని వ్యథను మిగుల్చుతుంది. రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఇరు దేశాలు కూడా అధికారికి లెక్కలు చెప్పనప్పటికీ.. కేవలం మరణించిన సైనికుల సంఖ్యే 3లక్షలు దాటి ఉంటుందని అంచనా. అటు యుద్ధం కారణంగా పెట్టేబెడా సర్ధుకోని పోరుగు దేశాలు వెళ్లిపోయిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. యుద్ధం కారణంగా దేశం విడిచి ఇతరదేశాలకు వలసపోయిన యుక్రెయిన్ శరణార్థుల సంఖ్య 80లక్షలు పైమాటేనని గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో అత్యధికంగా 15 లక్షల మందికి పోలండ్ మాత్రమే ఆశ్రయం ఇచ్చిందట. ఇక యుద్ధం కారణంగా దెబ్బతిన్న యుక్రెయిన్ పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.29 లక్షల కోట్లు అని ఒక అంచనా. అటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యుద్ధం అనేక నష్టాలను మిగిల్చింది. అసలే కరోనా కష్టాల్లో మునిగివున్న ప్రపంచం, అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యం కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం చేసే యుద్ధాలను భరించగలిగే స్థితిలో లేదు. అందుకే యుద్ధం ఆపాలంటూ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను, ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్‌ను ప్రపంచదేశాధినేతలు మొరపెట్టుకుంటున్నారు.
ఎండ్‌కార్డ్ ఎప్పుడు..?
బాంబుల మోతతో దద్దరిల్లుతున్న యుక్రెయిన్-రష్యా పరిణామాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. అసలు ఈ యుద్ధం ఆగేదెప్పుడో ఎవరికి అర్థమవ్వడంలేదు. ఏ ఆలోచనల వెనకాల ఎవరి ప్రయోజనాలున్నాయో.. ఈ భయానక పరిణామాలకు కారణం రష్యానా.. అమెరికానా అన్నది అటుంచితే బలైపోతున్నది మాత్రం యుక్రెయిన్ ప్రజలే. క్రిమియా తరహాలో యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలన్నది పుతిన్ ఆలోచన. అదే ప్లాన్‌తో మొదట 2లక్షల మంది సైన్యంతో బరిలోకి దిగారు.. ఇప్పుడా సంఖ్య 5లక్షలు దాటింది.. అయినా యుక్రెయిన్ ప్రతిఘటనను ఎదుర్కొలేకపోతోంది రష్యా. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో విడిపోయిన యుక్రెయిన్ ఎప్పటికైనా తనదేననీ, తనతోనే ఉండాలనీ పుతిన్ కోరుకుంటున్నారు. అనేక కీలకమైన రక్షణరంగ పరిశ్రమలు, క్షిపణి తయారీ వ్యవస్థలు, అపారఖనిజ సంపదతో వేరుపడిన యుక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యాకు కీలకం. అందుకే పుతిన్ వెనక్కి తగ్గడంలేదు. అయితే పాశ్యాత్య దేశాల అండతో యుక్రెయిన్ తన పోరు కొనసాగిస్తోంది. ఇలా ఇద్దరిలో ఎవరూ తగ్గకపోవడంతో ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలాగా కనిపించడలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia-Ukraine War