బాబోయ్... ఒంటి కన్ను చేప... రాబోయే ప్రళయాలకు సంకేతమంటున్న ప్రజలు

చేపలతో భవిష్యత్తును అంచనా వేయడం కొన్ని చోట్ల జరుగుతోంది. ఆ ఏక కన్ను చేప సంగతులు తెలుసుకుందాం. అది అలా ఎందుకు ఉందో, స్థానికులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 20, 2020, 12:59 PM IST
బాబోయ్... ఒంటి కన్ను చేప... రాబోయే ప్రళయాలకు సంకేతమంటున్న ప్రజలు
ఒంటి కన్ను చేప... (Image credit: Twitter)
  • Share this:
మన భూమిలో 70 శాతం సముద్రాలే. ఈ జీవరాసి మొదట పుట్టిందే నీటిలో అంటారు. ఇప్పటికీ సముద్రాల్లో వింత వింత జీవులు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఇండొనేసియా జాలర్లకు ఓ వింత చేప కనిపించింది. ఇదో పిల్ల షార్క్ చేప. దీనికి ఒకే కన్ను ఉంది. చందమాన కథల్లో ఒంటి కన్ను రాక్షసులు ఉంటారు కదా... అలా ఈ చేపకి కూడా ఒకే కన్ను ఉండటం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సముద్రంలో ఓ పెద్ద షార్క్ చేప కనిపించింది. అతి కష్టమ్మీద దాన్ని వల వేసి పట్టుకున్నారు. వలలో పడగానే అది చచ్చిపోయింది. సరే దాన్ని కోసి... ఐస్ ముక్కల్లో పెడదాం అనుకున్నారు. తీరా పొట్ట కోస్తే... లోపల ఈ పిల్ల షార్క్ కనిపించింది. అది కూడా చనిపోయే ఉంది. అందరూ షాక్ అయ్యారు.

అక్టోబర్ 10న మాలుకూ ప్రావిన్స్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది సైక్లోప్స్ లాగా ఉందని సైైంటిస్టులు అంటున్నారు. గ్రీక్ పురాణ గాథల్లో సైక్లోప్స్ అనే జీవి ఉంటుంది. అది భారీగా ఉంటుంది. దానికి ఒకటే కన్ను ఉంటుంది. ఈ షార్క్ చేపకు కూడా... ఒకటే కన్ను... అది కూడా నుదుటి భాగంలో ఉండటం జాలర్లనే కాదు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

షార్క్ చేపల్లో 70 శాతం చేపలు... డైరెక్టుగా షార్క్ పిల్లలనే కంటాయి. మిగతా 30 శాతం జాతి షార్కులు మాత్రం గుడ్లు పెడతాయి. ఈ షార్క్ చేప... తల్లి కడుపులో పూర్తిగా తయారు కాని చేప కావచ్చనే అభిప్రాయం ఉంది. "నిజానికి తల్లి కడుపులో మూడు షార్క్ చేపలు ఉన్నాయి. మిగతా రెండూ బాగానే ఉన్నాయి. ఇది మాత్రమే చిత్రంగా ఉంది. దీని రంగు కూడా చిత్రంగానే ఉంది" అని ఓ జాలరి తెలిపారు.

సముద్ర తీరానికి చేరాక... ఆ చేప పిల్లను స్థానిక అధికారులకు ఇచ్చారు. సైంటిస్టులు దీన్ని పరిశోధించి... దీనికి అరుదైన సైక్లోపియా సమస్య ఉందని తెలిపారు. ఈ సమస్య ఉన్న జీవులు... గర్భంలో పెరిగే దశలో... లోపాలతో పెరుగుతాయి. భూమి, సముద్రాల్లో ప్రతి 200 జీవుల్లో 1 జీవికి ఈ సమస్య ఉంటోంది.

ఈ చేపకు అల్బినో సమస్య కూడా ఉంది. ఆ సమస్య ఉండే జీవులకు... మెలనిన్న సరిగా ఉత్పత్తి కాదు. అందువల్ల చర్మం తెల్లగా ఉంటుంది. ఈ చేపకు కూడా మెలనిన్ సరిగా ఉత్పత్తి కాలేదు. కొందరు స్థానికులు మాత్రం ఇలాంటి చేపలు కనిపిస్తే... చెడు జరుగుతుందని నమ్ముతున్నారు. తుఫానులు, ప్రళయాలు వచ్చేముందు... సంకేతంగా ఇలాంటి వాటిని దేవుడు పంపిస్తాడని అంటున్నారు. ఈ వాదనను సైంటిస్టులు కొట్టిపారేశారు. ఇలాంటి జీవులు ఒకవేళ పుట్టినా... గర్భం నుంచి బయటకు రాగానే... త్వరగానే చనిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి ఉన్న సమస్యలే అవి జీవించేందుకు వీలు లేకుండా చేస్తాయంటున్నారు.

2011లో కూడా ఇలాంటి చేపొకటి అమెరికాలో జాలర్లకు కనిపించింది. అది ఇలాంటి చేపే. ఇప్పుడు తాజా చేపపై పరిశోధనలు జరుగుతున్నాయి.
Published by: Krishna Kumar N
First published: October 20, 2020, 12:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading