OLDEST PERSON IN WORLD CHINA ALIMIHAN SEYITI DIES AT 135 HAILED FROM COUNTRYS LONGEVITY TOWN KOMUXERIK MKS
ప్రపంచంలోనే అత్యంత వృద్దురాలు.. 135ఏళ్ల చైనా బామ్మ కన్నుమూత.. ఆమె ఊరికి ఓ ప్రత్యేకత
135 ఏళ్లు జీవించిన అలీమిహన్ సెయితీ
అత్యంత కురు వృద్ధురాలు అలీమిహన్ సెయితీ. 135ఏళ్ల నిండు జీవితం హాయిగా గడిపిన సెయితీ ఇటీవలే తుదిశ్వాస విడిచారు. ఆమె నివసించిన కొముక్జెరిక్ పట్టణంలో 90 ఏళ్లకు పైబడిన వృద్ధులు చాలామందే ఉన్నారు. అందుకే కొముక్జెరిక్ పట్టణాన్ని దీర్ఘాయుష్షు పట్టణం (Longevity Town)అని పిలుస్తారు.
జనాభా పరంగానే కాదు.. సుదీర్ఘ జీవన ప్రమాణంలోనూ తమకు సాటెవరూ లేరని చైనీయులు భావిస్తుంటారు. ఆ భావనకు సజీవ ఉదాహరణ ఆ దేశంలోని అత్యంత కురు వృద్ధురాలు అలీమిహన్ సెయితీ. 135ఏళ్ల నిండు జీవితం హాయిగా గడిపిన సెయితీ ఇటీవలే తుదిశ్వాస విడిచారు. జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో సుదీర్ఘంగా, సుఖమయ జీవితం గడిపిన ఆమె మొన్న గురువారం కన్నుమూశారని చైనా ప్రజా వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిజానికి లెక్కప్రకారమైతే సెయితీ(135ఏళ్లు) ప్రపంచంలోనే అత్యధిక వృద్ధురాలనే రికార్డు పొందాలి. గిన్నిస్ రికార్డుల ప్రకారం జపాన్ కు చెందిన కానే తనాకా(117 ఏళ్లు) ప్రపంచంలో అత్యంత వృద్ధురాలు. మరి చైనా బామ్మ సెయితీ (135ఏళ్లు) పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎందుకు ఎక్కలేదనేది విచత్రమే.
చైనాలో అత్యంత వృద్దురాలిగా రికార్డులకెక్కిన అలీమిహన్ సెయితీ 1886 జూన్ 25న జన్మించినట్టు జిన్ జియాంగ్ కౌంటీ ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. చైనాలో జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కురాలిగా 2013లో ఆమె రికార్డు పుటల్లోకెక్కారు. కాగా, చనిపోయేంతవరకు కూడా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, సాధారణ జీవితం గడిపినట్టు అధికారులు వెల్లడించారు. వేళకు తినడం, ఇంటి పెరట్లో సూర్యరశ్మిలో అత్యధిక సమయం గడపడమే ఆమె ఆరోగ్య రహస్యమని తెలిపారు. ఆమె తన ముని మనవళ్లు, ముని మనవరాళ్లను కూడా పెంచిందట.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలీమిహన్ సెయితీ నివసించిన కొముక్జెరిక్ పట్టణంలో 90 ఏళ్లకు పైబడిన వృద్ధులు చాలామందే ఉన్నారు. అందుకే కొముక్జెరిక్ పట్టణాన్ని దీర్ఘాయుష్షు పట్టణం (Longevity Town)అని పిలుస్తారు. అక్కడి ఆరోగ్య శాఖ సేవలు కూడా ప్రజల ఆయుప్రమాణాలు మరింత పెరిగేందుకు దోహదపడుతున్నాయి. అక్కడ ప్రజలకు ఏటా ఉచిత వైద్య పరీక్షల సౌకర్యం కల్పిస్తుంటారు. అంతేకాదు, 60 ఏళ్లకు పైబడిన వారికి అనేక రాయితీలతో కూడిన సౌకర్యాలు అందిస్తూ వారి ఆరోగ్యమయ జీవనానికి ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పడుతోంది.
కమ్యూనిస్ట్ పాలనలోని చైనాలో జననాలపై గతంలో కఠిన ఆంక్షలు ఉండటం, వయసు పైబడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు ఉండటంతో క్రమంగా దేశంలో ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. రాబోయే కొన్నేళ్లలో చైనాలో పనిచేయడానికి యువత లేకుండా దేశ జనాభాలో అధికులు ముసలివాళ్లే ఉండే పరిస్థితి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసి, పిల్లల్ని విరివిగా కనండంటూ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.